logo

రేషన్‌కార్డుల జారీపై ఆశలు.. మళ్లీ దరఖాస్తు చేస్తున్న పేదలు

కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీ పథకాలతోపాటు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వీటి అమలులో లబ్ధిదారుల ఎంపికకు రేషన్‌కార్డులు కీలకం కానున్న నేపథ్యంలో కొత్త కార్డుల జారీ అంశం తెరపైకి వచ్చింది.

Updated : 07 Dec 2023 08:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీ పథకాలతోపాటు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వీటి అమలులో లబ్ధిదారుల ఎంపికకు రేషన్‌కార్డులు కీలకం కానున్న నేపథ్యంలో కొత్త కార్డుల జారీ అంశం తెరపైకి వచ్చింది. 2014 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడం, అర్హులైన కుటుంబాల సంఖ్య పెరిగిపోవడంతో కొత్త ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభిస్తుందన్న ఆశలు అర్హుల్లో చిగురిస్తున్నాయి. సన్నబియ్యం పంపిణీతోపాటు మహిళలకు రూ.2,500, ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు 5లక్షల విద్యా భరోసా కార్డు, రూ.10లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ బీమా పథకాల లభిస్తాయని అనేక మంది మీసేవాల్లో కొత్తకార్డుల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు.

భారీగా పెండింగ్‌

రేషన్‌ కార్డుల మ్యుటేషన్లు, కొత్త కార్డుల జారీపై గత ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడంతో ఆ అంశం పెండింగ్‌లో పడిపోయింది. హైదరాబాద్‌ జిల్లాలో 6,36,698, మేడ్చల్‌-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో 7.8లక్షల మంది కార్డుదారులున్నారు. పాతకార్డుల్లో అదనంగా కుటుంబ సభ్యులను చేర్చడానికి వీలుగా పౌరసరఫరాలశాఖకు హైదరాబాద్‌ జిల్లాలో 1,28,205 దరఖాస్తులు అందాయి. తిరస్కరించినవీ, పరిశీలించినవి పోను 74,802 పెండింగ్‌లో ఉన్నాయి. రంగారెడ్డిలో 50వేలు, మేడ్చల్‌లో 40వేల వరకు పెండింగ్‌లో ఉన్నాయి.

రీసర్వే చేసినా..

పదేళ్లలో వేర్వేరు కారణాలతో అనర్హులుగా గుర్తించిన అధికారులు మూడు జిల్లాల్లో 2.8లక్షల కార్డులు తొలగించారు. వారంతా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం మరోసారి రీసర్వే చేసి అర్హులకు కార్డులు మంజూరు చేయాలంటూ గతేడాది జులైలో ఆదేశించింది. ఇంటింటి సర్వే చేపట్టిన అధికారులు ఎంత మంది లబ్ధిదారులను గుర్తించారో చెప్పలేదు. వారూ కార్డులు పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని