logo

సెల్లార్‌లో కాపలాదారు గది నిర్మించుకోవచ్చు: హైకోర్టు

అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌ (స్టిల్ట్‌ ఫ్లోర్‌)లో 2012 భవన నిబంధనల ప్రకారం వాచ్‌మెన్‌ గదితోపాటు రెండు మరుగుదొడ్లు నిర్మించుకోవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది.

Published : 24 Feb 2024 03:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌ (స్టిల్ట్‌ ఫ్లోర్‌)లో 2012 భవన నిబంధనల ప్రకారం వాచ్‌మెన్‌ గదితోపాటు రెండు మరుగుదొడ్లు నిర్మించుకోవచ్చని హైకోర్టు స్పష్టంచేసింది. 25 చదరపు మీటర్ల విస్తీర్ణం మేర వీటి నిర్మాణం చేపట్టవచ్చని, ముందస్తు అనుమతి అవసరమని తేల్చిచెప్పింది. సెల్లార్‌లో వాచ్‌మెన్‌ గది నిర్మించడంపై జీహెచ్‌ఎంసీ ఈనెల 7న జారీ చేసిన షోకాజ్‌ నోటీసును సవాలు చేస్తూ హైదరాబాద్‌ మోహన్‌నగర్‌ సీటీఓకాలనీలోని అన్నపూర్ణ అపార్ట్‌మెంట్స్‌ నిర్మాణదారు కె.రమేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 500 చదరపు గజాల్లో 15 ఫ్లాట్‌లు ఉన్నాయని, భద్రత కోసం సెల్లార్‌లో చిన్న వాచ్‌మెన్‌ గది నిర్మించినట్లు తెలిపారు. కేవలం షోకాజ్‌ నోటీసు జారీ చేశామని, వివరణ ఇవ్వడానికి పిటిషనర్‌కు అవకాశముందని మున్సిపాలిటీ న్యాయవాది తెలిపారు. నోటీసుకు ఈనెల24లోగా వివరణ ఇవ్వడంతోపాటు క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసుకుంటే దానిపై నిర్ణయం తీసుకునేదాకా కఠిన చర్యలు తీసుకోవద్దని అధికారులకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని