logo

ప్రేమను తిరస్కరించాడని టీవీ యాంకర్‌ కిడ్నాప్‌

ఓ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో ఓ యువకుడి ఫొటో చూసిన యువతి ఫిదా అయిపోయింది. ఎలాగైనా అతడిని సొంతం చేసుకోవాలనుకుంది. వెంటాడింది..బతిమలాడింది..

Updated : 24 Feb 2024 05:28 IST

కారుకు జీపీఎస్‌ ట్రాకర్‌ పెట్టి యువకుడిని వేధించిన మహిళ

నిందితురాలు త్రిష్ణ

ఉప్పల్‌, న్యూస్‌టుడే: ఓ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో ఓ యువకుడి ఫొటో చూసిన యువతి ఫిదా అయిపోయింది. ఎలాగైనా అతడిని సొంతం చేసుకోవాలనుకుంది. వెంటాడింది..బతిమలాడింది.. ఆ యువకుడు ఆమె  ప్రేమను అంగీకరించలేదు. దాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. నలుగురు గుండాలతో ఆ యువకుడిని కిడ్నాప్‌చేయించి బెదిరించింది. తన పాచిక పారకపోగా చివరికి ఆమె కటకటాలపాలైంది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. మల్కాజిగిరి ఏసీపీ కె.పురుషోత్తంరెడ్డి, ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎలక్షన్‌రెడ్డి కథనం ప్రకారం.. ఉప్పల్‌ భరత్‌నగర్‌లో ఉండే ప్రణవ్‌ సిస్‌ట్లా(27) సాప్ట్‌వేర్‌ ఉద్యోగి. ఓ టీవీ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేస్తున్నారు. మాదాపూర్‌ అరుణోదయకాలనీకి చెందిన గోగిరెడ్డి త్రిష్ణ(31) డిజిటల్‌ మార్కెటింగ్‌ చేస్తోంది. గతంలో పెళ్లి చేసుకొని విడాకులు కూడా తీసుకుంది. రెండేళ్ల క్రితం ఓ మ్యాట్రీమోనీ వెబ్‌సైట్‌లో ప్రణవ్‌ ప్రొఫైల్‌ ఫొటో చూసింది. వెంటనే ఇష్టపడి వాట్సప్‌లో సంప్రదించింది. ఆ ప్రొఫైల్‌ చైతన్యరెడ్డిది, ఫొటో ప్రణవ్‌దని గుర్తించింది. చైతన్యతోనే ప్రణవ్‌ ఫోన్‌ నంబరు సంపాదించింది. చైతన్యరెడ్డి తన ప్రొఫైల్‌ ఫొటోగా నీ ఫొటో వాడుతున్నాడని ప్రణవ్‌కు సమాచారం ఇచ్చింది. అతడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ట్రాకర్‌తో వెంటపడుతూ.. ప్రణవ్‌ కారుకు త్రిష్ణ యాపిల్‌ ఎయిర్‌టాగ్‌ పెట్టింది. కారు కదిలికలను నిత్యం ట్రాక్‌ చేస్తూ ఉండేది. ఇదే విషయాన్ని ప్రణవ్‌కు కూడా చెప్తూ ఉండేది. నిత్యం ప్రణవ్‌ వెంటపడుతూ రకరకాల వేధింపులకు గురి చేస్తూ ఉండేది. అతడు పట్టించుకోలేదు. ప్రణవ్‌ను ఎలాగైనా లొంగతీసుకోవాలని పథకం పన్నింది. నలుగురు గుండాలతో ఒప్పందం చేసుకుంది. ఈనెల 11న ప్రణవ్‌ డ్యూటీ నుంచి ఇంటికి వస్తుండగా ట్రాకర్‌ ఆధారంగా వెంటాడిన ఆ గుండాల ముఠా కిడ్నాప్‌ చేసింది. కారులో మాదాపూర్‌లోని త్రిష్ణ కార్యాలయానికి తీసుకెళ్లారు. బాగా కొట్టి ఒప్పించేందుకు యత్నించినా ప్రణవ్‌ ఒప్పుకోలేదు. అతడే చాకచక్యంగా తప్పించుకొని ఉప్పల్‌కు చేరుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. సాంకేతికత ఉపయోగించి త్రిష్ణను గుర్తించారు. పలు సెక్షన్లతో కేసు నమోదుచేశారు. అరెస్టుచేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. కిడ్నాప్‌కు పాల్పడిన ముఠా పరారీలో ఉంది. కారుకు అమర్చిన టాగ్‌, యువతివద్ద ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని