logo

నిర్మాణం పూర్తి.. ప్రారంభంలో జాగు జాస్తి

రైతుల దిగుబడుల్ని నిల్వ చేసుకునేందుకు వీలుగా గిడ్డంగులను నిర్మించారు. పాతిక పంచాయతీల్లోని అన్నదాతల అవసరాలకు అనుగుణంగా రూ.కోటికిపైగా వెచ్చించి నిర్మాణాలు పూర్తి చేశారు. రంగులు వేసి ముస్తాబు చేశారు.

Updated : 22 Feb 2024 02:41 IST

మూడేళ్లుగా తెరుచుకోని రూ.1.10 కోట్ల విలువైన భవనాలు

అలంకారప్రాయంగా గిడ్డంగి, ఫ్లాట్‌ఫారం 

న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ: రైతుల దిగుబడుల్ని నిల్వ చేసుకునేందుకు వీలుగా గిడ్డంగులను నిర్మించారు. పాతిక పంచాయతీల్లోని అన్నదాతల అవసరాలకు అనుగుణంగా రూ.కోటికిపైగా వెచ్చించి నిర్మాణాలు పూర్తి చేశారు. రంగులు వేసి ముస్తాబు చేశారు. ప్రారంభోత్సవం చేసి వినియోగంలోకి తీసుకురావడానికి మాత్రం మూడేళ్లుగా తాత్సారం చేస్తున్నారు. 

తొలిసారిగా తాండూరు మండలంలోనే శ్రీకారం: జిల్లాలో తొలిసారిగా తాండూరు మండల పరిధి గ్రామాల్లో రూ.90లక్షలతో నాలుగు గిడ్డంగులు, గింజలు ఆరబెట్టేందుకు ఫ్లాట్‌ఫారాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఒక్కో గిడ్డంగి నిర్మాణానికి రూ.17.50లక్షలు, ఫ్లాట్‌ఫారానికి రూ.10లక్షల చొప్పున మంజూరు చేశారు. కరణ్‌కోట, అంతారం, సంగెంకలాన్‌లో నిర్మాణాలు పూర్తయి మూడు సంవత్సరాలు దాటింది. నేటికీ ప్రారంభోత్సవం చేయలేదు. అటుగా వెళ్లే వారికి తాళాలు వేలాడుతూ కనిపిస్తున్నాయి.

  • జిన్‌గుర్తిలో నెల క్రితం నిర్మాణం పూర్తి చేశారు. రంగులు వేసి నీరు, విద్యుత్‌ సదుపాయాల్ని కల్పించారు. ప్రారంభానికి నోచకపోవడంతో వేలాది మంది రైతులు వినియోగించలేని పరిస్థితి నెలకొంది.
  • గిడ్డంగుల పక్కన కరణ్‌కోట, సంగెంకలాన్‌లో ఫ్లాట్‌ఫారంలను నిర్మించారు. వీటిని ప్రారంభించక పోవడంతో అలంకార ప్రాయంగా మారాయి.
  • మరోవైపు అంతారంలో నిర్మించిన గోదాం గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. ప్రారంభించకముందే గోడలు బీటలు వారడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. ప్రజా ధనం వృథా కాకుండా నాలుగు గ్రామాల్లో నిర్మించిన గిడ్డంగులకు ప్రారంభోత్సవం చేసి అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.

అన్నదాతలకు ఎన్నెన్నో ప్రయోజనాలు: గిడ్డంగులు, ఫ్లాట్‌ఫారాలను అందుబాటులో సమకూర్చితే రైతులు పండించిన ధాన్యం, కందులు, వేరుసెనగ, సోయాబిన్‌, మొక్కజొన్న, జొన్నలు, పెసలు, మినుములు వంటి దిగుబడుల్ని నిల్వ చేసేందుకు వీలుంటుంది. విపణిలో గిట్టుబాటు ధర ఉన్నప్పుడు విక్రయించి ఆదాయం పొందేందుకు తోడ్పడుతుంది.

  • రహదారులు, ఇళ్ల ముందు, పాఠశాలల ప్రాంగణాల్లో ఆరబెట్టేందుకు పడుతున్న ఇబ్బందులు తప్పుతాయి.
  • తుఫాను, అకాల వర్షాల సమయంలో పంట ఉత్పత్తుల్ని గిడ్డంగుల్లో ఉంచి నష్టంబారి నుంచి తప్పించుకోవచ్చు. వ్యాపారులు నేరుగా గిడ్డంగుల వద్దకు వెళ్లి కొనుగోలు చేసే వీలుంటుంది. దీంతో దళారులు, మధ్యవర్తుల బెడద నుంచి రైతులకు ఊరట కల్గుతుంది. దీంతో వ్యాపారులకు నాణ్యమైన ఉత్పత్తులు పొందే వెసులుబాటు ఉండగా అన్నదాతలు మద్దతు ధర పొందేందుకు తోడ్పడుతుంది. విపణికి తరలించే రవాణా ఖర్చుల నుంచి రైతులకు ఉపశమనం కలుగుతుంది. అధికారులు వెంటనే వీటిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని