logo

ప్రేమ కలిపింది.. విధి విడదీసింది

కులాలు వేరైనా ఒకరినొకరు ప్రేమించుకున్నారు..పెద్దలను ఒప్పించుకొని ఇరు కుటుంబాలను ఏకం చేశారు.. మరో మూడు నెలల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఓ ప్రేమ జంటను పాల ట్యాంకర్‌ డ్రైవర్‌ విడదీశాడు.

Updated : 22 Feb 2024 09:21 IST

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
యువతికి తీవ్రగాయాలు

విక్కీ

శామీర్‌పేట, న్యూస్‌టుడే: కులాలు వేరైనా ఒకరినొకరు ప్రేమించుకున్నారు..పెద్దలను ఒప్పించుకొని ఇరు కుటుంబాలను ఏకం చేశారు.. మరో మూడు నెలల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఓ ప్రేమ జంటను పాల ట్యాంకర్‌ డ్రైవర్‌ విడదీశాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ప్రేమ జంటను అతిగా మద్యం తాగి డీసీఎం వ్యాన్‌తో వేగంగా ఢీ కొట్టాడు. బుధవారం జరిగిన ఈ ఘటనలో యువకుడు చనిపోయాడు..యువతి తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలైంది.

శామీర్‌పేట ఎస్సై మునీందర్‌, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. కంటోన్మెంట్‌, ఈస్టు మారేడ్‌పల్లికి చెందిన జగలింగప్ప అలియాస్‌ విక్కీ(24) బీకాం  చదువుతూనే కుటుంబ పోషణకు యూసుఫ్‌గూడలోని ఎయిర్‌టెల్‌ సంస్థలో వైఫై కనెక్షన్లు అమర్చే ఉద్యోగం చేస్తున్నారు. కంటోన్మెంట్‌లోని పికెట్‌ (లక్ష్మీనగర్‌) కాలనీకి చెందిన శేషగిరి వైష్ణవి(20)కి అతనితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి కులాలు వేరైనా ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించుకున్నారు. మరో మూడు నెలల్లో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు ప్రేమికులు ద్విచక్రవాహనంపై సిద్ధిపేటకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శామీర్‌పేటలోని రాజీవ్‌ రహదారి మీదుగా వెళ్తున్నారు. ఆరెంజ్‌బోల్‌-దర్గా చౌరస్తా వద్దకు రాగానే వెనకనుంచి వచ్చిన ఓ పాల ట్యాంకర్‌ డ్రైవర్‌ మద్యం మత్తులో అతివేగంగా ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. విక్కీ అక్కడికక్కడే మృతిచెందాడు. కొద్ది దూరం వెళ్లాక వ్యాన్‌ డ్రైవర్‌ను స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడిన వైష్ణవికి 108లో అత్యవసర చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు.

గాయపడిన వైష్ణవి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని