logo

సంతానభాగ్యం

అత్యాధునిక ఆరోగ్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండటంతో క్లిష్టమైన చికిత్సల కోసం దేశ, విదేశాల నుంచి రోగులు హైదరాబాద్‌ వస్తున్నారు. దేశంలోనే భాగ్యనగరం వైద్య పర్యటకంగా వేగంగా ఎదుగుతోంది.

Updated : 22 Feb 2024 08:56 IST

అమెరికా, యూరప్‌, మధ్య ప్రాచ్య దేశాల నుంచి నగరానికి రాక
సంతానలేమికి చికిత్స తీసుకుంటున్న దంపతులు
ఈనాడు, హైదరాబాద్‌

అత్యాధునిక ఆరోగ్య సదుపాయాలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో ఉండటంతో క్లిష్టమైన చికిత్సల కోసం దేశ, విదేశాల నుంచి రోగులు హైదరాబాద్‌ వస్తున్నారు. దేశంలోనే భాగ్యనగరం వైద్య పర్యటకంగా వేగంగా ఎదుగుతోంది. రోగులకు చికిత్స కోసమే కాదు.. సంతానం లేని తల్లిదండ్రులు సైతం తమ లోపాలను సరిచేసుకోవడానికి దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచే కాకుండా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ చికిత్స తీసుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు.

సామాజికంగా వచ్చిన మార్పులతో ఆలస్యంగా వివాహం చేసుకోవడం, మధుమేహం, ఊబకాయం, పని ఒత్తిడి వంటి జీవనశైలి సమస్యలతో పాటు జన్యుపర లోపాలు, ఇతర కారణాలతో కొందరు దంపతులు సంతానభాగ్యానికి నోచుకోవడం లేదని వైద్యులు అంటున్నారు. ఇలాంటివారు సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. నగరంలోనే 400కిపైగా ఈ తరహా కేంద్రాలున్నాయని జీనోమ్‌ ఫౌండేషన్‌ తెలిపింది. వీటిలో స్థానికులే కాదు ఇతర రాష్ట్రాలు, విదేశాలనుంచి వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువగా సంతానలేమి సమస్యను చూస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. కెరీర్‌ ముఖ్యమని ఆలస్యంగా పిల్లలను కనాలనుకునే దంపతులు అండాన్ని/శుక్రకణాలను ఫ్రీజ్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు. కృత్రిమ గర్భధారణ చికిత్స పద్ధతుల్లో 50 ఏళ్లుగా ఎన్నో మార్పులు వచ్చాయని.. నిబంధనలమేరకు మన దగ్గర ఈ చికిత్స సులువుగా అందుబాటులో ఉండటంతో దేశ, విదేశాల నుంచి వస్తున్నారని వైద్యులు అంటున్నారు. 

పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి..

సంతాన సాఫల్య కేంద్రాలు సిటీల్లో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. దంపతుల బలహీనతల్ని కొందరు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనుమతులు లేకుండా పనిచేస్తున్నాయని, వందశాతం గ్యారంటీ అంటూ నమ్మబలుకుతున్నాయని, వీరితో జాగ్రత్త అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధానాలతో వంద శాతం గ్యారంటీగా పిల్లలు పుడతారు అనేది అబద్దమని ఈ రంగంలో రెండు దశాబ్దాల అనుభవం కలిగిన డాక్టర్‌ కృష్ణ చైతన్య అన్నారు.

కౌన్సిలింగ్‌  ప్రధానం..

పరీక్షల అనంతరం పిల్లలు పుట్టే అవకాశం ఏ మేరకు ఉందో వైద్యులు ఒక అవగాహనకు వస్తారు. అయితే కొందరిలో పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. ఆ విషయాన్ని ఆ దంపతులకు చెప్పడం చాలా కష్టమైన విషయమని డాక్టర్లు అంటున్నారు. ఇందుకోసం బాధ్యత కల్గిన ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా కౌన్సిలింగ్‌ కేంద్రాలు, కౌన్సిలర్లను ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు.  


ఆయా దేశాల నుంచి ఇటీవల పెరిగారు

- డాక్టర్‌ సుమప్రసాద్‌, ఇన్‌ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌

సంతానలేమి సమస్యలకు చికిత్స తీసుకునేందుకు అమెరికా, యూరప్‌, మిడిల్‌ ఈస్ట్‌ దేశాల నుంచి ఎంతోమంది జంటలు మన దగ్గరకు వస్తుంటారు. అక్కడ చికిత్స లేక కాదు.. మన దగ్గర వైద్య విధానం, వైద్యులు రోగులకు అందుబాటులో ఉంటారు. మన వైద్యులు అత్యాధునిక చికిత్స పద్ధతులు, విధానాలపై శిక్షణ పొంది ఉన్నారు. ఆయా దేశాల నుంచి గత 30 ఏళ్లుగా మన దగ్గరకు రావడం గమనిస్తున్నాం. ఇటీవల ఇది మరింత పెరిగింది. ఇది మంచి విషయమే. వైద్య పర్యటకంతో మనకు ఆదాయం పెరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు