logo

Hyderbad: బలహీనంగా ఉన్నాడని చికిత్సకొస్తే.. బలైపోయాడు

బలహీనంగా ఉన్నాడని ఒక్కగానొక్క కొడుకును ఆసుపత్రిలో చేర్చిన ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది. ఉన్నట్టుండి మూర్ఛ రావడంతో బాలుడ్ని ఎమర్జెన్సీ వార్డుకు ఒళ్లో ఎత్తుకుని తీసుకెళ్తున్న సందర్భంలో ఆ తల్లీకొడుకులిద్దరూ కిందపడి గాయాలకు గురయ్యారు.

Updated : 22 Feb 2024 06:32 IST

నాంపల్లి: బలహీనంగా ఉన్నాడని ఒక్కగానొక్క కొడుకును ఆసుపత్రిలో చేర్చిన ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది. ఉన్నట్టుండి మూర్ఛ రావడంతో బాలుడ్ని ఎమర్జెన్సీ వార్డుకు ఒళ్లో ఎత్తుకుని తీసుకెళ్తున్న సందర్భంలో ఆ తల్లీకొడుకులిద్దరూ కిందపడి గాయాలకు గురయ్యారు. వారిలో బాలుడు చికిత్స పొందుతూ మృత్యుఒడికి చేరాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన నిలోఫర్‌ ఆసుపత్రిలో జరిగింది. నాంపల్లి ఎస్సై నాజింఅలీ, బాధితుల కథనం ప్రకారం... కూకట్‌పల్లి సుమిత్రానగర్‌ ఎల్లంబండ కు చెందిన ఇ.రమేష్‌, మహాలక్ష్మికి ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి తొలిచూరుగా కూతురు జన్మించగా అనారోగ్యంతో మృతిచెందింది. రెండో సంతానం సిద్ధు (ఏడాదిన్నర) కొంతకాలంగా బలహీనంగా ఉండటంతో తల్లిదండ్రులు అతన్ని నెల రోజుల క్రితం రెడ్‌హిల్స్‌లోని నిలోఫర్‌ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు. ఈ నెల 9న బాలుడికి ఒక్కసారిగా మూర్ఛ రావడంతో ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లాల్సిందిగా ఆసుపత్రిలోని సిబ్బంది సూచించడంతో తల్లి మహాలక్ష్మి సిద్ధును ఎత్తుకుని పరుగులు తీసింది. ఆమె కాళ్లకు చీర అడ్డుపడి ఆసుపత్రిలోని మెట్ల వద్ద కిందపడిపోయింది. ఒళ్లోనే ఉన్న సిద్ధు కూడా కిందపడటంతో ఇద్దరి తలలకు గాయాలయ్యాయి. దీంతో వారికి ఆసుపత్రిలోనే చికిత్స అందించారు. చిన్నారి సిద్ధు పరిస్థితి విషమించడంతో సోమవారం రాత్రి మృతిచెందాడు. స్ట్రెచర్‌పై తరలించే ఏర్పాట్లు చేసిఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మందులు కొనేందుకు వెళ్తున్న సందర్భంలో తల్లీకొడుకులిద్దరూ కిందపడ్డారని పోలీసులు చెబుతుండటం గమనార్హం. ఈ మేరకు నాంపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని