logo

అర్ధరాత్రి ఇసుక అక్రమ రవాణా

అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 ట్రాక్టర్లు, జేసీబీ యంత్రాన్ని జప్తు చేసినట్లు ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు 100కు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు.

Published : 24 Feb 2024 02:56 IST

7 ట్రాక్టర్లు, జేసీబీ జప్తు

బషీరాబాద్‌ ఠాణాలో ట్రాక్టర్లు

బషీరాబాద్‌, న్యూస్‌టుడే: అర్ధరాత్రి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 ట్రాక్టర్లు, జేసీబీ యంత్రాన్ని జప్తు చేసినట్లు ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు 100కు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. అప్పటికే కొందరు అప్రమత్తమై ట్రాక్టర్లలో ఉన్న ఇసుకను ఖాళీ చేసి, టైర్లలో గాలి తీసినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. బషీరాబాద్‌ మండలం మైల్వార్‌కు చెందిన ఓ పార్టీ నాయకుడు అభివృద్ధి పనులు చేసేందుకు గురువారం అర్ధరాత్రి ఒక జేసీబీ, 7 ట్రాక్టర్లను వాగులోకి తీసుకెళ్లాడు. ఇది గమనించిన అదే గ్రామానికి చెందిన మరో పార్టీ నేతలు పోలీసులకు తెలిపితే రాత్రివేళలో స్పందించడం లేదని 100కు సమాచారం అందించారు. ఠాణా పోలీసులను అప్రమత్తం చేయడంతో ఏఎస్‌ఐ, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాక్టర్లను వదిలేసి కొందరు పారిపోగా, మరికొందరు అక్కడే ఉన్నారు. ట్రాక్టర్ల యజమానులు, చోదకుల పేర్లు, యంత్రం వివరాలను నమోదు చేసుకున్నారు. శుక్రవారం ట్రాక్టర్లు, యంత్రాన్ని జప్తు చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇరు పార్టీ నాయకుల ఒత్తిళ్లు..: జప్తు చేసిన ట్రాక్టర్లను విడిపించాలని, కేసులు నమోదు చేయొద్దని అధికార పార్టీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. మరోవైపు అధికార పార్టీ నాయకుడు కావడంతో పోలీసులు కఠిన చర్యలకు జంకుతున్నారని, జరిమానా వేసి వదిలేయాలని చూస్తున్నారని మరోపార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని పేర్కొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని