logo

HYD Metro: మెట్రో విస్తరణకు జపాన్‌ నిధులు

మెట్రోరైలు రెండోదశలో నిధుల సమీకరణకు సంబంధించి జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా)తో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరు మార్గాల్లో 70 కి.మీ.మేర మెట్రో విస్తరణకు భారీగా నిధుల అవసరం.

Updated : 23 Feb 2024 08:04 IST

ప్రాజెక్ట్‌ వ్యయంలో 45 శాతం జైకా రుణాలకు సర్కారు యోచన

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోరైలు రెండోదశలో నిధుల సమీకరణకు సంబంధించి జపాన్‌ ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ ఏజెన్సీ (జైకా)తో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన ఆరు మార్గాల్లో 70 కి.మీ.మేర మెట్రో విస్తరణకు భారీగా నిధుల అవసరం. ప్రాథమిక లెక్కల ప్రకారం రూ.17,500 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. సాధారణంగా కేంద్రం 15 శాతం, రాష్ట్రం 35 శాతం నిధులు వెచ్చిస్తుంది. మిగిలిన 50 శాతానికి రుణాలు తీసుకుంటారు. అయితే ఈసారి మెట్రో విస్తరణను కొత్త మోడల్‌లో చేపట్టబోతున్నారు. 5 శాతం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)కు అవకాశం ఇస్తారు. మిగిలిన 45 శాతానికి దీర్ఘకాలానికి రుణం తీసుకోవాలని సర్కారు భావిస్తోంది. ఆ ప్రకారం దాదాపుగా రూ.8 వేల కోట్ల వరకు రుణం అవసరం ఉంటుంది. డీపీఆర్‌ పూర్తయ్యాక వ్యయ అంచనాలు ఖరారవుతాయి. డీపీఆర్‌ ఆమోదం తర్వాత కేంద్రం ఇచ్చే నిధులపై స్పష్టత వస్తుంది. తక్కువ వడ్డీరేట్లకు రుణాలు ఇచ్చే జైకా ఇండియా చీఫ్‌, ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి, అధికారులు చర్చించారు.

పలు ప్రాజెక్టులకు రూ.లక్ష కోట్లపైగా..

దేశంలో పలు నగరాల్లో మెట్రోప్రాజెక్ట్‌లు నిర్మాణంలో ఉన్నాయి. చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, దిల్లీ, ముంబయి, అహ్మదాబాద్‌, పట్నా మెట్రోరైలు ప్రాజెక్ట్‌లకు 1.07లక్షల కోట్ల రుణాలను జైకా మంజూరు చేసింది. వీటిని దీర్ఘకాలానికి చెల్లించాలని.. వడ్డీకూడా 2, 3 శాతానికి మించదని అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని