logo

‘ఖాజాగూడ కబ్జా కొండ’పై కదిలిన యంత్రాంగం

ఖాజాగూడలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై అధికారులు నడుం బిగించారు. ఈనెల 17న ‘ఈనాడు’లో ‘ఖాజాగూడ కబ్జా కొండ’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు.

Published : 23 Feb 2024 02:33 IST

రాయదుర్గం, న్యూస్‌టుడే: ఖాజాగూడలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై అధికారులు నడుం బిగించారు. ఈనెల 17న ‘ఈనాడు’లో ‘ఖాజాగూడ కబ్జా కొండ’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. ఖాజాగూడలో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురయ్యాయో పరిశీలన ప్రారంభించారు. గురువారం శేరిలింగంపల్లి తహసీల్దారు వెంకారెడ్డి, సర్వేయర్‌ మహేష్‌, ఏఎంఆర్‌ఐ రాంబాబు సర్వే నంబర్‌ 27, 40లలోని సర్కారు స్థలాలు, ఎల్లమ్మ చెరువు బఫర్‌ జోన్లతోపాటు వివిధ ప్రభుత్వ జాగాలను పరిశీలించారు. ఆ ప్రాంతాల్లో త్వరలోనే ప్రభుత్వ స్థలమని సూచించే బోర్డులు ఏర్పాటుచేస్తామని, కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని తహసీల్దారు స్పష్టంచేశారు. ఇప్పటికే పలు స్థలాల విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


కనకమామిడిలో ప్రభుత్వ స్థలాల కబ్జాపై ఆరా

ఇంటెలిజెన్స్‌ వర్గాలను అప్రమత్తం చేసిన సీఎంవో యంత్రాంగం

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: మొయినాబాద్‌ ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణపై ‘ఇంటెలిజెన్స్‌’ వర్గాలు ఆరా తీశాయి. గురువారం ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘కనకమామిడి.. కబ్జాలే దండి’ కథనం నేపథ్యంలో ఆక్రమణపై నివేదిక ఇవ్వాలంటూ  సీఎంవో  అధికారులు ఆదేశించినట్లు సమాచారం. దీంతో కనకమామిడి రెవెన్యూలోని సర్వేనంబర్లు-51, 510లలోని ఎసైన్డు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై అధికారులు ఆరా తీశారు. మరోవైపు మొయినాబాద్‌కు చెందిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నా.. పట్టించుకోకపోవడంపై సీఎంవో కన్నెర్రజేసినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ శశాంక ప్రభుత్వ స్థలాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


చిన్నదామర చెరువులో అక్రమ నిర్మాణాల కూల్చివేత

దుండిగల్‌, న్యూస్‌టుడే: దుండిగల్‌లోని చిన్నదామర చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు గురువారం  మొదలయ్యాయి. 8.24 ఎకరాల చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో ఎంఎల్‌ఆర్‌ఐటీఎం, ఐఏఆర్‌ఈ కళాశాలలకు చెందిన శాశ్వత భవనాలు 2, తాత్కాలిక షెడ్లు సుమారు 6, పార్కింగ్‌ కోసం రెండు రోడ్లను నిర్మించినట్లు నీటిపారుదలశాఖ, రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఈ నెల 21న ‘చెరువులోనే భారీ భవంతులు.. విద్యాసంస్థలు’ శీర్షికతో ‘ఈనాడు’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ఈ క్రమంలోనే అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. మొదటి రోజు మూడు తాత్కాలిక షెడ్లను జేసీబీతో తొలగించారు. స్థానిక అవుటర్‌ సర్వీస్‌రోడ్డుకు అనుసంధానంగా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేశారు. వాహనాల పార్కింగ్‌ కోసం చదును చేసిన మట్టిని తొలగించారు. ఎఫ్‌టీఎల్‌ హద్దులను మార్కింగ్‌ చేశారు. రెండు భవనాల యజమానులకు నోటీసులు జారీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని