logo

కనకమామిడి.. కబ్జాలే దండి

రెవెన్యూ లొసుగులు ఆసరాగా కొంతమంది బడా వ్యాపారులు అక్రమార్జనకు పావులు కదుపుతున్నారు. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు.

Updated : 22 Feb 2024 05:47 IST

ఆక్రమణల చెరలో రూ.700 కోట్ల సర్కారు భూములు

ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ప్రహరీ..

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి, న్యూస్‌టుడే, మొయినాబాద్‌ : రెవెన్యూ లొసుగులు ఆసరాగా కొంతమంది బడా వ్యాపారులు అక్రమార్జనకు పావులు కదుపుతున్నారు. రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. వెరసి.. రాజధాని శివార్లలో పేదల బతుకుదెరువుకు ప్రభుత్వం పంపిణీ చేసిన రూ.700 కోట్ల విలువైన అసైన్డు స్థలం ఆక్రమణలపాలైంది. ఇదెక్కడో మారుమూల ప్రాంతంలో కాదు.. నగరానికి అత్యంత సమీపంలోని మొయినాబాద్‌లో చోటుచేసుకున్న భూ బాగోతంపై ‘ఈనాడు’ పరిశీలనలో వెలుగుచూసిన వివరాలివీ..

మొయినాబాద్‌ మండలం కనకమామిడి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 510లో 369.38 ఎకరాల ప్రభుత్వ స్థలముంది. కొన్నేళ్ల కిందట గ్రామానికి చెందిన 54 మంది పేదలకు 64.36 ఎకరాలు అసైన్డు పట్టాలుగా అప్పటి సర్కారు ఇచ్చింది. మరికొంత వివిధ అవసరాలకు కేటాయింపులు చేసింది. మరో 50 ఎకరాలను కొందరు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. ఎకరా దాదాపు రూ.10కోట్ల ధర ఉండటంతో బడా వ్యాపారుల కన్ను ఈ భూమిపై పడింది. అసైన్డు భూమిని కొంటూ మిగిలిన భూమిని కబ్జా చేస్తున్నారు. నిబంధన ప్రకారం అసైన్డు భూమిని ఇతరులకు విక్రయించకూడదు. కొందరు నిరుపేదలు తమ అవసరాల కోసం కొంత భూమిని విక్రయించారు. ఇదే అదనుగా.. పక్కనే కొన్ని ఎకరాల మేర సర్కారు భూమిని దర్జాగా కొందరు వ్యాపారులు కలిపేసుకున్నారు. ఓ వ్యాపారి ఈ ప్రభుత్వ భూమిలో ఏకంగా తన తల్లిదండ్రుల సమాధులను నిర్మించి ‘స్మృతివనం’గా మార్చేశారు. మరికొందరు చుట్టూ ప్రహరీ లేదా ఫెన్సింగ్‌ వేసుకున్నారు. ఇప్పటికీ అక్కడ విలువైన అసైన్డు, ప్రభుత్వ స్థలాల కబ్జా పర్వం కొనసాగుతూనేఉన్నా.. రెవెన్యూ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. గతంలో ఓ రెవెన్యూ అధికారి వెళ్లి అక్కడి నిర్మాణాలను కూల్చారు. ఓ వ్యాపారి ఆ స్థలంలోకి ఎవరూ రాకుండా కోర్టునుంచి ఉత్తర్వులు పొందారు. తరువాత మూడేళ్లు కావస్తున్నా.. రెవెన్యూ అధికారులు అటువైపే వెళ్లడమే మానేశారు. ఫలితం.. 70 ఎకరాలమేర ఆక్రమణల చెరలోనే ఉంది.

సర్వే నంబరు 510లో కేటాయింపులు ఇలా..

  • కనకమామిడికి చెందిన 54మంది పేదలకు అసైన్డు భూములు  64.36 ఎకరాలు
  • 220/132, 33/11కేవీఏ విద్యుత్తు ఉపకేంద్రాలకు 11 ఎకరాలు
  • అటవీ శాఖకు 10 ఎకరాలు
  • పోలో(ఎస్‌ఏఏపీ) అసోసియేషన్‌కు 25 ఎకరాలు
  • తెలంగాణ బేవరేజెస్‌ లిమిటెడ్‌ గోడౌన్‌కు 4 ఎకరాలు
  • వేంకటేశ్వర స్వామి ఆలయానికి 10 ఎకరాలు
  • గోల్ఫ్‌ కోర్సు అవార్డుదారులకు 52 ఎకరాలు
  • కొందరు ఆక్రమించి సాగు చేస్తున్నవి సుమారు 50 ఎకరాలు
  •  ప్రభుత్వ ఆధీనంలో 143.28 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతుండగా వీటిలో సింహభాగం స్థలాలు ఆక్రమణల చెరలోనే ఉన్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని