logo

Double Bedroom Houses: ఇచ్చినవెన్ని.. ఇవ్వాల్సినవెన్ని?

గ్రేటర్‌ హైదరాబాద్‌లో నివసిస్తున్న పేదలకు మూడు నెలల క్రితం పంపిణీ చేసిన రెండు పడక గదుల ఇళ్ల వివరాలను రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు సేకరిస్తున్నారు.

Updated : 06 Dec 2023 08:42 IST

రెండు పడక గదుల ఇళ్లపై అధికారుల దృష్టి
ఎన్నికల కోడ్‌ ముగియడంతో వివరాల సేకరణ

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌లో నివసిస్తున్న పేదలకు మూడు నెలల క్రితం పంపిణీ చేసిన రెండు పడక గదుల ఇళ్ల వివరాలను రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు సేకరిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ ముగియడంతో గ్రేటర్‌ పరిధిలోని 24 శాసనసభ నియోజకవర్గాల్లో మూడు విడతల్లో పంపిణీ చేసిన ఇళ్లకు సంబంధించిన అంశాలు, లబ్ధిదారుల వివరాలతో నివేదికలను సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబరులో హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో మూడు విడతల్లో 64, 500 మంది లబ్ధిదారులను లక్కీడ్రా ద్వారా ఎంపిక చేశారు. చివరి విడతలో ఎంపిక చేసిన 39 వేల మందికి అక్టోబరు 2, 5 తేదీల్లో ఇళ్లను కేటాయించారు. నాలుగో విడతలో 10వేలకు పైగా ఇళ్లు కేటాయిస్తామంటూ అధికారులు ప్రకటించినా.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అక్టోబరు 9 నుంచి అమల్లోకి రావడంతో ఇళ్ల పంపిణీని పక్కన పెట్టేశారు. కోడ్‌ ముగిసిందంటూ జిల్లా ఎన్నికల అధికారులు సోమవారం ప్రకటించడంతో రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులు వీటిపై దృష్టిసారించారు. ఒకటి, రెండు రోజుల్లో రెండు పడక గదుల ఇళ్లున్న పటాన్‌చెరు, మేడ్చల్‌, మహేశ్వరం నియోజకవర్గాల్లోని ప్రాంతాలను పరిశీలించనున్నారు.

సదుపాయాల సంగతేంటి?

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని 24 శాసనసభ నియోజకవర్గాల్లో నివసిస్తున్న పేదలకు విడతలవారీగా ప్రభుత్వం ఇళ్లు కేటాయించింది. హైదరాబాద్‌ శివారులోని ఎనిమిది ప్రాంతాల్లో ఉన్న రెండు పడకగదుల ఇళ్లను గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో నిర్మించింది. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పంపిణీ చేసిన ఇళ్లల్లో కొన్ని చోట్ల మౌలిక సదుపాయాలు లేవని కొందరు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి పరిస్థితులున్నాయి? లబ్ధిదారుల్లో ఎంత మంది నివసిస్తున్నారు? ఇంకా ఎన్ని ఇళ్లు అప్పగించాలి? అన్న వివరాలను అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించనున్నారు. పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలా? లబ్ధిదారులకు నేరుగా ఇచ్చేందుకు సౌకర్యంగా ఉన్నాయా? అన్న అంశాలను నివేదిక రూపంలో సిద్ధం చేయనున్నారు. పంపిణీకి సిద్ధంగా ఇంకా ఉన్న ఇళ్ల వివరాలు, క్షేత్రస్థాయిలో ఇళ్ల పరిస్థితులను చూసిన అనంతరం నివేదికల్లో ఆయా అంశాలను పొందుపరచనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని