logo

రూ.150 కోట్ల అటవీ భూముల హాంఫట్‌

రిజర్వుడ్‌ ఫారెస్టు భూములను ప్రైవేటు వెంచర్లలో కలుపుకుని క్రయవిక్రయాలు చేయడంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తీవ్రంగా పరిగణించింది.

Published : 23 Feb 2024 02:35 IST

కుత్బుల్లాపూర్‌, షాపూర్‌నగర్‌, న్యూస్‌టుడే: రిజర్వుడ్‌ ఫారెస్టు భూములను ప్రైవేటు వెంచర్లలో కలుపుకుని క్రయవిక్రయాలు చేయడంపై నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తీవ్రంగా పరిగణించింది. ఆ భూముల్లో 22 నిర్మాణాలు గుర్తించి 2022 జూన్‌ 30న జారీచేసిన నోటీసులపై, తీసుకున్న చర్యలు వివరించాలని జనవరి 12న అటవీ, జీహెచ్‌ఎంసీ, నీటిపారుదల శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.  

ఎన్‌ఓసీ లేకుండానే అనుమతులు.. గాజులరామారం సర్వే నంబరు 19లో 471.14 ఎకరాలు, సూరారం సర్వే నంబరు 193లో 596 ఎకరాల విస్తీర్ణంలో రిజర్వు ఫారెస్టు భూములు ఉన్నాయి. ఈ భూములపై అధికారుల నిఘా కొరవడింది. వీటిపై కన్నేసిన కొందరు పక్కన ఉన్న ప్రైవేటు పట్టా భూములు కొని,  అటవీ భూములను కొంత కలుపుకుని వెంచర్లు వేశారు. నిబంధనల ప్రకారం అటవీ శాఖ ఎన్‌వోసీ జతచేస్తేనే లేఅవుట్లకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అది లేకుండానే కొందరు 1974 డిసెంబరు 2న పంచాయతీ అనుమతి పొందిన లేఅవుట్‌ను చూపించి ప్లాట్లను విక్రయించారు. పక్కన ఉన్న అటవీ భూములనూ కలిపేసుకుని విక్రయించి సొమ్ము చేసుకున్నారు.

ఎన్‌జీటీకి ఫిర్యాదుతో కదలిక.. గాజులరామారానికి చెందిన కిరణ్‌ అనే వ్యక్తి అటవీ భూములను ప్రైవేటు వెంచర్లలో కలుపుకుని విక్రయించినట్లు ఎన్‌జీటీకి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 2022 ఏప్రిల్‌ 27న జీహెచ్‌ఎంసీ, అటవీ, నీటి పారుదల, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి, హెచ్‌ఎండీఏ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి సుమారు రూ. 150 కోట్ల విలువచేసే 50 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్లు గుర్తించారు. ఆయా వెంచర్లలోని ఫారెస్టు భూముల్లో 22 నిర్మాణాలు వెలసినట్లు గుర్తించి 2022 జూన్‌ 30న యజమానులకు నోటీసులు జారీచేశారు. తర్వాత ఇప్పటి వరకు ఆ నిర్మాణాల విషయమె ఎటువంటి చర్యలూ తీసుకోలేదు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్‌జీటీ  ఆయా శాఖల అధికారులకు నోటీసులు జారీచేయడం చర్చనీయమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని