logo

ధడేల్‌.. ధడేల్‌

రాత్రయితే చాలు.. అక్కడి వారు రోజూ జాగరణ చేయాల్సిందే. తెల్లవార్లూ కొనసాగుతున్న పేలుళ్లతోపాటు బండరాళ్లను లారీల్లో లోడ్‌ చేసే పెద్దపెద్ద శబ్దాలు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Published : 22 Feb 2024 02:28 IST

రాత్రి సమయాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు

మూసాపేట, న్యూస్‌టుడే: రాత్రయితే చాలు.. అక్కడి వారు రోజూ జాగరణ చేయాల్సిందే. తెల్లవార్లూ కొనసాగుతున్న పేలుళ్లతోపాటు బండరాళ్లను లారీల్లో లోడ్‌ చేసే పెద్దపెద్ద శబ్దాలు వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మూడు నెలలుగా కొనసాగుతున్న ఈ దుస్థితిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. మూసాపేట పరిధిలో ఓ గృహనిర్మాణ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా సాగిస్తున్న వ్యవహారమిది.

వందల ఇళ్లు అదురుతున్నాయ్‌.. మైసమ్మ చెరువు ఎగువ ప్రాంతంలో ఓ స్థిరాస్తి సంస్థ భారీ గృహ సముదాయాన్ని నిర్మిస్తుంది. దీనికి ఇరువైపులా రాజీవ్‌గాంధీనగర్‌, సఫ్దర్‌నగర్‌ బస్తీలతోపాటు మెరీనా స్కై గృహసముదాయాలు విస్తరించి ఉన్నాయి. నిర్మాణ ప్రాంతంలోని బండరాళ్లను పగులగొట్టడానికి ఎక్కువగా రాత్రి నుంచి తెల్లవారేవరకూ పేలుళ్లు చేస్తున్నారు. బర్మాలతో ‘ధడేల్‌.. ధడేల్‌..’ అనే భారీ శబ్దాలు వెలువడుతున్నాయి. దీంతో రాజీవ్‌గాంధీనగర్‌, సఫ్దర్‌నగర్‌ల్లోని వందల ఇళ్లు అదురుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువగా పేదలే ఉండడం.. అన్నీ సాధారణ నివాసాలే కావడంతో మున్ముందు ఎలాంటి ముప్పు వాటిళ్లుతుందోననే ఆందోళన వ్యక్తమవుతుంది. పేలుళ్లు పూర్తయ్యాక పెద్దపెద్ద బండరాళ్లను క్రేన్ల సాయంతో టిప్పర్లలోకి లోడ్‌ చేస్తున్నారు. ఆ సమయంలో శబ్దాలు కర్ణకఠోరంగా ఉంటున్నాయి. నిర్మాణ సంస్థపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అనుమతులు లేకుండా.. పోలీసు శాఖ నుంచి అనుమతి తీసుకొని.. పగటి సమయంలో మాత్రమే పరిమిత సంఖ్యలోనే పేలుళ్లు చేసుకునే వీలుంది. సదరు గృహనిర్మాణ సంస్థ చేపడుతున్న పేలుళ్లకు ఎలాంటి అనుమతి లేదు. దీంతో రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా పేలుళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిర్మాణ స్థలం అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేది కావడంతోనే చర్యలు తీసుకోవడానికి అధికారులు జంకుతున్నారనే విమర్శలున్నాయి.


చర్యలు తీసుకుంటాం

డి.కృష్ణమోహన్‌, కూకట్‌పల్లి సీఐ

ఇక్కడి నిర్మాణాలు, భారీ శబ్దాలపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు. విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని