logo

నిజామాబాద్‌ బబ్లూను.. నిన్ను లేపేస్తా: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో చిక్కిన మందుబాబు వీరంగం

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో చిక్కిన ఒక వాహనదారుడు పోలీసు విధులను అడ్డుకోవడమే కాకుండా దుర్భాషలాడిన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసు ఠాణాలో ఆర్‌ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న అశోక్‌ మంగళవారం రాత్రి  రోడ్‌ నంబరు 45లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Updated : 07 Dec 2023 08:03 IST

జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో చిక్కిన ఒక వాహనదారుడు పోలీసు విధులను అడ్డుకోవడమే కాకుండా దుర్భాషలాడిన సంఘటన ఇది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసు ఠాణాలో ఆర్‌ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న అశోక్‌ మంగళవారం రాత్రి  రోడ్‌ నంబరు 45లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు.  11.45 గంటలకు అటుగా వచ్చిన ఒక కారును పోలీసులు నిలువరించారు. నడుపుతున్న సందీప్‌ అనే వ్యక్తికి శ్వాస విశ్లేషణ పరీక్ష నిర్వహించగా రక్తంలో మద్యం మోతాదు శాతం 75గా వచ్చింది. దీంతో ఎస్సై అశోక్‌ అతనిపై కేసు నమోదు చేశారు.

లైసెన్స్‌ కలిగి, మద్యం తాగని వ్యక్తిని తీసుకొస్తే వాహనాన్ని ఇస్తానని ఎస్సై చెప్పగా అందుకు సందీప్‌ నిరాకరించాడు. తనకే ఇవ్వాలంటూ కారును బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు కారు కదలకుండా చక్రానికి వీల్‌ క్లాంప్‌ వేశారు. అనంతరం వారు తనిఖీల్లో ఉండగా వీల్‌క్లాంప్‌ను బలవంతంగా తొలగించిన సందీప్‌ కారుతోపాటు వీల్‌క్లాంప్‌ను తీసుకొని పరారయ్యాడు.  ఎస్సై అశోక్‌ ఫోన్‌ నంబరు ద్వారా సందీప్‌ను సంప్రదించి వీల్‌క్లాంప్‌ ప్రభుత్వ ఆస్తి అని, తిరిగి ఇవ్వాలని సూచించాడు. దీంతో రెచ్చిపోయిన సందీప్‌ ఎంత ధైర్యం ఉంటే నా కారు పట్టుకుంటావు, నువ్వు నా జీతగాడివి, నేను తంతే పడాలి అంటూ తిట్టాడు. నేను తలుచుకుంటే ఈ రోజే నిన్ను లేపేస్తా..!  నిజామాబాద్‌ బబ్లూని నన్ను ఎవరూ ఏమి చేయలేరని బెదిరించాడు. బుధవారం తెల్లవారుజామున ఎస్సైకి మరోసారి ఫోన్‌ చేసి బెదిరింపులకు దిగాడు. అశోక్‌  పోలీసులకు ఫిర్యాదు చేయగా సందీప్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని