logo

కలగానే.. కంది విత్తన పరిశోధన కేంద్రం!

కంది పంటను తాండూరు ప్రాంతంలో అధికంగా సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల ఎకరాల్లో పంట సాగైతే అందులో 50వేల ఎకరాలకు పైగా తాండూరులోనే సాగవుతుంది.

Published : 23 Feb 2024 02:22 IST

న్యూస్‌టుడే, తాండూరు: కంది పంటను తాండూరు ప్రాంతంలో అధికంగా సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల ఎకరాల్లో పంట సాగైతే అందులో 50వేల ఎకరాలకు పైగా తాండూరులోనే సాగవుతుంది. ఇక్కడి నేలలో నాణ్యమైన పోషకాలు ఉండడంతో కందులు నాణ్యంగా పండుతాయి. పప్పు రుచికరంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న ఇక్కడి పప్పునకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ భౌగోళిక గుర్తింపు నిచ్చింది. ఈ నేపథ్యంలో దేశీయంగా మరింత డిమాండ్‌ పెరిగింది. క్వింటా కందులకు రూ.7వేల మద్దతు ధర ఉంటే రూ.10వేల నుంచి రూ.11వేల ధర పలుకుతోంది. అయితే స్థానికంగా  కంది విత్తన వ్యవసాయ పరిశోధన కేంద్రం లేకపోవడంతో కొత్త వంగడాల ఆవిష్కరణ జరగడం లేదు. ప్రస్తుతం జొన్న, కుసుమకు సంబంధించిన వ్యవసాయ పరిశోధన స్థానంలోనే కంది వంగడాల ఆవిష్కరణకు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయి. 1990-91 నుంచి కేవలం హనుమ, టీడీఆర్‌-59 కంది వంగడాల ఆవిష్కరణ మాత్రమే జరిగింది. టీడీఆర్‌272 పేరుతో మరో వంగడం పరిశోధనలో ఉంది.

ప్రస్తుతం ఇద్దరే శాస్త్రవేత్తలు: తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో కంది విత్తన పరిశోధనలకు సంబంధించి ఇద్దరు శాస్త్రవేత్తలు మాత్రమే ఉన్నారు. వీరిలో కొత్త రకాలు కనుక్కొనే బ్రీడర్‌, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు కృషి చేసే అగ్రానమి మాత్రమే ఉన్నారు. జొన్న, కుసుమ పరిశోధనలకు సంబంధించిన కేంద్రంలోనే కంది పరిశోధనలు క్లిష్టంగా నిర్వహిస్తున్నారు. పరిశోధన కేంద్రం ఏర్పాటైతే ఎన్నో ప్రయోజనాలు ఒనగూరుతాయి. ప్రత్యేకంగా లేబోరేటరీ, అందుకు తగిన సిబ్బంది వస్తారు. కందిలో తెగుళ్ల నివారణకు కృషి చేసే ప్లాంట్‌ ఫెథాలజిస్టులతో పాటు పంటలను ఆశించే పురుగుల నివారణకు కృషి చేసే ఎంటామలజిస్టు శాస్త్రవేత్తలు అవసరమైన మేరకు వస్తారు. ప్రత్యేక కేంద్రంలో అధిక దిగుబడులను ఇచ్చే వంగడాలను కనుక్కొనేందుకు పరిశోధనలు వేగంగా జరుగుతాయి. కొత్త వంగడాలు అందుబాటులోకి వస్తే రైతులు వాటినే సాగు చేసి ఆర్థికంగా లాభపడతారు.

విశాలమైన స్థలం: తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం 1989లో ఏర్పాటైంది. ఇక్కడ రెండెకరాల లోపే వివిధ రకాల గదులు, గోదాములు నిర్మించారు. మిగిలిన స్థలాన్ని పంటల సాగుకు వినియోగిస్తున్నారు. కొత్తగా కంది విత్తన పరిశోధన స్థానం ఏర్పాటైతే పరిశోధన గదులు, లేబోరేటరీ వంటి తదితర నిర్మాణాలకు అవసరమైన స్థలం కావాల్సిన మేరకు ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.

2022లో ప్రతిపాదన చేసినా..: కంది విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని 2022లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అదే ఏడాది ఫిబ్రవరి 8న అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి తాండూరులో కంది విత్తన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయినా అమలుకు నోచలేదు. ఇప్పటి వరకు ఉన్నతాధికారులు కంది విత్తన పరిశోధన గురించి ప్రస్తావన తేలేదని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ సుధాకర్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు