logo

ఉద్యానానికి ఊతమిచ్చేనా!

జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం క్రమేపీ పెరుగుతూ వస్తోంది. సంప్రదాయ పంటలకు భిన్నంగా సాగు చేయడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చాలా మంది రైతులు ప్రయత్నిస్తున్నారు.

Published : 24 Feb 2024 03:10 IST

మూడేళ్లుగా పెండింగ్‌లో దరఖాస్తులు

సాగులో అరటి తోట

పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం క్రమేపీ పెరుగుతూ వస్తోంది. సంప్రదాయ పంటలకు భిన్నంగా సాగు చేయడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చాలా మంది రైతులు ప్రయత్నిస్తున్నారు. ఆయిల్‌పామ్‌ తోటలతో పాటు ఇతర వాటిపైనా దృష్టి సారిస్తున్నారు. 14వేల ఎకరాల్లో మామిడి, జామ, బత్తాయి, నిమ్మ, అరటి, డ్రాగన్‌ ఫ్రూట్‌, బొప్పాయి, సపోటా తదితర రకాలు సాగులో ఉన్నాయి. కూరగాయల సాగుతో భాగ్యనగర ప్రజల అవసరాలు కూడా తీరుతున్నాయి. రోజురోజుకు సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో సర్కారు సహకారం కోసం వేయి కళ్లతో రైతులు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఆశలు చిగురిస్తున్నాయి.

గత ప్రభుత్వ హయాంలో ఏళ్లుగా నిరీక్షించామని కనీసం ఇప్పుడైనా ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రధానంగా తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసేందుకు ఉపయోగపడే బిందు, తుంపర పరికరాలు పంపిణీపై నీలినీడలు అలముకున్నాయి. రైతులు చేసిన విన్నపాలు బుట్టదాఖలే అయ్యాయి. రాయితీలను కొనసాగిస్తామని శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఊరటనిచ్చింది. ఆర్థిక సంవత్సరం దగ్గరపడుతున్న తరుణంలో జిల్లా ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

11వేల ఎకరాల్లో: కొత్త తోటల సాగుకు రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది. పరిగి, వికారాబాద్‌, కొడంగల్‌, తాండూరు నియోజకవర్గాల పరిధిలో యాసంగిలో 12వేల ఎకరాల్లో వివిధ రకాల కూరగాయల సాగు అంచనా ఉండగా 17,250 మంది రైతులు ఇప్పటివరకు 11వేల ఎకరాలకు పైగా పండిస్తున్నారు. ఇంకా అనేక ప్రాంతాల్లో నారుమళ్లను పోసుకుంటున్నారు. ప్రైవేట్‌ నర్సరీల్లోనూ మొక్కలు కొనుగోలు చేస్తున్నారు. 1.17లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారుల అంచనా. గుడిమల్కాపూర్‌, మెహిదీపట్నం, తాండూరు, వికారాబాద్‌, శంషాబాద్‌ తŸదితర ప్రాంతాల్లోని రైతుబజార్లలో విక్రయిస్తున్నారు.

3,150మంది నిరీక్షణ

ఉద్యాన, కూరగాయ పంటలను సాగు చేస్తున్న దాదాపు 3,150 మంది రైతులు మూడేళ్ల క్రితం పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు వాటి అతీగతి లేకుండా పోయింది. జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 10,500 మంది రైతులు బిందు పరికరాలను వినియోగిస్తూ పండిస్తున్నారు. పెండింగ్‌ దరఖాస్తులకు మోక్షం కలిగిస్తే మరికొంత మంది పేద రైతులకు ప్రయోజనం కలగనుంది. మార్కెట్లో సెట్టు ధర రూ.25వేల వరకు పలుకుతోంది.

ప్రధాన పంటలు

జిల్లాలో నల్లరేగడి, ఎర్రచెల్క నేలలు ఉన్నాయి. ఇవి దాదాపు అన్ని రకాల పంటలకు అనుకూలమైనవి. ప్రధానంగా ఉల్లి, టమాట, వంగ, మిరప, ఆలుగడ్డ, కీర, బెండ, చిక్కుడు, క్యాబేజీ, క్యారెట్‌, కాకర, బీర, సొరకాయ కూడా పండిస్తున్నారు. కొద్దిపాటి భూమి కలిగిన రైతులు మాత్రం ఎక్కువగా పాలకూర, గోంగూర, తోటకూర, మెంతి కూర, పాయిల్‌ కూర సాగు చేస్తున్నారు. కిలో మెంతికూర మార్కెట్లో రూ.60-80కి విక్రయిస్తుండగా పాలకూర పావుకిలో రూ.20కి అమ్ముతున్నారు.


ఆయిల్‌పామ్‌కు తొలి ప్రాధాన్యం
- మహమ్మద్‌ అబ్దుల్‌ సత్తార్‌, జిల్లా ఉద్యానాధికారి

ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్న రైతులకు పరికరాల మంజూరులో తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. మిగతా వాటికి ప్రభుత్వ అనుమతి రాగానే అందజేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని