logo

పుర బడ్జెట్‌ రూ.66.98 కోట్లు

వికారాబాద్‌ పురపాలక సంఘం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ సమావేశం పురపాలక సమావేశ మందిరంలో శుక్రవారం అధ్యక్షురాలు సి.మంజుల అధ్యక్షతన జరిగింది.

Published : 24 Feb 2024 02:54 IST

మాట్లాడుతున్న పురపాలక అధ్యక్షురాలు సి.మంజుల, చిత్రంలో అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఉపాధ్యక్షురాలు శంషాద్‌బేగం

వికారాబాద్‌ మున్సిపాలిటీ: వికారాబాద్‌ పురపాలక సంఘం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ సమావేశం పురపాలక సమావేశ మందిరంలో శుక్రవారం అధ్యక్షురాలు సి.మంజుల అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం సమావేశ వివరాలను అధ్యక్షురాలు మంజుల వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.66.98 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. ఇందులో ఖర్చులు రూ.66.72 కోట్లు పోను మిగులు బడ్జెట్‌ రూ.26.03 లక్షలని పేర్కొన్నారు. వీటిలో పన్నులు ద్వారా రూ.10 కోట్లు, పన్నేతరల పనుల కింద రూ.10.16 కోట్ల ఆదాయం వస్తుందని సూచించారు. నాన్‌ ప్లానింగ్‌ గ్రాంట్‌ల కింద రూ.3.30 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అంచనా వ్యయం రూ.66.72 కోట్లని తెలిపారు. సిబ్బంది వేతనాలు రూ.5.85 కోట్లు, విద్యుత్తు ఛార్జీలు రూ.1.75 కోట్లు, రుణాలకు రూ.1.10కోట్లు, నిర్వహణ వ్యయం రూ.3.22 కోట్లు వ్యయం అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు శంషాద్‌బేగం, కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.


హరితహారం లక్ష్యాలను అధిగమించాలి

వికారాబాద్‌ మున్సిపాలిటీ: జిల్లాలో హరితహారంలో నిర్ణయించిన లక్ష్యాలను అధిగమించాలని అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో హరితహారం కార్యాచరణపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఔషధ మొక్కలను నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో ఖాళీ స్థలాలను గుర్తించి మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పొలం గట్లపై, రోడ్లకు ఇరువైపులా పెద్ద మొక్కలను నాటాలని సూచించారు. సమావేశంలో డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్‌, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, పరిశ్రమల శాఖ మేనేజర్‌ వినయ్‌కుమార్‌, జిల్లా అధికారులు అనిల్‌కుమార్‌, గోపాల్‌, సామెల్‌ జాకబ్‌, అర్చన, పుర కమిషనర్లు జాకీర్‌ అహ్మద్‌, వెంకటయ్య, బలరాంనాయక్‌,  విక్రమ్‌సింహరెడ్డి పాల్గొన్నారు.


వైద్య, ఆరోగ్యశాఖలో ఖాళీల భర్తీ

వికారాబాద్‌ మున్సిపాలిటీ: వికారాబాద్‌ జిల్లాలో జాతీయ ఆరోగ్య మిషన్‌ కార్యక్రమం కింద ఒప్పంద సేవల పద్ధతిపై ఖాళీలను భర్తీ చేస్తున్నామని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ పల్వన్‌ కుమార్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ కేటగిరీల కింద 54 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 24 నుంచి 29 వరకు జిల్లా ఆరోగ్య, వైద్యాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని