logo

‘డ్రోన్‌ పోర్టు’ ఏర్పాటుకు భూముల పరిశీలన

డ్రోన్‌ పైలట్లకు శిక్షణ.. సాంకేతిక పరిజ్ఞానం.. డేటా విశ్లేషణ కోసం ఇస్రో నిర్మించనున్న డ్రోన్‌ పోర్టుకు ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు.

Published : 23 Feb 2024 02:39 IST

యాచారం పరిధిలో 4 గ్రామాల ఎంపిక

ఈనాడు, హైదరాబాద్‌, యాచారం, న్యూస్‌టుడే: డ్రోన్‌ పైలట్లకు శిక్షణ.. సాంకేతిక పరిజ్ఞానం.. డేటా విశ్లేషణ కోసం ఇస్రో నిర్మించనున్న డ్రోన్‌ పోర్టుకు ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు పరిశీలిస్తున్నారు. యాచారం మండలం 4 గ్రామాల్లో స్థలాలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. రెండురోజుల నుంచి ఆయా ప్రాంతాలకు వెళ్లి స్థితిగతులను విశ్లేషిస్తున్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు గత ప్రభుత్వం సేకరించిన భూముల్లో 20 ఎకరాలు కేటాయించాలంటూ ప్రభుత్వం ఆదేశించడంతో ఇబ్రహీంపట్నం రెవెన్యూ అధికారులు అక్కడ పర్యటిస్తున్నారు. డ్రోన్‌ పోర్టు ఏర్పాటుకు ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు కొన్ని సూచనలు చేయడంతో వాటి ఆధారంగా స్థలాలను ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు.  


మైదాన ప్రాంతాలే ప్రాధాన్యం: డ్రోన్‌ పోర్టును విమానాశ్రయానికి దూరంగా ఏర్పాటు చేయాలని, 20 ఎకరాల స్థలం ఒకేచోట ఉండాలని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ అధికారులు కోరారు. ఆకాశంలో చాలా ఎత్తుకు డ్రోన్లు ఎగరాల్సి ఉండటం, వాటిని కదలికలను నియంత్రించే సాంకేతిక నిపుణులకు స్పష్టంగా కనిపించేలా మైదాన ప్రాంతాలకు ప్రాధాన్యమిస్తున్నారు. తొలుత ఫార్మాసిటీకి సమీపంలో 2 గ్రామాలను పరిశీలించినా కొండలు, గుట్టలు ఉండటం, హైటెన్షన్‌ కరెంటు తీగలు వెళుతుండటంతో వద్దనుకున్నారు. ప్రస్తుతం యాచారం మండలంలోని మొండి గౌరెల్లి, కుర్మిద్ద, మేడిపల్లి గ్రామాలు, కందుకూరు మండలంలో మీర్‌ఖాన్‌పేట గ్రామంలోని స్థలాలను పరిశీలించారు. ఇన్నాళ్లు రక్షణ అవసరాలకు మాత్రమే డ్రోన్లు వినియోగిస్తుండగా ఇప్పుడు ప్రాణాధార మందుల రవాణా, వివాహ వేడుకలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలకూ వినియోగిస్తున్నారు. ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి తమకు స్థలం కేటాయించాలని అభ్యర్థించగా ఈనెల రెండోవారంలో ఒప్పందం కుదిరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని