logo

పట్టాల దారిలో ఆలస్య ప్రయాణం

ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలో రాజధానికి వస్తున్న వేలాది మంది నిత్యం ఉదయం నరక యాతన అనుభవిస్తున్నారు. సికింద్రాబాద్‌ శివార్లలోనే గంటల పాటు రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలుపడుతూ అందులోనే ఉండాల్సి వస్తోంది.

Published : 22 Feb 2024 02:59 IST

శివార్లలోనే గంటల కొద్దీ నిలిపివేత
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లలో రాజధానికి వస్తున్న వేలాది మంది నిత్యం ఉదయం నరక యాతన అనుభవిస్తున్నారు. సికింద్రాబాద్‌ శివార్లలోనే గంటల పాటు రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలుపడుతూ అందులోనే ఉండాల్సి వస్తోంది. గంట నుంచి అయిదు గంటలు ఆలస్యంగా చేరుతుండటంతో రైల్వే అధికారులపై మండిపడుతున్నారు. 5 గంటలు ఆలస్యంగా చేరుకున్న ప్రయాణికులు బుధవారం స్టేషన్‌ మేనేజర్‌ కార్యాలయంవద్ద ధర్నాకు దిగారు.

నగరంలోని మూడు ప్రధాన రైల్వే స్టేషన్లనుంచి నిత్యం వివిధ రాష్ట్రాలకు 250 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. అత్యధికం సికింద్రాబాద్‌ కేంద్రంగా తిరుగుతుంటాయి. ఈ స్టేషన్‌లో పది ప్లాట్‌ఫాంలున్నా రైళ్లను నిలపడానికి చాలాసార్లు ఇబ్బంది ఏర్పడుతోంది. ఉదయం, సాయంత్రం కొన్ని రైళ్లను అవుటర్‌లో నిలపాల్సి వస్తోంది. ఉదయం 3 గంటల నుంచి 9 గంటల వరకు దాదాపు 40 రైళ్లు వివిధ రాష్ట్రాల నుంచి సికింద్రాబాద్‌ వస్తుంటాయి. ఉదయమే కొన్ని రైళ్లను సికింద్రాబాద్‌ స్టేషన్‌లోనే ఉంచి నిర్వహణ పనులు, శుభ్రం చేయడానికి రెండు గంటలు తీసుకుంటున్నారు. వందేభారత్‌ వంటి వాటిని పది నిమిషాల్లోనే చేస్తుండగా, ఇతర రైళ్లను తాపీగా చేస్తున్నారు. ప్లాట్‌ఫాం మీదనుంచి ఈ రైళ్లు త్వరగా కదలక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లకు అవకాశముండటం లేదు. గూడ్సురైళ్లు కూడా మరో కారణం. గతంలో గూడ్సు రైళ్లను సికింద్రాబాద్‌ నుంచి నడిపేవారు కాదు. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొన్ని నెలలుగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ మీదుగా నడుపుతున్నారు. వీటి రాకపోకల వేళ ప్రయాణికుల రైళ్లను నిలుపుతున్నారు. బుధవారం చాలా రైళ్లు గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్‌కు చేరుకోవడంతో వేలాది మంది ప్రయాణికులు ఆగ్రహంతో రైల్వే అధికారులను నిలదీయడానికి సిద్ధపడ్డారు. 07610 నంబరుతో నడిచే తిరుపతి-పూర్ణా వయా సికింద్రాబాద్‌ రైలు దాదాపు అయిదు గంటలకు పైగా ఆలస్యంగా చేరుకుంది. ఇందులో ప్రయాణికులు నల్గొండ జిల్లా బొమ్మాయిపల్లి స్టేషన్‌ మేనేజర్‌ వద్ద ఆందోళన చేశారు. సికింద్రాబాద్‌ అవుటర్‌లో గంటన్నర ఆపడంతో.. ఉదయం 4 గంటలకు రావాల్సిన రైలు 9.30 గంటలకు వచ్చింది. టాయిలెట్లలో నీళ్లు కూడా లేక ప్రయాణికులు, చిన్నారులు అల్లాడిపోయారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ వద్దా కొంతమంది.. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఠంచనుగా వచ్చే విశాఖపట్టణం గోదావరి ఎక్స్‌ప్రెస్‌ కూడా రెండు గంటలు ఆలస్యమైంది. గరీబ్‌రథ్‌ సైతం 2 గంటలు ఆలస్యంగా నడిచింది. ఇలా చాలా రైళ్లు ఆలస్యం కావడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నెలలో సగం రోజులు ఇలానే ఉంటున్నా దక్షిణమధ్య రైల్వే జీఎం పట్టించుకోవడం లేదని ప్రయాణికుల సంఘాలు మండిపడుతున్నాయి. తక్షణం చర్యలు తీసుకోకపోతే రైలు నిలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని