logo

MMTS: మరో 2 లైన్లలో ఎంఎంటీఎస్‌

ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు మొత్తం పూర్తయ్యాయి. ప్రధానంగా సనత్‌నగర్‌ - మౌలాలి మధ్య ఎంఎంటీఎస్‌ రెండో లైను సిద్ధమైంది. రక్షణశాఖ - రైల్వే శాఖల మధ్య రెండో లైను నిర్మాణానికి ఉన్న ఆటంకాలు తొలగడంతో పనులు శరవేగంగా పూర్తయ్యాయి.

Updated : 12 Feb 2024 08:45 IST

మార్చిలో ప్రారంభించనున్న ప్రధాని మోదీ
సిద్ధమైన సనత్‌నగర్‌ - మౌలాలి మార్గం
పూర్తయిన పనులు,  రైళ్ల సర్దుబాటులో అధికారులు

ఈనాడు - హైదరాబాద్‌: ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు మొత్తం పూర్తయ్యాయి. ప్రధానంగా సనత్‌నగర్‌ - మౌలాలి మధ్య ఎంఎంటీఎస్‌ రెండో లైను సిద్ధమైంది. రక్షణశాఖ - రైల్వే శాఖల మధ్య రెండో లైను నిర్మాణానికి ఉన్న ఆటంకాలు తొలగడంతో పనులు శరవేగంగా పూర్తయ్యాయి. రెండోదశలో భాగంగా మొత్తం 95 కిలోమీటర్ల మేర లైన్లు వేయడం, విద్యుదీకరణ, స్టేషన్ల నిర్మాణం పూర్తిచేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌ ప్రారంభోత్సవానికి మార్చి మొదటి వారంలో ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. అదే రోజు సనత్‌నగర్‌ - మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర రెండో దశ ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌ - ఘట్‌కేసర్‌ లైన్‌ కూడా అదేరోజు ప్రారంభమయ్యే అవకాశముంది. చర్లపల్లి స్టేషన్‌ ప్రారంభమయ్యాక అక్కడి నుంచి 25 జతల దూరప్రాంతాల రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఈ రైళ్లకు ప్రయాణికులు అందించాలన్నా, అక్కడ దిగినవారిని నగరానికి తీసుకురావాలన్నా.. ఎంఎంటీఎస్‌లు సమయానికి నడవాల్సిన అవసరముంది. సనత్‌నగర్‌ - మౌలాలి లైనుతోనే ఇది సాధ్యమవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.  

తీరనున్న ప్రయాణ కష్టాలు.. నగరంలో సొంత ఇల్లున్నా.. అందులో ఉండలేని పరిస్థితి చాలా మంది నగరవాసులది. మల్కాజిగిరి, అల్వాల్‌ ప్రాంతాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులు ప్రతిరోజు ఇన్ని కిలోమీటర్లు వాహనాలు, బస్సుల్లో వెళ్లలేక ఐటీ కారిడార్‌కు దగ్గర్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. తల్లిదండ్రులు మల్కాజిగిరిలో ఉండటం, పిల్లలు ఐటీ కారిడార్‌లోని హాస్టళ్లలో ఉంటూ వారాంతాల్లో ఇళ్లకు చేరుతున్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశ మౌలాలి - సనత్‌నగర్‌, హైటెక్‌సిటీ మీదుగా లింగంపల్లి అందుబాటులోకి రానుండటంతో వీరంతా సులువుగా గమ్యస్థానాలు చేరే అవకాశముంది. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఐటీ ఉద్యోగులు 25 వేల నుంచి 30వేల మంది నివాసముంటున్నారని కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బి.టి. శ్రీనివాస్‌ తెలిపారు. వీరందరికీ ఇప్పుడు మెరుగైన ప్రయాణ వనరు సమకూరనుందని సంతోషం వ్యక్తంచేశారు.

నేరుగా ఐటీ కారిడార్‌కు..

అత్యంత రద్దీగా మారిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌తో సంబంధం లేకుండా నేరుగా మౌలాలి నుంచి హైటెక్‌సిటీకి ఎంఎంటీఎస్‌లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు హైటెక్‌సిటీ వైపు ప్రయాణ కష్టాలు తీరుతాయి. మౌలాలి - సనత్‌నగర్‌ మధ్య మొత్తం 22 కి.మీ. మేర 6 స్టేషన్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. వీటి పరిధిలో ఉన్న కాలనీలు, బస్తీలకు కేవలం రూ. 5 టిక్కెట్‌తో వేగవంతమైన ప్రయాణం సాకారం కానుంది. కొత్తగా సనత్‌నగర్‌, ఫిర్జాదిగూడ, సుచిత్ర సెంటర్‌, భూదేవినగర్‌, అమ్ముగూడ, నేరేడ్‌మెట్‌, హౌసింగ్‌బోర్డు కాలనీ(ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు), మౌలాలి స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్‌ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. కేవలం రూ. 5తో 30 నిమిషాల్లో మల్కాజిగిరివాసులు ఐటీ కారిడార్‌కు చేరుకునే అవకాశం లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన రూ. 381కోట్లు అందజేస్తే కొత్త రైళ్లు కొనడానికి వీలవుతుంది. లేనిపక్షంలో ఉన్న రైళ్లలోనే సర్దుబాటు చేయాలని రైల్వే అధికారులు చూస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని