logo

Crime News: ఐటీ ఉద్యోగాలు పోయి.. సైబర్‌ మోసాలకు తెరలేపి

ఐటీ సంస్థల్లో పనిచేసి ఉద్యోగం కోల్పోయిన ఇద్దరు డబ్బు కోసం సైబర్‌ నేరగాళ్ల అవతారం ఎత్తారు.

Updated : 25 Feb 2024 06:54 IST

శివప్రసాద్‌ , రంగ పార్థుడు

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ సంస్థల్లో పనిచేసి ఉద్యోగం కోల్పోయిన ఇద్దరు డబ్బు కోసం సైబర్‌ నేరగాళ్ల అవతారం ఎత్తారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల్ని మోసం చేస్తూ విలాస జీవితం గడుపుతున్నారు. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన నిందితులే సొంతంగా సైబర్‌ నేరాలు చేస్తూ సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు పట్టుబడ్డారు. నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ డేటా ప్రకారం..వీరిద్దరికి ఏపీ, తెలంగాణలో మొత్తం 12 మోసాల్లో ప్రమేయమున్నట్లు డీసీపీ శిల్పవల్లి ఓ ప్రకటనలో వెల్లడించారు.

నకిలీ పత్రాలు ఇచ్చి.. ప్రకాశం జిల్లా మద్దిపాడుకు చెందిన ముచ్చు శివప్రసాద్‌(32) హైదరాబాద్‌, బెంగళూరులోని పలు ఐటీ సంస్థల్లో పనిచేశాడు. మాంద్యం కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్నాడు. శివ 2017లో ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న సమయంలో సహోద్యోగి ధన్‌రాజ్‌తో పరిచయం ఏర్పడింది. ఉద్యోగాన్వేషణలో ఉన్న ప్రకాశం జిల్లా కంభం మండలానికి చెందిన భట్టుగారి రంగపార్థుడి(26)తో జతకట్టారు. డబ్ల్యూఎన్‌ఎస్‌ గ్లోబల్‌ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. నగరానికి చెందిన ఓ యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని రంగపార్థు నమ్మించి రూ.1.6 లక్షలు వసూలు చేసి  నకిలీ నియామకపత్రం ఇచ్చాడు. బాధితుడు దాన్ని మైండ్‌స్పేస్‌లోని డబ్ల్యూఎన్‌ఎస్‌ గ్లోబల్‌ సర్వీ సెస్‌ సంస్థ ప్రతినిధులకు చూపించగా మోసమని తెలిసింది. జనవరి 26న బాధితుడు ఫిర్యాదు చేయగా.. సైబర్‌క్రైమ్‌ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులు శివప్రసాద్‌, రంగపార్థుడుని అరెస్టు చేశారు. ధన్‌రాజ్‌ పరారీలో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని