logo

బకాయిలతో దూరమవుతున్న భవిత

దివ్యాంగులు భవిత కేంద్రాలకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణ భత్యం చెల్లించాలి. గతంలో సక్రమంగా చెల్లించిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఇవ్వడం లేదు. దీంతో దివ్యాంగ విద్యార్థులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు.

Published : 24 Feb 2024 02:59 IST

దివ్యాంగ విద్యార్థులకు చెల్లించని భత్యం

కేంద్రంలో విద్యార్థులు

వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి, న్యూస్‌టుడే: దివ్యాంగులు భవిత కేంద్రాలకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణ భత్యం చెల్లించాలి. గతంలో సక్రమంగా చెల్లించిన ప్రభుత్వం.. ప్రస్తుతం ఇవ్వడం లేదు. దీంతో దివ్యాంగ విద్యార్థులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. గత 18 నెలలుగా ఒక్క నయాపైసా విడుదల చేయలేదు. దీంతో భవిత కేంద్రాల్లో చదువుకుంటున్న వారు సొంత డబ్బులు వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వం ప్రయాణ భత్యం చెల్లించకపోవడంతో కొందరు పేద విద్యార్థులు పాఠశాలలకు రావడం మానేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపినా ప్రయోజనం లేదు. విద్యార్థులకు వివిధ దీర్ఘకాలిక వ్యాధులకు శస్త్ర చికిత్స అందించి సాధారణ స్థితికి తీసుకురావాలన్న లక్ష్యం నీరుగారుతోంది.

రూ.11.98 లక్షలు రావాలి

జిల్లాలో 27 భవిత(విలీన విద్యా వనరుల) కేంద్రాలున్నాయి. వీటిలో 347 మంది పిల్లలున్నారు. ప్రతి మండలంలో ఒక కేంద్రం ఉండగా కొన్ని మండలాల్లో రెండు ఉన్నాయి. కేంద్రానికి ఒకరు చొప్పున రిసోర్స్‌ పర్సన్లు ఉన్నారు. ఈ కేంద్రాల్లో 5 నుంచి 14 ఏళ్లలోపు పిల్లల్ని చేర్చుకుంటారు. ప్రయాణ భత్యం ఒక్కొక్కరికి ప్రతి నెల రూ.500 వారి ఖాతాల్లో జమ చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు తల్లిదండ్రుల సహాయంతో పాఠశాలకు వస్తున్నందున ఒక్కొక్కరికి నెలకు రూ.550 ప్రయాణ భత్యం ఇవ్వాలి. బాలికలకు అదనపు ప్రోత్సాహకంగా నెలకు రూ.200 చెల్లిస్తారు. రీడర్‌ అలవెన్స్‌ కింద నెలకు రూ.60 చెల్లిస్తారు. వీరందరికీ 2022-23లో పది నెలలు, 2023-24 లో 8 నెలలు మొత్తం 18 నెలలకు సంబంధించిన భత్యం చెల్లించాలి. 2022-23 సంవత్సరానికి 347 మంది విద్యార్థులకు రూ.11.98 లక్షలు విడుదల కావాల్సి ఉంది. 2023-24 సంవత్సరం 8 నెలల లెక్కలు అధికారులు తీస్తున్నారు. ప్రయాణభత్యం రాకపోవటంతో తల్లిదండ్రులే సొంత డబ్బులు చెల్లించి చిన్నారులకు భవిత కేంద్రాలకు పంపుతున్నారు. డబ్బులు చెల్లించలేని వారు సక్రమంగా రావడం లేదు. దీంతో వీరికి అందాల్సిన సేవలు పూర్తిస్థాయిలో అందటం లేదు.


2022-23లో రావాల్సినవి..

  • విద్యార్థులకు సహాయకులుగా వచ్చే వారికి చెల్లించే భత్యం 111 మందికి రూ.5.55 లక్షలు
  • ప్రయాణ భత్యం 57 మంది విద్యార్థులకు రూ.3.13 లక్షలు
  • బాలికలకు ప్రోత్సాహకం 159 మందికి రూ.3.18 లక్షలు
  • రీడర్‌ అలవెన్స్‌లు 20 మందికి రూ.12 వేలు
  • మొత్తం రూ.11,98,500లు.

త్వరలో విడుదల చేస్తామన్నారు
- రజనీకుమారి, సమ్మిళిత విద్య కోఆర్డినేటర్‌

విద్యార్థులకు రావాల్సిన బకాయిలను త్వరలో విడుదల చేస్తామని అధికారులు సమాచారం అందజేశారు. విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చి ఉన్నతాధికారులకు పంపించాం. నిధులు విడుదల చేస్తే విద్యార్థుల ఖాతాలో జమ అవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని