logo

చదువు ధ్యాసలో కళ్లు జాగ్రత్త

ఒకవైపు పోటీ పరీక్షలు.. మరోవైపు పదో, ఇంటర్‌ వార్షిక పరీక్షలతో విద్యార్థులు బిజీబిజీగా గడుపుతున్నారు. గంటల తరబడి పుస్తకాలకు అతుక్కుపోతున్నారు.

Updated : 24 Feb 2024 05:12 IST

పలు సూచనలు చేసిన ఎల్వీపీ నేత్ర వైద్య సంస్థ

కవైపు పోటీ పరీక్షలు.. మరోవైపు పదో, ఇంటర్‌ వార్షిక పరీక్షలతో విద్యార్థులు బిజీబిజీగా గడుపుతున్నారు. గంటల తరబడి పుస్తకాలకు అతుక్కుపోతున్నారు. స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల సాయంతో చాలామంది పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. దీంతో సాధారణ రోజులతో పోల్చితే కళ్లపై ఒత్తిడి పెరుగుతుందని ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్య సంస్థ నిపుణులు చెబుతున్నారు. ఆసుపత్రికి చెందిన సీనియర్‌ కన్సల్టెంట్‌ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్‌ దివ్య నటరాజన్‌ పలు సూచనలు చేశారు.

  • కళ్లు పొడిబారడం, తలనొప్పి, దృష్టి తగ్గడం, పార్శ్వపు నొప్పి లక్షణాలు ఉంటే చదువుపై ఏకాగ్రత చూపలేరు. ఇలాంటి సమస్యల నివారణకు మొదట సమగ్ర నేత్ర పరీక్షలు చేయించుకోవాలి. అప్పటికే కళ్ల అద్దాలు ఉంటే, ప్రిస్క్రిప్షన్‌లో మార్పులకు సహాయపడుతుంది. దృష్టి లోపాలు ఉంటే ముందే పసిగట్టే అవకాశం ఉంటుంది.
  • డిజిటల్‌ లెర్నింగ్‌లో 20-20-20 నియమం పాటించాలి. ప్రతి 20 నిమిషాలకు 20 సెకన్ల పాటు 20 అడుగుల దూరంలోని ఇతర వస్తువులపై దృష్టి కేంద్రీకరించాలి. దీంతో పాటు కంటి కండరాలను సడలించాలి. ఫలితంగా కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.
  • కళ్ల దురద, అలసట నివారణకు తరచూ రెప్పలు వేయాలి. చదువుకునేటప్పుడు సరైన భంగిమ కూడా అవసరమే. నిటారుగా కూర్చోవడం వల్ల మెడ, వీపుపై ఒత్తిడిని నివారించవచ్చు. మెడ, వెన్ను సమస్యలు రాకుండా ఉపయోగపడుతుంది.
  • ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల గాలి నేరుగా కళ్లపై పడకుండా చూసుకోవాలి. నేరుగా కంటిపై పడితే కళ్లు పొడిబారుతాయి. చదువుకునే సమయంలో కంటిపై ఒత్తిడి, అసౌకర్యాన్ని తగ్గించడానికి వెలుతురు, గాలి ధారాళంగా వచ్చే గదిని ఎంపిక చేసుకోవాలి.
  • రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి. తగినంత నిద్రపోవాలి. విశ్రాంతి లేకపోవడం.. తగినంత నీళ్లు తాగకపోవడం మైగ్రేన్‌కు దారితీస్తుంది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తగినంత ప్రోటీన్లు ఉంటే ఆహారం తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.  
  • స్క్రీనింగ్‌ సమయం తగ్గించుకోవడం ఉత్తమం. తప్పదంటే స్మార్ట్‌ ఫోన్లు కంటే పెద్ద తెరలు ఉన్న ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఎంచుకోవాలి. సౌకర్యవంతమైన వీక్షణ కోసం తెర వెలుతురు సర్దుబాటు చేసుకోవాలి. ఎక్కువ కాంతి వల్ల కంటిపై ఒత్తిడి పడి డ్రైఐస్‌ లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని