logo

కొత్త ఆలోచనలతోనే మార్పు

విద్యార్థులు కొత్త ఆలోచనలతో సుసంపన్నమైన దేశాన్ని ఆవిష్కరించేందుకు ముందుకు సాగాలని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.

Updated : 24 Feb 2024 04:48 IST

భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌ ఆవరణలో మొక్క నాటుతున్న భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, పక్కన బిట్స్‌ క్యాంపస్‌ మాజీ డైరెక్టర్‌ ఆచార్య జి.సుందర్‌, డీన్‌ ఆచార్య యోగేశ్వరి

శామీర్‌పేట, న్యూస్‌టుడే: విద్యార్థులు కొత్త ఆలోచనలతో సుసంపన్నమైన దేశాన్ని ఆవిష్కరించేందుకు ముందుకు సాగాలని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌-బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో లాంచ్‌ ప్యాడ్‌-ఎంట్రప్రిన్యూరియల్‌ సదస్సు ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో యువత అడుగుపెట్టి దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ రంగాల్లో రాణించేందుకు లాంచ్‌ ప్యాడ్‌ ఓ సువర్ణ అవకాశంగా మలుచుకుని సృజనాత్మకమైన ఆలోచనలను పంచుకునేందుకు వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. భారత దేశం పూర్వ నుంచి ఇతర దేశాలకు చేయూత అందించిందని పేర్కొన్నారు. పరిశ్రమలను స్థాపించి ఇతర దేశాలకు సరఫరా చేసే ప్రపంచ పరిశ్రమగా ఇండియా నిలబడేలా యువత కృషి చేయాలన్నారు. 2020లో ఎంటర్‌పెన్యుర్‌షిప్‌ 5.1శాతం ఉంటే..2021 వరకు 14.4 శాతానికి పెరిగిందన్నారు. రీడ్‌ ద వరల్డ్‌ దెన్‌.. లీడ్‌ ద వరల్డ్‌ నినాదంతో దేశానికి ఉపయోగపడేలా బిట్స్‌ విద్యార్థులు సిద్ధం కావాలన్నారు. ఈకామర్స్‌, హెల్త్‌ రంగాలను అభివృద్ధి పర్చాలని సూచించారు. రతన్‌టాటా, కుమారమంగళం బిర్లా, ముకేష్‌ అంబానీలు వ్యాపార రంగంలోపాటు విద్యారంగాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బిట్స్‌ పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌ మాజీ డైరెక్టర్‌ ఆచార్య జి.సుందర్‌, డీన్‌ ఆచార్యులు యోగేశ్వరి, పరిక్షిత్‌, ఈ సెల్‌ ప్రెసిడెంట్‌ షివేందర్‌, ఛైర్మన్‌ దివ్యాన్షు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని