logo

దారి పక్కన బిలం.. జర పైలం

తాండూరుగ్రామీణ ప్రజల రాకపోకలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. అయితే అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో ప్రధాన మార్గాల పక్కన వ్యవసాయ బావులు ప్రమాదకరంగా మారాయి.

Published : 23 Feb 2024 02:28 IST

పరిగి మండలం మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌ ప్రధాన రహదారిపై రాఘవాపూర్‌ వద్ద పొదల్లో వ్యవసాయ బావి ఉంది. రెండేళ్ల కిందట ఓ కారు అదుపుతప్పి పడిపోయినా అందులో ఉన్న వారు ప్రాణాలతో బయటపడ్డారు.


కుల్కచర్ల నుంచి చాపలగూడెం గ్రామానికి వెళ్లే దారిలో రెండు బావులు, ఒక కుంట ప్రమాదకరంగా ఉన్నాయి.

న్యూస్‌టుడే, పరిగి, కుల్కచర్ల గ్రామీణ, కుల్కచర్ల, ధారూర్‌, బొంరాస్‌పేట, కొడంగల్‌, దౌల్తాబాద్‌, వికారాబాద్‌ గ్రామీణ, దోమ, తాండూరుగ్రామీణ ప్రజల రాకపోకలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. అయితే అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో ప్రధాన మార్గాల పక్కన వ్యవసాయ బావులు ప్రమాదకరంగా మారాయి. వీటి చుట్టూ పొదలు పెరగడంతో, ఎటువంటి ఉపద్రవం ముంచుకు వస్తుందోనన్న భయాందోళన వాహనదారులను వెంటాడుతోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ‘న్యూస్‌టుడే’ జిల్లా వ్యాప్తంగా పరిశీలించగా వెలుగులోకి వచ్చిన అంశాలు ఇలా ఉన్నాయి.

మలుపులో ముప్పు..

  • కుల్కచర్ల మండల పరిధి నాగమ్మగడ్డ తండా- చెరువుముందలి తండా వద్ద మూలమలుపు వద్దే బావి ఉంది. చుట్టూ చెట్లు పెరగడంతో కనిపించడం లేదు. రెండేళ్ల కిందట జేసీబీ ఇందులో  పడిపోయింది.
  • ధారూర్‌ మండల పరిధి బాచారం సమీపంలో ప్రధాన రోడ్డులో వ్యవసాయ బావి ఉంది. ఆ నీటితోనే రైతులు వ్యవసాయం చేస్తున్నారు. దీంతో బావిని పూడ్చకుండా రక్షణ గోడను ఏర్పాటు చేశారు. అయినా అదుపు తప్పితే ప్రమాదమే.
  • పరిగి -దోమ వెళ్లే ప్రధాన రహదారి సుల్తాన్‌పూర్‌ వద్ద కుంట మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. రెgడు నెలల కిందట ఓ పాఠశాల బస్సు కుంటలోకి వెళ్లింది. విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు.
  • దోమ మండల పరిధి ఐనాపూర్‌, దిర్సంపల్లికి వెళ్లేదారిలో బావులు ప్రమాదకరంగా ఉన్నాయి. రోడ్డుకు ఆనుకుని ఉన్నా, బోర్డులు ఏర్పాటు చేయలేదు. వేగంగా వస్తే ప్రమాదం పొంచి ఉంది. దిర్సంపల్లి మార్గంలో పాలేపల్లి సమీపంలోని బావిలోకి గతంలో ద్విచక్రవాహనం దూసుకెళ్లినా, ప్రమాదం తప్పింది.

కొడంగల్‌ నియోజకవర్గంలో

  • బొంరాస్‌పేట మండలం బాపల్లితండా- సాగారం తండాల మధ్యలో గౌరారం సమీపంలో రోడ్డు పక్కనే వ్యవసాయ బావి ప్రమాదకరంగా ఉంది. దుద్యాల మండలం నాజ్‌ఖాన్‌పల్లి- చిల్ముల్‌మైలారం రోడ్డు పక్కన రెండు ప్రాంతాల్లో బావులున్నాయి.
  • దౌల్తాబాద్‌ మండలం ఈర్లపల్లి- ఊరకుంట రోడ్డులోని బావి చుట్టూ చెట్లు పెరగడంతో వాహనదారులకు కనిపించడంలేదు. దౌల్తాబాద్‌- యాంకీ, అంతారం నుంచి సుల్తాన్‌పూర్‌ మీదుగా నాగసారం, దౌల్తాబాద్‌- తిమ్మారెడ్డిపల్లి మధ్యలో బావులు ప్రమాదకరంగా మారాయి.
  • కొడంగల్‌ మండలం గుండ్లకుంట- ఉసేన్‌పూర్‌, అంగడిరాయిచూర్‌ సమీపంలో, పెద్దనందిగామ గ్రామాల రోడ్ల సమీపంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
  • తాండూరు మండలం చెంగోల్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పక్కన, సిమెంటు రహదారి వారగా చేదబావి ఉంది. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా ముప్పు పొంచి ఉంది. కరణ్‌కోట ఎస్సీ కాలనీలో నివాసాల మధ్యన చేదబావి ఉండగా మహిళలు తాడుతో కట్టిన బొక్కెన ఆధారంగా ఉదయం, సాయంత్రం నీటిని తోడుకుంటారు. అదుపుతప్పితే బావిలో పడే ప్రమాదముంది. గ్రామ శివారులోని హెడెన్‌ బావిలో ఓ యువకుడు బావిలోపడి మృతి చెందాడు.

వికారాబాద్‌ మండల అనంతగిరి ఆలయ సమీపం నుంచి వెళ్లే మార్గం, కెరెళ్లి నుంచి బుగ్గ వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా గుంతలు పడ్డాయి. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు చేపట్టలేదు. ఈ మార్గంలో నిత్యం వేలల్లో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఆయా ప్రాంతాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు