logo

కొడంగల్‌ కేక.. ప్రచారంలో కాక

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా సొంత నియోజకవర్గానికి బుధవారం వచ్చిన రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. సరిగ్గా 5 గంటల సమయంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో కోస్గికి చేరుకున్నారు.

Updated : 22 Feb 2024 05:49 IST

న్యూస్‌టుడే- కొడంగల్‌, బొంరాస్‌పేట, కోస్గి, మద్దూరు, కోస్గి గ్రామీణం

బహిరంగ సభకు హాజరైన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా సొంత నియోజకవర్గానికి బుధవారం వచ్చిన రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. సరిగ్గా 5 గంటల సమయంలో ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో కోస్గికి చేరుకున్నారు. ఆయన సభలో అడుగుపెట్టినప్పుడు ప్రజలు పెద్దఎత్తున కేరింతలతో అభివాదం చేశారు.

ఒకేసారి వేలకోట్ల రూపాయల పనులకు అంకురార్పణ జరగడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది. కోస్గి పట్టణంలో ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పెద్దపెద్ద ప్లెక్సీలతో శివాజీ కూడలి రంగులమయంగా మారింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలోని పలు నియోజకవర్గాలతో పాటు వికారాబాద్‌, పరిగి, తాండూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. కొడంగల్‌ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ ప్రాంతంలో హర్షం వ్యక్తమయ్యింది.

  • విద్యాసంస్థలు, సాగు నీటి పథకాలు, రహదారులకు పెద్దపీట వేయడం అందరినీ మెప్పించింది. రెండేళ్లలో పేట-కొడంగల్‌ ఎత్తిపోతల ద్వారా 1.3లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతుందన్న మంత్రుల ప్రసంగాలతో భూములు సస్యశ్యామలంగా మారుతాయన్న ఆశ రైతుల్లో వ్యక్తమయ్యింది. ఉపాధి అవకాశాలు మెరగుపడతాయని యువత భావిస్తున్నారు.
  • ముఖ్యమంత్రి తన ప్రసంగంలో కేసీఆర్‌పై విమర్శలు గుప్పించినప్పుడల్లా సభలో ప్రజలు పెద్దఎత్తున స్పందించారు. సభకు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ సంఘీభావాన్ని తెలిపారు. 
  • కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డిని సభావేదికపై తన పక్కనే రేవంత్‌రెడ్డి కూర్చోబెట్టుకోవడం కాంగ్రెస్‌ కార్యకర్తల్లో ఉత్తేజం కలిగించింది. 
  • సీఎం సభకు రాకముందు నియోజకవర్గంలోని నాయకులు, ప్రజాప్రతినిధులకు సభావేదికపై ప్రసంగించే అవకాశం రావడం వారిని ఆనందంలో ముంచెత్తింది. రాష్ట్ర అభివృద్ధిలో సమష్టిగా పనిచేస్తామని మంత్రులు ఐక్యతారాగాన్ని ఆలపించడం పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెంచింది.  గ్రామీణ ప్రాంత ప్రజలు డప్పులు, ఆట, పాటలతో ఊరేగింపుగా సభకు తరలివచ్చారు. ట్రాఫిక్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నాయకుల ప్రసంగంలో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి పేరు ప్రస్తావించినప్పుడల్లా ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. ఎంపీగా వంశీచంద్‌రెడ్డిని గెలిపించాలని మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తమ ప్రసంగంలో కోరారు. దీంతో పాలమూరు అభ్యర్థి ఎవరనే అంశానికి తెరపడినట్లయ్యింది.

అభివృద్ధి పథకాలకు సంబంధించిన శిలాఫలకాలు

నీళ్లు, నిధులు, నియామకాలకు సోనియా తెలంగాణ ఇచ్చారు: టీఆర్‌ఆర్‌

కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీ రాష్ట్రం ఏర్పాటు చేశారు. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మన ప్రాంతానికి నీళ్లు నిధులు అందించలేదని విమర్శించారు. నారాయణపేట, కొడంగల్‌ ఎత్తిపోతల, పాలమూరు ఎత్తి పోతల పథకాలను నిలిపివేశారని ఆరోపించారు. జూరాల వెనక నుంచి నీరు వస్తే పాలమూరు జిల్లా, రంగారెడ్డి జిల్లాకు సాగునీరు వస్తుందని మాట్లాడితే ఆరోజు శాసనసభలో అవమానం చేశారన్నారు. వికారాబాద్‌, పాలమూరు జిల్లాలకు ఎలాంటి ప్రాజెక్టులు అందించలేదని గుర్తు చేశారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు 30 వేల ఉద్యోగాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందించారని తెలిపారు. 

ఉత్పత్తులను పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

మహిళా సంఘం సభ్యురాలితో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో మంత్రులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని