logo

ఇంటింటికీ నోటీసులు

ఆస్తిపన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. పన్ను బకాయిదారులకు డిమాండ్‌ నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

Published : 24 Feb 2024 03:41 IST

ఆస్తిపన్ను లెక్క తేల్చాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయం
19లక్షల డిమాండ్‌ నోటీసుల జారీకి టెండరు

ఈనాడు, హైదరాబాద్‌: ఆస్తిపన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది. పన్ను బకాయిదారులకు డిమాండ్‌ నోటీసులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆమేరకు 19లక్షల నోటీసులను ముద్రించి ఇంటింటికీ అందజేయాలని కేంద్ర కార్యాలయం టెండరు ప్రక్రియను చేపట్టింది. పౌరులు ప్రస్తుతం చెల్లిస్తోన్న ఆస్తిపన్ను విలువను, నిర్మాణాన్ని పరిశీలించడంపై రెవెన్యూ విభాగం దృష్టిపెట్టింది. భవనానికి, భవన యజమాని చెల్లిస్తోన్న పన్నుకు వ్యత్యాసం ఉన్నట్లయితే.. ఆయా నిర్మాణాలకు నోటీసు వెళ్తుందని, కొలతలు తీసుకుని పన్ను వ్యత్యాసాన్ని సరిచేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

నాలుగేళ్ల క్రితం నిలిచాయ్‌..

నగరంలో కాలనీలు, బస్తీలనే తేడా లేకుండా కొందరు బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌ 213 కింద నోటీసులిచ్చి.. లంచాలు వసూలుచేసే విధానం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. కొలతలపేరుతో, ఇంటిని విస్తరించారని, బాల్కనీ పెరిగిందని, ఇంట్లోని గృహోపకరణలు ఖరీదైనవని, స్లాబుపై షెడ్డు వేసుకున్నారని సిబ్బంది ఇంటి యజమానులను భయపెట్టేవారు. కొందరు ప్రైవేటు వ్యక్తులకు బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్‌ బిల్‌ కలెక్టర్లనే హోదా ఇచ్చి అధికారులు వసూళ్లకు ఉపయోగించుకున్నారు. యజమానులు అడిగినంత ఇస్తే సరి. లేదంటే  వేధింపులు తారస్థాయికి చేరడంతో.. గత కమిషనర్‌ నోటీసుల విధానానికి స్వస్తి పలికారు. దీంతో నాలుగేళ్లుగా నగరంలో 213 నోటీసు కనిపించలేదు.

నిఘా లేకుంటే దారుణాలు

  • గత కమిషనర్‌ స్వీయ మదింపు విధానాన్ని 2019లో విస్తృతంగా అమలుచేశారు. అందులో కొన్ని లోపాలుండటంతో.. అధికారులు, సిబ్బంది తెల్ల కాగితాలతో ఇంటి నంబర్లు తీసుకున్నారు. లోపాలను ‘ఈనాడు’ వరుస కథనాలతో వెలుగులోకి తేవడంతో.. కమిషనర్‌ అడ్డదారిలో జారీఅయిన 30 వేలకుపైగా ఇంటి నంబర్లను రద్దుచేసి, స్వీయ మదింపు విధానంలో మార్పులు చేశారు. ఆన్‌లైన్‌ దరఖాస్తును అధికారి పరిశీలించాకే నంబరు జారీ అయ్యేట్లు మార్పు చేశారు.
  • స్వీయ మదింపుతో జీహెచ్‌ఎంసీకి ఆదాయం తగ్గిందనే అధికారుల వాదనలో నిజానిజాలెలా ఉన్నా.. సెక్షన్‌ 213 నోటీసుల ప్రక్రియను పునఃప్రారంభిస్తే దారుణాలు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిఘా నీడలో నోటీసుల జారీ, పన్ను పరిశీలన ప్రక్రియ చేపడితే కొంతైనా వేధింపులు తగ్గుతాయని భావిస్తున్నారు.
  • కొన్నేళ్లుగా పౌరులు పన్ను బకాయిని ఆన్‌లైన్‌లో లేదా మీసేవ, పౌరసేవా కేంద్రాల్లో చెల్లిస్తున్నారు. బకాయిదారుల వరకు మాత్రమే డిమాండ్‌ నోటీసులిస్తే సరిపోతుందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని