logo

పోలింగ్‌ పెరుగుదల.. స్వల్పమే!

జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ఆసాంతం సజావుగా సాగడం అందరికీ ఉపశమనం కలిగించింది. నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్‌ సరళిని గమనిస్తే ఈసారి పురుషులు 77.47 శాతం ఓటుహక్కు వినియోగించుకుంటే, మహిళలు 76.51 శాతం మేర మాత్రమే ఓటేయడం గమనార్హం.

Updated : 02 Dec 2023 03:12 IST

2018తో పోలిస్తే తేడా 0.13 శాతం
మహిళలకంటే పురుషులే మెరుగు
న్యూస్‌టుడే, వికారాబాద్‌, తాండూరు, కొడంగల్‌, బొంరాస్‌పేట, పరిగి, ధారూర్‌, బషీరాబాద్‌, పెద్దేముల్‌

కొడంగల్‌లో వరుస కట్టిన మహిళలు, పురుషులు

జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ఆసాంతం సజావుగా సాగడం అందరికీ ఉపశమనం కలిగించింది. నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్‌ సరళిని గమనిస్తే ఈసారి పురుషులు 77.47 శాతం ఓటుహక్కు వినియోగించుకుంటే, మహిళలు 76.51 శాతం మేర మాత్రమే ఓటేయడం గమనార్హం. పురుషుల ఓటింగ్‌ శాతం 0.96 స్వల్పంగా పెరిగింది. 2018 ఎన్నికల్లో పురుషుల ఓటింగ్‌ శాతం 77.10 నమోదు కాగా, మహిళల ఓటింగ్‌ శాతం 76.63గా నమోదైంది.

అధికారులు చెప్పిన లెక్కలు, మున్సిపాలిటీలు, గ్రామాల్లో జరిగిన పోలింగ్‌ సరళిని 2018తో పోలిస్తే మొత్తంగా 0.13 శాతం మాత్రమే పెరగడం గమనార్హం.

సాయంత్రం 5 గంటలకే పూర్తి

వికారాబాద్‌ నియోజకవర్గంలో పట్టణంతోపాటు పల్లెల్లోనూ సాయంత్రం 5 గంటలకే పోలింగ్‌ పూర్తి కావడం అధికారులకు ఉపశమనం కలిగించింది. మున్సిపాలిటీలోని సంఘం లక్ష్మీభాయి పాఠశాలలో కలెక్టర్‌, ఎస్పీలు ఓటేస్తే ఇతరచోట్ల అధికారులు, నాయకులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉదయంనుంచే పలుచోట్ల మహిళలు బారులు తీరడం నేతలను ఆశ్చర్యపరిచింది. ధారూరు, వికరాబాద్‌, మర్పల్లి తదితర ప్రాంతాల్లో వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి కష్టమైనా పోలింగ్‌ కేంద్రానికి వచ్చారు. వీరితోపాటు కొత్తగా ఓటుహక్కు పొందిన యువత ఉత్సాహం చూపింది.

తాండూరులో ఓటుకు దూరం..

తాండూరులో మహిళలే ఎక్కువగా ఓటేశారు. పురుషుల కంటే మహిళలు1,925 మంది ఎక్కువగా ఉన్నారు. ఓటుకు దూరంగా ఉన్న వారు 62,074 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 29,105 మంది ఉంటే మహిళలు 32,964 మంది ఉన్నారు. 2018 ఎన్నికల్లోనూ మహిళలే ఎక్కువగా ఓటేశారు. పురుషులతో పోల్చి చూస్తే ఓటేసిన మహిళల సంఖ్య 1,041 మంది ఎక్కువ.  


తుంకిమెట్లలో అర్ధరాత్రి దాటింది

కొండగల్‌ నియోజక వర్గం, బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల గ్రామంలోని 194 పోలింగ్‌ కేంద్రంలో మూడు ఈవీఎంలు ఇబ్బంది పెట్టాయి. దీంతో పోలింగ్‌ శాతం వెల్లడించేందుకు అర్ధరాత్రి వరకు సమయం పట్టింది. వివిధ పోలింగ్‌ కేంద్రాల వద్ద రద్దీ కొనసాగింది.  


అవగాహన కల్పించినా ప్రయోజనం అంతంతే..

పరిగి నియోజక వర్గంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు గతం కంటే తక్కువగానే ఆసక్తి చూపారు. దాదాపు 60వేల మంది ఓటర్లు ఓటుకు దూరంగా ఉన్నారు. పల్లెల్లో ఎటు చూసినా కేంద్రాల్లో ఓటర్ల రద్దీ పెద్దగా కనిపించలేదు. అధికారులు ఓటు హక్కు వినియోగం పట్ల అవగాహన కల్పించినా ప్రయోజనం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. నియోజకవర్గంలోని పరిగి, పూడూరు, దోమ, కుల్కచర్ల, చౌడాపూర్‌, మహమ్మదాబాద్‌, గండేడ్‌ మండలాల్లో సెగ్మెంట్‌ మొత్తంగా 76.70 శాతం నమోదైంది. 2018 ఎన్నికలతో పోల్చితే కేవలం ఒక శాతం మాత్రమే ఓటింగ్‌ పెరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని