logo

ఇక రహదారులకు మహర్దశ

తెలంగాణ దక్షిణ ప్రాంత ప్రగతికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని మంగళవారం దిల్లీలో కలిసి పలు విషయాలపై విజ్ఞప్తి చేయడాన్ని పేర్కొనవచ్చు.

Updated : 22 Feb 2024 04:18 IST

విస్తరణకు నోచుకోనున్న మన్నెగూడ-వికారాబాద్‌-తాండూరు-జహీరాబాద్‌-బీదర్‌ మార్గాలు

న్యూస్‌టుడే, తాండూరు, జహీరాబాద్‌ : తెలంగాణ దక్షిణ ప్రాంత ప్రగతికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందుకు నిదర్శనంగా ముఖ్యమంత్రి రేంవత్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని మంగళవారం దిల్లీలో కలిసి పలు విషయాలపై విజ్ఞప్తి చేయడాన్ని పేర్కొనవచ్చు. దీన్లో దక్షిణ భాగం పరిధిలోకి వచ్చే రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)లతో పాటు రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు అనుమతుల మంజూరు కోరారు. అలాగే ముఖ్యమైన రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్‌ చేయడం గురించి చర్చించారు. దీనివల్ల వికారాబాద్‌ జిల్లాకు కలిగే ప్రయోజనాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

134 కి.మీ. పొడవు: జాతీయ రహదారులుగా విస్తరించాల్సిన రాష్ట్ర రహదారుల జాబితాలో 134 కి.మీ. పొడవు కలిగి జిల్లా పరిధిలోకి వచ్చే మన్నెగూడ-వికారాబాద్‌-తాండూరు, సంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే జహీరాబాద్‌-బీదర్‌ రహదారులున్నాయి. ప్రస్తుతం రెండు వరుసలుగా ఉన్న ప్రతిపాదిత రోడ్లు నాలుగు వరుసలతో జాతీయ రహదారులుగా మారితే జిల్లా రవాణా అనూహ్యంగా అభివృద్ధి సాధిస్తుంది. 

గతంలో అప్పా జంక్షన్‌ నుంచి 46.40 కి.మీ. విస్తరణ: హైదరాబాద్‌ శివారు అప్పా జంక్షన్‌ నుంచి మన్నెగూడ చౌరస్తా వరకు 46.40 కిలో మీటర్ల పొడవునా 60 మీటర్ల అడ్డంతో గతంలోనే బీజాపూరు రహదారి నాలుగు వరుసలుగా విస్తరణ జరిగింది. దీంతో మన్నెగూడ నుంచి హైదరాబాద్‌ వరకు వాహనాల రాకపోకలు సాఫీగా సాగిపోతున్నాయి. అయితే మన్నెగూడ నుంచి జిల్లా కేంద్రం వికారాబాద్‌ మీదుగా వ్యాపార, వాణిజ్య కేంద్రంగా పేరున్న తాండూరు వరకు 60 కిలో మీటర్ల పొడవుతో ఉన్న రహదారి కేవలం రెండు వరుసలతోనే ఉంది. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి తాండూరు మీదుగా హైదరాబాద్‌ వెళ్లే భారీ వాహనాలు వేలల్లో ఉంటున్నాయి. ఇవి కాకుండా తాండూరు, వికారాబాద్‌ పట్టణాల నుంచి మన్నెగూడ మీదుగా హైదరాబాద్‌కు వెళ్లి వచ్చే వాహనాల సంఖ్య కూడా వేలల్లోనే ఉంటున్నాయి.

ఓవైపు కంకర తేలి..మరోవైపు తరచూ ప్రమాదాలు..: ఇరుకు రోడ్ల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వికారాబాద్‌ శివసాగర్‌ చెరువును రోడ్డు ఆనుకుని ఉండడం ప్రమాదకరంగా మారింది. గతేడాది చివర్లో  మంచు బాగా కురిసి దారి కనిపించక కారు బోల్తా కొట్టి ఓ యువకుడు మృతి చెందాడు. ఇదే మార్గంలో ఇరుకుగా ఉన్న రైల్వే వంతెన రాకపోకలకు ఇబ్బందిగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని