logo

Revanth Reddy: సీఎం పీఠంపై కొడంగల్‌ కిరణం

కొడంగల్‌ వాసుల ఉత్కంఠకు తెరపడింది. మూడు రోజులుగా మా ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎదురుచూసిన క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. సీఎల్పీ నేతగా ఎనుముల రేవంత్‌రెడ్డి పేరు ప్రకటించగానే..

Updated : 06 Dec 2023 09:49 IST

కొడంగల్‌ వాసుల ఉత్కంఠకు తెరపడింది. మూడు రోజులుగా మా ఎమ్మెల్యేని ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రకటిస్తారా అని ఎదురుచూసిన క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. సీఎల్పీ నేతగా ఎనుముల రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పేరు ప్రకటించగానే.. ఆ సెగ్మెంట్‌తోపాటు, వికారాబాద్‌ జిల్లా వాసులు ఆనందంలో మునిగిపోయారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ శ్రేణులు వీధుల్లోకొచ్చి బాణసంచా కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. ఇదే సమయంలో అభివృద్ధిపరంగా నూతన ముఖ్యమంత్రి ముందు కొన్ని ఆకాంక్షలను ఉంచారు.

👉 Follow EENADU WhatsApp Channel


జిల్లా వాసుల్లో కోటి ఆశలు

న్యూస్‌టుడే, కొడంగల్‌, బొంరాస్‌పేట

ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్‌లో పాల్గొన్న రేవంత్‌రెడ్డి. చిత్రంలో టి. రామ్మోహన్‌రెడ్డి,  బుయ్యని మనోహర్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్‌.

కొడంగల్‌.. ప్రస్తుతం ఏ నోట విన్నా ఇదే పేరు. రాష్ట్ర స్థాయిలో మారుమోగుతోంది. అందుకు కారణం..రేవంత్‌రెడ్డి. కొడంగల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే హోదా నుంచి ఒక్కో మెట్టు ఎదిగి టీపీసీసీ అధ్యక్షుడి స్థానానికి చేరుకున్న ఆయన ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్ర సీఎం కుర్చీలో ఆసీనులవుతున్నారు. రాష్ట్రాన్ని పాలించబోతున్నారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి విజయం కోసం  కార్యకర్తలు కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారం చేశారు. ఇక్కడి ప్రజలు సైతం నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించారు.

తమ ప్రాంత వాసి..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కొడంగల్‌ రాష్ట్ర రాజధానికి వంద కిలో మీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దులో ఉండటంతో నిరాదరణతో అభివృద్ధిలో వెనుకబడింది. జిల్లాల ఏర్పాటులో భాగంగా మూడు మండలాలతో వికారాబాద్‌ పరిధిలోకి వచ్చింది.  ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళ్తుంటారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి పేరును అధిష్ఠానం ప్రకటించడంతో ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.

బొంరాస్‌పేట మండల కేంద్రంలో సంబురాలు

ఎమ్మెల్యేగా సాధించిన ప్రగతి ఇది..

సాంకేతిక విద్యలో భాగంగా కోస్గి పట్టణంలో పాలిటెక్నిక్‌ కళాశాల, భవన నిర్మాణానికి నిధుల మంజూరు. కోస్గిలో బస్‌ డిపో ఏర్పాటుకు ఐదు ఎకరాల భూమిని సొంతంగా కొనుగోలు చేసి ఆర్టీసీ అధికారులకు విరాళంగా ఇచ్చారు.

  • కొడంగల్‌లో డిగ్రీ కళాశాలకు సొంతభవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు.  
  • కోస్గి, కొడంగల్‌ ఆస్పత్రులను వంద పడకలకు స్థాయి పెంచాలని ప్రతిపాదనలు పంపగా రాష్ట్ర ప్రభుత్వం 50 పడకల స్థాయిలో భవనాలు నిర్మించింది.
  • కొడంగల్‌లో అగ్నిమాపక కేంద్రం మంజూరు, మార్కెట్‌ యార్డు ఏర్పాటు, గిరిజన గురుకులానికి సొంతభవనం.

కొడంగల్‌, కోస్గి పట్టణాల్లో రోడ్ల విస్తరణ పనులకు నిధులు తీసుకొచ్చి పనులు చేపట్టారు.దౌల్తాబాద్‌లో మినీ ట్యాంక్‌బండ్‌ ఏర్పాటు చేశారు.

రేవంత్‌రెడ్డి నివాసం వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు


ఇవీ ప్రధాన హామీలు..

మరింత వృద్ధి చెందాల్సిన కళాశాల

  • వికారాబాద్‌- కృష్ణా రైల్వే లైన్‌ను కొడంగల్‌ నియోజకవర్గం మీదుగా తీసుకు రావడం.
  • ఇక్కడి ప్రాంతానికి సిమెంట్‌ పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం.
  • నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల పథకం మంజూరు చేస్తూ తీసుకొచ్చిన జీవో 69 అమలుతో సాగు నీరు.
  • డివిజన్‌స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు కొడంగల్‌లో ఏర్పాటు.

ప్రజలు ఆశిస్తున్నవివి..

ఉన్నత విద్యావకాశాలు పెంచాలి. రవాణా, సాగు నీరు, మార్కెటింగ్‌ రంగాల్లో సౌకర్యాలు కల్పించాలి. బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌ మండలాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 30 పడకల స్థాయికి పెంచాలి. నియోజకవర్గంలోని గురుకుల విద్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాలి. బీజాపూర్‌- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఉన్న బొంరాస్‌పేట చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి.


చరిత్ర సృష్టించిన రేవంత్‌రెడ్డి

వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లా అవతరించాక కొడంగల్‌ నియోజకవర్గంలోని కొడంగల్‌, బొంరాస్‌పేట, దుద్యాల, దౌల్తాబాద్‌ మండలాలు జిల్లా పరిధిలోకి రాగా, కోస్గి, మద్దూర్‌, కొత్తపల్లి, గుండుమాల్‌ నారాయణపేట జిల్లా పరిధిలోకి  మారాయి. మర్పల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి 1975, 1989లలో రెండు సార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తొలి వ్యక్తి కాగా, గతంలో రెండుసార్లు, తాజాగా వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌ ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న రెండో వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.


పరుగులిడాలి.. పాలమూరు జలాలు

వికారాబాద్‌: జిల్లాకు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు జిల్లాను సస్యశ్యామలం చేస్తాయని ఆశిస్తున్నారు. వికారాబాద్‌ పట్టణ పరిధిలోని అనంతగిరి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాల్సి ఉంది. వికారాబాద్‌ పట్టణానికి బాహ్య వలయ రహదారి (రింగ్‌రోడ్‌), వ్యవసాయ వర్సిటీ, కొత్త పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి కల్పన పెరగాలి.

  • వివిధ అభివృద్ధి పనులకు నిధుల మంజూరు, కొడంగల్‌ నియోజక వర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో జూనియర్‌ కళాశాలలు, కొడంగల్‌, కోస్గి మండలాల్లో త్రిపుల్‌ ఐటీ కళాశాలల ఏర్పాటు కావాల్సి ఉంది.
  • పరిగి నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి, పారిశ్రామిక వాడ, పాలిటెక్నిక్‌, ఐటీ కళాశాలలు, గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు.
  • తాండూర్‌ నియోజకవర్గంలోని కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణ, జిన్‌గుర్తిలో పారిశ్రామిక వాడ, ఈఎస్‌ఐ ఆస్పత్రి, కంది బోర్డు, వాయు కాలుష్య నివారణ జరగాలని కోరుతున్నారు.

అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తా

- గుర్నాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, కొడంగల్‌

రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడి ప్రాంతానికి చేయబోయే అభివృద్ధికి తన వంతుగా పూర్తి సహకారం అందిస్తా. కొడంగల్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాం.  


పేదలకు మేలు జరుగుతుంది

- రాంచంద్రారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, బొంరాస్‌పేట

కొడంగల్‌ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అవకాశం రావడంతో ఇక్కడి ప్రాంతానికి ఎనలేని మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. విద్య, ఉపాధి, వైద్య, రవాణా, రహదారుల సౌకర్యాలు మెరుగుపడుతాయి. సంక్షేమ పథకాలు ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులకు అందుతాయి. సాగు నీటి వనరులు అభివృద్ధి జరుగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని