logo

చోరీలు పాతకథే.. ఇప్పుడంతా సైబర్‌ నేరాలే

అర్థరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకోవడం.. అడ్డొస్తే హతమార్చి సొత్తు కాజేయడం.. ఒకప్పుడు నేరగాళ్ల పంథా..! నగరంలో ఈ తరహా దోపిడీలు, దొంగతనాల స్థానంలో సైబర్‌ నేరాలు భారీగా పెరిగిపోవడం కలవరపెడుతోంది.

Published : 22 Feb 2024 03:04 IST

నగరంలో చోరీ కేసుల్ని మించి నమోదు
ఏటా పెరుగుదల.. కనిపించని రికవరీ

అర్థరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి అందినకాడికి దోచుకోవడం.. అడ్డొస్తే హతమార్చి సొత్తు కాజేయడం.. ఒకప్పుడు నేరగాళ్ల పంథా..! నగరంలో ఈ తరహా దోపిడీలు, దొంగతనాల స్థానంలో సైబర్‌ నేరాలు భారీగా పెరిగిపోవడం కలవరపెడుతోంది. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్లలో గత కొంతకాలంగా చోరీలు, ఇళ్లల్లో దొంగతనాల కేసుల్లో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు. ఇదే సమయంలో సైబర్‌ నేరాల సంఖ్య గణనీయంగా నమోదవుతోంది. గత మూడేళ్ల గణాంకాలు పరిశీలిస్తే.. రాజధానిలో ఇళ్లల్లో దొంగతనాలు, వాహన, సెల్‌ఫోన్‌ చోరీలు సగటున 9- 10వేల మధ్య రికార్డు కాగా.. సైబర్‌ నేరాలసగటు పెరుగుదల 10-15 శాతం కంటే ఎక్కువగా ఉంటోంది. బాధితులు పోగొట్టుకునే సొత్తు రూ.వందల కోట్లలో ఉంటోంది. ఒక్క 2023లోనే నగరంలోని 3 కమిషనరేట్లలో కలిపి సుమారు రూ.450 కోట్లు పోగొట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దొంగతనాలు, ఇతర చోరీల్లో పోగొట్టుకునే సొత్తు కంటే ఇది కనీసం 10 రెట్లు ఎక్కువఉంటుందని అంచనా వేస్తున్నారు.

రాబట్టడం కత్తి మీద సామే

దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌ తదితర కేసుల్లో కాజేసిన సొత్తు రికవరీ చేసేందుకు ఎక్కువ అవకాశాలుంటాయి. నిందితుల ప్రమేయం నేరుగా ఉండడం.. సీసీ పుటేజీలు, వేలిముద్రలు, ఇతర సాంకేతిక ఆధారాలతో తేలిగ్గా చిక్కుతారు. సీఈఐఆర్‌(సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌) వెబ్‌సైట్‌ అందుబాటులోకి రావడంతో చోరీ/పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల రికవరీ కూడా పెరుగుతోంది. అదే సైబర్‌ నేరాల్లో రికవరీ రేటు మాత్రం సరాసరి 5 శాతం కూడా ఉండడం లేదు. నిందితుల్ని కటకటాలు లెక్కించడమూ కష్టసాధ్యంగా మారుతోంది. ఉదాహరణకు హైదరాబాద్‌ కమిషనరేట్‌లో గతేడాది చోరీ కేసుల్లో మొత్తం రూ.38.38 కోట్లు సొత్తు కాజేయగా.. పోలీసులు రూ.28.45 కోట్లు (74.15%) రికవరీ చేశారు. అదే సైబర్‌ నేరాల్లో సగటున 5- 6 శాతం మాత్రమే ఉంటోంది.

అధికారికంగానే రోజుకు రూ. 3 కోట్లు

సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అంచనా ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు సైబర్‌ నేరాల బారినపడి రోజూ సగటున రూ.3 కోట్లకుపైనే పోగొట్టుకుంటున్నారు. వాస్తవానికి సైబర్‌ నేరగాళ్లు కొల్లగొట్టే సొమ్ము ఇంతకు 10 రెట్ల కంటే ఎక్కువగా ఉంటోందని అంచనా. ఒక్క నగరంలోనే రూ.కోటికిపైగా సైబర్‌ నేరగాళ్ల ఖాతాల్లోకి వెళ్తున్నాయి.

అప్రమత్తతే ఔషధం..

ఏటా భారీగా నమోదవువుతున్న సైబర్‌ నేరాల కట్టడికి ప్రజలు అప్రమత్తంగా ఉండడమే మార్గమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ముందస్తు అప్రమత్తత, కనీస రక్షణ చర్యలతో చోరీలను నివారించే అవకాశముంది. సైబర్‌ నేరాల్లో మాత్రం కొందరు తేలిగ్గా నేరగాళ్ల బుట్టలో పడిపోతున్నారు. పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీలాంటి ఉదంతాల్లో ప్రాథమికంగా రూ.వెయ్యి అంతకంటే తక్కువ మొత్తాల్లో లాభాలు చూపించి రూ.కోట్లల్లో కొట్టేస్తున్నారు. నేరం జరిగాక సకాలంలో బ్యాంకుఖాతాలు స్తంభింపజేసి.. ఇతర ఖాతాల్లోకి బదిలీ అవకుండా చూడడం, తర్వాత సాక్ష్యాలు సేకరించి న్యాయ ప్రక్రియ పూర్తిచేసి బాధితులకు డబ్బు అప్పగించడం సుదీర్ఘ ప్రక్రియ. అందుకే, అసలు నేరాలు జరగకుండా జాగ్రత్తపడేలా ప్రజల్లో అవగాహన కల్పించేలా అధికారులు ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.

ఈనాడు- హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు