logo

అనంతగిరి.. ఔషధ ఝరి

అనంతగిరిని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే రూ.300 కోట్ల వ్యయంతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతోపాటు విలువైన ఔషధ మొక్కలను నాటి పరిరక్షించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు.

Updated : 23 Feb 2024 03:16 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌: అనంతగిరిని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటికే రూ.300 కోట్ల వ్యయంతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతోపాటు విలువైన ఔషధ మొక్కలను నాటి పరిరక్షించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. వికారాబాద్‌ను ఆనుకొని ఉన్న అనంతగిరి అటవీ ప్రాంతం 3,750 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ ఔషధ గుణాలున్న మొక్కలను గుర్తించిన అలనాటి నిజాం ఏడో నవాబు మీర్‌ ఉస్మాన్‌అలీఖాన్‌ ఛాతి వైద్య ఆస్పత్రి(క్షయ చికిత్సాలయం)ని నిర్మించారు. అందుకే ఇక్కడి ఛాతి ఆస్పత్రికి కర్ణాకట బీదర్‌, గుల్బర్గాతో పాటు చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల నుంచి క్షయ పీడితులు తరలివచ్చేవారు.

జీవవైవిధ్యం ఉట్టిపడేలా..: జిల్లాలో ఇటీవల చేసిన పరిశీలనలో 307 రకాల ఔషధ గుణాలున్న వనమూలికలు, 75 రకాల పక్షులు, 16 రకాల వన్యప్రాణులకు అనంతగిరి ప్రాంతం నెలవైనట్లుగా తేలింది. అటవీ ప్రాంతంలోని పలుచోట్ల గతంలో ఔషధ మొక్కలు నాటారు. ఉన్నవాటికి తోడు అవసరమైతే డెహ్రడూన్‌ నుంచి మరిన్ని మొక్కలను తీసుకొచ్చి  నాటాలని యోచిస్తున్నారు. పక్షులు, వన్యప్రాణులతో జీవ వైవిద్యం ఉట్టిపడేలా అనంతగిరిని రూపాంతరం చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా అనంతగిరి అటవీ ప్రాంతంలోని మైదానాల్లో, ఖాళీ ప్రదేశాల్లో ఔషధ మొక్కలు నాటారు. వీటికి నష్టం జరగవద్దని ఇప్పటి వరకు పొదలను తొలగించలేదు. ప్రస్తుతం వేప, జిల్లేడు, నక్కెర, బిల్లుడు, ఉసిరి, మర్రి, మేడి, దంతి, గుంపెన, ఇప్ప, మామిడి, చింత, నల్లజీడి, చిల్ల, తాని, కరక, పాలకొడిశ తదితర  మొక్కలను నాటి సంరంక్షించనున్నారు.  


ప్రణాళిక రూపొందిస్తున్నాం

-జ్ఞానేశ్వర్‌, జిల్లా అటవీశాఖాధికారి

ప్రస్తుతం అనంతగిరిలో ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలున్నాయి. వాటిని సంరక్షిస్తూనే, కొత్త వాటిని తెప్పించేందుకు  ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇప్పటి నుంచి మరో ఐదేళ్ల పాటు ప్రస్తుతం ఉన్న అడవిని యథాతథంగా ఉంచితే, పూర్వం ఉన్న ఔషధ మొక్కలు వాటంతటవే మొలకెత్తే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని