logo

నిబంధనలు కనం.. ప్రాణాలు పణం

జీహెచ్‌ఎంసీలోని కొందరు అవినీతి అధికారులు.. పైవంతెనలు, మెట్రో మార్గాల పిట్ట గోడలపై ప్రకటనలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశమిస్తున్నారు. ఎఫ్‌ఓబీలు, భవన సముదాయాల గోడలపై ఎల్‌ఈడీ ప్రకటనలకు అనధికారికంగా ఊతమిస్తున్నారు.

Published : 23 Feb 2024 02:43 IST

ఎఫ్‌ఓబీ, మెట్రో మార్గం, పైవంతెనలకు ప్రకటనలు
వర్షం, ఈదురు గాలులొస్తే రోడ్లపై పడే ప్రమాదం
మామూళ్ల కోసం ప్రాణాపాయమైనా కొనసాగింపు
ఈనాడు, హైదరాబాద్‌

జీహెచ్‌ఎంసీలోని కొందరు అవినీతి అధికారులు.. పైవంతెనలు, మెట్రో మార్గాల పిట్ట గోడలపై ప్రకటనలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశమిస్తున్నారు. ఎఫ్‌ఓబీలు, భవన సముదాయాల గోడలపై ఎల్‌ఈడీ ప్రకటనలకు అనధికారికంగా ఊతమిస్తున్నారు. ప్రతినెలా రూ.లక్షల్లో కమీషన్లు దండుకుంటున్నారు. ఓ వైపు జీహెచ్‌ఎంసీ ఆదాయానికి గండి కొడుతూ.. మరోవైపు ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. పీకపై కత్తి పెట్టినట్లు, వాహనదారుల కోసం సిద్ధంగా ఉన్న యమపాశంలా ఆయా ప్రకటన బోర్డులు రోడ్డుపై వేలాడుతూ కనిపిస్తుంటాయి. చట్ట ప్రకారం వాటికి అనుమతి లేకపోయినా.. ఆమ్యామ్యాల కోసం అధికారులే ప్రోత్సహిస్తున్నారన్న విమర్శలున్నాయి.

జీవో.68తో ద్వంద ప్రమాణాలు..

గత ప్రభుత్వం 2018లో జీవో.68 పేరుతో కొత్త ప్రకటనల విధానాన్ని తీసుకొచ్చింది. ప్రజల శ్రేయస్సు కోసమంటూ.. రోడ్లకు ఇరువైపులా 15అడుగులకన్నా ఎత్తులో ఎలాంటి ప్రకటనలు ఉండొద్దని నిషేధం విధించింది. అంతవరకు బాగానేఉన్నా.. మెట్రో రైలు ఆస్తులకు ఆ ఉత్తర్వు వర్తించదు. మెట్రో సంస్థ, ప్రభుత్వానికి మధ్య ఆమేర ఒప్పందం ఉందని జీహెచ్‌ఎంసీ చెబుతోంది. ఒకేరోడ్డుపై ఉన్న వేర్వేరు ఆస్తులపై ఏర్పాటుచేసుకునే ప్రకటనలకు రెండు రకాల నిబంధనలు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మెట్రో మార్గంపై ప్రతి కూడలి వద్ద పిట్టగోడకు ఇనుప జాలీలను తగిలించారు. టన్నుల కొద్దీ బరువుండే జాలీలు రహదారిపై వేలాడుతూ ఉంటాయి. సికింద్రాబాద్‌ సంగీత్‌ చౌరస్తా, పంజాగుట్ట, ఆర్టీసీ క్రాసురోడ్డు, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, జేబీఎస్‌, ప్యారడైజ్‌, బేగంపేట తదితర ప్రాంతాల్లో.. ఆయా జాలీలు 15 నుంచి 18మీటర్ల ఎత్తులో ఉంటాయి. తెలుగుతల్లి కూడలి, సైబర్‌ టవర్స్‌ తదితర కూడళ్లలో పైవంతెనలపై అలాంటి ప్రకటనలు కనిపిస్తున్నాయి. ఈదురు గాలులు, భారీ వర్షాలు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తుల సమయంలో ఫ్లెక్సీలు చిరిగిపోయి వాహనదారులపై పడే ప్రమాదముంది. కొందరు అధికారుల స్వప్రయోజనాలు, రాజకీయ నేతల ప్రచారానికే ఉపయోగపడే ఆ హోర్డింగ్‌లను తొలగించాలని నగరవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

వీటితోనే ప్రమాదం..

  • మెట్రో పిల్లర్లపై ఏర్పాటు చేసుకునే ప్రకటనలతో పెద్దగా ప్రమాదం లేదని, రోడ్డుపై తోరణాల్లా వేలాడదీసే ప్రకటనలతో ముప్పు పొంచి ఉంది.
  • నగరంలో ప్రస్తుతం మెట్రో మార్గం, పైవంతెనల పిట్టగోడలపై ఏర్పాటు చేసిన ప్రకటనలు 200 ఉన్నాయి. అందులో కొన్ని అనుమతి లేనివి. వాటిపై వచ్చే ఆదాయం పూర్తిగా అధికారులు, ప్రజాప్రతినిధుల జేబుల్లోకి వెళ్తుంది. అధికారిక ప్రకటనలకు యాడ్‌ ఏజెన్సీలు నెలకు రూ.10లక్షల మేర రుసుము తీసుకుని, మెట్రో సంస్థకు రూ.25వేలు చెల్లిస్తాయని సమాచారం.
  • స్టేషన్‌ స్కైవాక్‌లు 120, రైలింగ్‌ యాడ్‌లు 2వేలు, పిల్లర్లపై 2వేలు, రోడ్డుపై తోరణంలా ఉండే పిల్లర్లకు 150 ప్రకటనలను ఏర్పాటు చేస్తుంటారు. వాటిలో కొన్ని అనధికారికమని, మిగిలిన వాటికి ఏజెన్సీలు నెలకు రూ.5లక్షల నుంచి రూ.15లక్షల మేర రుసుము తీసుకుని, మెట్రో సంస్థకు రూ.2వేల నుంచి రూ.50వేల మేర చెల్లిస్తుంటాయని జీహెచ్‌ఎంసీ పాలకమండలి తాజాగా గగ్గోలు పెట్టింది. బల్దియాకు రూపాయి కూడా వాటి నుంచి ఆదాయం రావట్లేదని గుర్తు చేసింది.
  • ఆదాయం పేరుతో తాజాగా జీహెచ్‌ఎంసీ జీవో68ను రద్దు చేయాలని కోరుతూ సర్కారుకు లేఖ రాసిందని, రద్దు చేయకుండా సవరణలు చేయాలని నగరవాసులు కోరుతున్నారు. హోర్డింగులు, రోడ్లపై ప్రకటనలు, ఫ్లెక్సీ బోర్డులు, ఇతరత్రా ప్రమాదకర ప్రకటనలు ప్రమాదకరమని గుర్తు చేస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని