logo

Hyderabad: 14 టేబుళ్లు, 16 - 25 రౌండ్లు.. విజేత తేలేదిలా..

ఎన్నికల పర్వంలో చివరిది.. అత్యంత కీలకమైన ప్రక్రియ ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. అవసరమైన అధికారులు, సిబ్బందికి విధుల కేటాయింపు పూర్తయింది. ఆదివారం వేకువ జామున 5గంటలకే ఉద్యోగులు, సిబ్బంది లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలని ఎన్నికల విభాగం ఆదేశించింది.

Updated : 02 Dec 2023 07:22 IST

ఉదయం 5గంటలకే లెక్కింపు కేంద్రాలకు అధికారలు
నియోజకవర్గానికి 14 టేబుళ్లు, తపాలా ఓట్లకు అదనం
మొదట చార్మినార్‌ ఫలితం
ఈనాడు, హైదరాబాద్‌

గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలోని లెక్కింపు కేంద్రం

ఎన్నికల పర్వంలో చివరిది.. అత్యంత కీలకమైన ప్రక్రియ ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. అవసరమైన అధికారులు, సిబ్బందికి విధుల కేటాయింపు పూర్తయింది. ఆదివారం వేకువ జామున 5గంటలకే ఉద్యోగులు, సిబ్బంది లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలని ఎన్నికల విభాగం ఆదేశించింది. ఓట్ల లెక్కింపుపై గంటపాటు ఉద్యోగులకు దిశా నిర్దేశం చేసి, అనంతరం అభ్యర్థుల సమక్షంలో ఉదయం 8గంటలకు ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటుచేసి ఈవీఎంల్లో నమోదైన ఓట్లను లెక్కిస్తామంటున్నారు. తపాలా ఓట్ల లెక్కింపునకు అదనపు టేబుళ్లు ఉంటాయి.

టేబుల్‌ వద్ద ఎవరెవరంటే..

ఓ సూపర్‌వైజర్‌, ఇద్దరు సహాయకులు, ఓ మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. అభ్యర్థులు తమ ఏజెంటును కూడా ఉంచొచ్చు. వీరు ఇచ్చే లెక్కలను సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో), కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులు సరిచూస్తారు. సవ్యమేనని నిర్ధారించుకున్నాక ఆ రౌండ్‌ ఫలితాన్ని ప్రకటిస్తారు. ఈ సారి ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి వచ్చిందని, వేగంగా ఫలితాల వెల్లడి జరగనుందని అధికారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

15 రౌండ్లలోనే..

తపాలా ఓట్లు, సర్వీసు ఓట్లను ముందుగా లెక్కిస్తారు. ఈ ప్రక్రియ 8గంటలకు మొదలైతే.. 20 నుంచి 30 నిమిషాల్లో ఫలితం వెల్లడవుతుందని అధికారుల అంచనా. హైదరాబాద్‌ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్‌ కేంద్రాలున్న నియోజకవర్గం చార్మినార్‌. అక్కడ 202 కేంద్రాల్లో ఎన్నిక జరగ్గా, ఆయా ఈవీఎంల్లోని ఓట్ల లెక్కింపు 15 రౌండ్లలో పూర్తవుతుంది. మిగిలిన స్థానాల్లో ఫలితాలకు 16 నుంచి 25 రౌండ్లు వేచిచూడాలి.

14టేబుళ్లపై ఈవీఎంలు..

ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపునకు నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటుకానున్నాయి. సహాయకులు పోలింగ్‌ కేంద్రాల ఈవీఎంలను క్రమపద్ధతిలో తీసుకొచ్చి టేబుళ్లపై ఉంచుతారు. సూపర్‌వైజర్‌ వాటిపై ఉండే రిజల్ట్‌ మీటను నొక్కి పార్టీలవారీగా నమోదైన ఓట్ల లెక్క నమోదు చేసుకుంటారు. మైక్రో అబ్జర్వర్‌ వాటిని పట్టికలో పొందుపరిచి ఆర్వోకు అందిస్తారు. అన్ని టేబుళ్ల లెక్కలను కలిపితే.. ఓ రౌండు ఫలితం వచ్చినట్లు. పరిశీలన తర్వాత సంబంధిత ఆర్వో, పరిశీలకులు ఫలితాన్ని వెల్లడిస్తారు. చివరి రౌండు ఫలితం పూర్తయ్యాక ఎన్నికల సంఘం అభ్యర్థి గెలుపును ప్రకటిస్తుంది. రిటర్నింగ్‌ అధికారి అభ్యర్థికి గెలుపు ధ్రువీకరణపత్రం అందజేస్తారు.

వీవీప్యాట్ల చీటీలనూ..

ఓటరు ఈవీఎంను నొక్కగానే.. పక్కనున్న వీవీప్యాట్‌ డబ్బాలో..సదరు అభ్యర్థి గుర్తుతో ముద్రితమైన చీటీ పడడం ఓటేసిన వారు గమనించే ఉంటారు. నియోజకవర్గంలోని ఏవేని ఐదు పోలింగ్‌ కేంద్రాల వీవీప్యాట్ల చీటీలను చివర్లో లెక్కిస్తారు. ఈవీఎం, వీవీప్యాట్ల లెక్కను సరిపోల్చేందుకు అలా చేస్తారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాల ఈవీఎంలు ఫలితాల వెల్లడిలో మొరాయిస్తే.. అప్పుడు వీవీప్యాట్ల ఓట్లను(మొదటి స్థానంలోని అభ్యర్థికి, రెండో స్థానంలోని అభ్యర్థికి మధ్య తక్కువ ఓట్ల వ్యత్యాసం ఉన్నప్పుడు) లెక్కిస్తారు.

ఆఖరుగా శేరిలింగంపల్లి

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 13 నియోజకవర్గాల్లో ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలున్న నియోజవర్గం శేరిలింగంపల్లి. అక్కడ 622 కేంద్రాల్లో పోలింగ్‌ జరిగింది. ఓట్ల లెక్కింపు 23 రౌండ్లలో పూర్తవుతుంది.

  • పోలింగ్‌ కేంద్రాలు ఎక్కువగా ఉన్న ఎల్బీనగర్‌, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాలకు 28 టేబుళ్ల చొప్పున ఎన్నికల అధికారులు ఏర్పాటుచేశారు. ఆయా నియోజవర్గాల్లో ఓట్ల లెక్కింపు 19 నుంచి 21 రౌండ్లలో పూర్తవుతుంది.
  • ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌, కల్వకుర్తి నియోజకవర్గాల్లో తక్కువ టేబుళ్ల ఏర్పాటుతో అక్కడ కూడా 19 నుంచి 23 రౌండ్లలోపు లెక్కింపు పూర్తవనుంది.
  • కూకట్‌పల్లి, మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, ఉప్పల్‌ నియోజకవర్గాల్లో 21 నుంచి 22 రౌండ్లలోపు ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని