logo

ఉచితంగా ఇస్తూ.. ప్రాణాలను పరీక్షిస్తూ..

రెండురోజుల కిందట అత్తాపూర్‌లో ఓ వ్యక్తి పార్కులో స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు సపర్యలు చేసి ఆరా తీయగా కల్లు తాగినట్లు బదులిచ్చాడు.

Published : 22 Feb 2024 02:54 IST

మత్తు స్థాయి పరీక్షించేందుకు అమాయకులకు ఎర
విచ్చలవిడిగా కల్తీ కల్లు విక్రయాలు

ఈనాడు-హైదరాబాద్‌: రెండురోజుల కిందట అత్తాపూర్‌లో ఓ వ్యక్తి పార్కులో స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు సపర్యలు చేసి ఆరా తీయగా కల్లు తాగినట్లు బదులిచ్చాడు. ఎందుకంత తాగావని ప్రశ్నించగా.. ఉదయాన్నే దుకాణ నిర్వాహకులు ఉచితంగా ఇస్తారని, తయారుచేసిన కల్లులో ఏ స్థాయిలో రసాయనాలు కలిసాయో తెలుసుకునేందుకుగాను అలా ఇస్తారని చెప్పాడు.

ఇటీవల యూసుఫ్‌గూడ పోలీసులు స్థానికంగా కల్లు కాంపౌండ్‌లో తనిఖీలు నిర్వహించగా 50 కిలోల సోడియం బైకార్బొనేట్‌, 25 కిలోల తెల్ల పొడి, సాక్రిన్‌, చక్కెర వంటివి స్వాధీనం చేసుకున్నారు. ఈ పదార్థాలన్నీ కలిపి కల్తు తయారుచేసి విక్రయిస్తున్నట్లు నిందితులు అంగీకరిస్తున్నారు.

ఇవే కాదు.. నగరంలోని కొన్ని కల్లు దుకాణాలు కేంద్రంగా దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. దుకాణాల పరిసరాల్లో దోపిడీలు, హత్యలు ఒకెత్తయితే.. నిర్వాహకులు చేస్తున్న దాష్టీకాలకు హద్దు లేకుండా పోతోంది. రసాయనాలు, నిషేధిత మత్తుపదార్థాలు కలిపి తయారుచేస్తున్న కల్లు విక్రయించే ముందు.. ‘టెస్టింగ్‌’ పేరుతో తెల్లవారుజామున ఉచితంగా ఇస్తున్నారు. భిక్షాటన చేసేవారు, మత్తుకు బాగా అలవాటుపడిన వారికి దీన్ని ఇస్తున్నారు. ఇది తాగినవారికి బాగా మత్తు వచ్చినా, కొద్దిసేపటికే స్పృహ కోల్పోయినా అందులో రసాయనాలు ఎక్కువైనట్లు నిర్వాహకులు నిర్ధారించుకుంటున్నారు. తర్వాత డోసు తగ్గించేందుకు ఇతర మిశ్రమాలు కలుపుతారు. ఒకవేళ సాధారణంగా ఉన్నట్లు గుర్తిస్తే రసాయనం ఎక్కువ కలుపుతారు. నగరంలోని కొన్ని కల్లు దుకాణాల్లో సాగుతున్న ఈ అమానవీయ విధానంతో.. టెస్టింగ్‌ కల్లు తాగుతున్న కొందరు స్పృహ కోల్పోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలూ ఉన్నాయి.

చెట్టు లేకున్నా..

జిల్లాల నుంచి నగరానికి వచ్చే కల్లు సరిపోదు. దీంతో కొందరు ఆల్ఫ్రాజోలం, సోడియం బైకార్బొనేట్‌, డైజోఫాం, క్లోరల్‌ హైడ్రేట్‌ లాంటి ప్రమాదకర రసాయనాల మిశ్రమాలు ఉపయోగిస్తున్నారు. జిల్లాల నుంచి 100లీటర్ల కల్లు సేకరిస్తే.. వేర్వేరు మిశ్రమాలతో వెయ్యి లీటర్లు చేస్తున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి, సంగారెడ్డి జిల్లా జిన్నారం, నగరంలోని సూరారం ప్రాంతాల్లో అరెస్టయిన నిందితులిచ్చిన సమాచారంతో ఆల్ఫ్రాజోలం నెట్‌వర్క్‌ను ఛేదించి రూ.3 కోట్ల సరకును పట్టుకున్నారు.

కరవైన నిఘా

కొన్ని దుకాణాల్లో కల్తీ కల్లు విక్రయిస్తున్నా ఆబ్కారీ శాఖ తనిఖీలు చేపట్టడం లేదు. గతేడాది శివారులోని ఓ దుకాణంలో కల్లు తాగి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నిర్వాహకులు మృతదేహాన్ని బైకుపై తీసుకెళ్లి దూరంగా విసిరేశారు. ఈ వ్యవహారం కలకలం రేపినా.. ఆ దుకాణం కొనసాగుతూనే ఉంది.


శరీరంపై తీవ్ర ప్రభావం

-డాక్టర్‌ రమేశ్‌కుమార్‌, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌, ఉస్మానియా ఆసుపత్రి

నిషేధిత రసాయనాలు, ఇతర పదార్థాలతో చేసిన కల్లు తాగడం డ్రగ్స్‌ తీసుకోవడంలాంటిదే. ఇది తాగితే దీర్ఘకాలంలో అనేక అనారోగ్య సమస్యలు తప్పవు. అలవాటుపడి సమయానికి కల్లు దొరక్కపోతే.. వారి ప్రవర్తన అసాధారణంగా మారుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు