logo

విధి వెంటాడింది.. మృత్యువు కబలించింది

గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్యే ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తూ వారి మన్ననలు పొందింది. లాస్యనందిత ఎమ్మెల్యేగా ఎన్నికై మూడు నెలలు కూడా కాలేదు.. అప్పుడే రహదారి ప్రమాదంలో ఆమెను మృత్యువు కబలించింది.

Updated : 24 Feb 2024 04:46 IST

యువ ఎమ్మెల్యే లాస్యనందిత మృతితో విషాదం
కార్పొరేటర్‌ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా..
ఈనాడు, హైదరాబాద్‌, కంటోన్మెంట్‌, కార్ఖానా, ముషీరాబాద్‌, రాంనగర్‌ న్యూస్‌టుడే

తండ్రి సాయన్నతో లాస్యనందిత

మూడు పదుల వయసు.. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లో అరంగేట్రం.. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్పొరేటర్‌ నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన వైనం.. చిన్న వయసులోనే శాసనసభలో అడుగుపెట్టి..  అర్ధాంతరంగా తనువు చాలించింది సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందిత (37).

గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్యే ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి కృషి చేస్తూ వారి మన్ననలు పొందింది. లాస్యనందిత ఎమ్మెల్యేగా ఎన్నికై మూడు నెలలు కూడా కాలేదు.. అప్పుడే రహదారి ప్రమాదంలో ఆమెను మృత్యువు కబలించింది. ఆమె అకాల మరణంతో నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పటాన్‌ చెరువు సమీపంలోని బాహ్యవలయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె విగతజీవిగా మారడం అందరిని తీవ్ర దిగ్భా‌్రంతికి గురిచేసింది.

సంఘటన స్థలం నుంచి ఆమె మృతదేహాన్ని గాంధీకి తరలించగా... పోస్ట్‌మార్టం అనంతరం కార్ఖానాలోని ఆమె నివాసానికి తరలించారు. అప్పటికే వేలమంది చేరుకున్నారు. అందరితో నవ్వుతూ మాట్లాడుతూ కలుపుగోలుగా ఉండే లాస్య ఇకలేరన్న సమాచారంతో కంటోన్మెంట్‌్, కవాడిగూడ డివిజన్‌లో విషాదం నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, సన్నిహితులు కార్ఖానాలోని ఆమె నివాసంవద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఏడాది వ్యవధిలో ఎమ్మెల్యేగానే లాస్యనందిత, ఆమె తండ్రి సాయన్న మరణించడంతో వారి కుటుంబంలో అంతులేని విషాదం ఆవరించింది.

ప్రస్థానమిలా: సికింద్రాబాద్‌ సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో పదోతరగతి, నారాయణగూడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌, మల్లారెడ్డి కళాశాలలో బీటెక్‌ చదివారు. సాయన్న రాజకీయ వారసురాలిగా 2015లో కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. 2016లో కవాడిగూడ కార్పొరేటర్‌గా గెలిచారు.

కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన రోజున బొట్టుపెడుతూ..

చిన్న వయసులోనే శాసన సభ్యురాలిగా..

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జి.సాయన్న గతేడాది ఫిబ్రవరి 19న అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వారసురాలిగా లాస్య నందితను భారాస ఎంపిక చేసింది. అప్పటికే కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేసిన అనుభవం ఉండడంతో నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారాస అధిష్ఠానం అవకాశం ఇవ్వగా.. విజయం సాధించింది.

ఎప్పుడూ ప్రజల వెంటే..: కవాడిగూడ కార్పొరేటర్‌గా 2020 ఎన్నికల్లో ఓడిపోయారు. భారాస డివిజన్‌ ఇన్‌ఛార్జిగా ప్రజల చెంతే మెలిగారు. ఎమ్మెల్యే సాయన్నకు అనారోగ్య సమస్యలతో తండ్రి తరఫున నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

లాస్య నందిత పార్థివదేహం వద్ద ఆమె సోదరి, బంధువులను ఓదారుస్తున్న ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి సబిత


తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి..

లాస్యనందిత తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇంజినీరింగ్‌ చదువుకున్న ఆమెకు ఊహ వచ్చేప్పటికే తండ్రి సాయన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. సాయన్నకు ముగ్గురూ కుమార్తెలే కావడంతో ఒక్కరినైనా రాజకీయ వారసురాలిగా తీర్చిదిద్దుదామని 2014లో నిర్ణయించారు. పెద్ద కుమార్తె నమ్రతకు పెళ్లి కావడం, రెండో కుమార్తె నివేదితను రాజకీయాల్లోకి తీసుకొద్దామనుకున్నా.. అందరికంటే చిన్నదైన లాస్యనందిత హుషారుగా ఉండడంతో ఆమెను రాజకీయరంగ ప్రవేశం చేయించారు. కంటోన్మెంట్‌ బోర్డుకు 2015లో జరిగిన ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి లాస్య నందితను నిలబెట్టారు.


అంతిమయాత్రలో ప్రముఖులు...

లాస్యనందిత అంతిమయాత్రలో కుటుంబసభ్యులతో పాటు పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేఏ పాల్‌ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.


సాయన్న రుణం తీర్చుకోవడానికి..

సాయన్న ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన ప్రత్యేక నిధులను కేటాయించి ఈస్ట్‌ మారేడుపల్లిలోని హిందు శ్మశానవాటికలో పలు అభివృద్ధి పనులు చేశారు. ఆయన రుణం తీర్చుకోవడానికి శ్మశానవాటిక కమిటీ సభ్యులు సాయన్నపై అభిమానంతో లాస్యనందిత అంత్యక్రియలకు సంబంధించిన దహన సంస్కారాల ఖర్చును సొంతంగా భరించారు.

అంతిమయాత్రలో బంధువులు, భారాస శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు

ఎమ్మెల్యే ఇంటికి తరలివచ్చిన స్థానికులు

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. సంతాప  సూచకంగా గాలిలోకి పోలీసుల కాల్పులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని