logo

HYD Metro: మెట్రోలో సీటు కావాలా.. ముందు స్టేజీకి వెళ్లి వెనక్కి రావాల్సిందే

రద్దీకి తగ్గ మెట్రో రైళ్లు లేక ప్రయాణికులు ఆపసోపాలు పడుతున్నారు. దూర ప్రయాణికులు సీటు కోసం రకరకాల ఫీట్లు చేస్తున్నారు.

Updated : 27 Feb 2024 07:06 IST

రాయదుర్గంలో నిత్యం ప్రయాణికుల పోరాటమే

స్టేషన్‌లో నెలకొన్న రద్దీ

ఈనాడు, హైదరాబాద్‌: రద్దీకి తగ్గ మెట్రో రైళ్లు లేక ప్రయాణికులు ఆపసోపాలు పడుతున్నారు. దూర ప్రయాణికులు సీటు కోసం రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఇది మిగతా ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. మెట్రో కారిడార్‌-3లో రాయదుర్గం చివరి స్టేషన్‌. ఇక్కడ మెట్రోరైలు పూర్తిగా ఖాళీ కావాలి. కానీ సీట్ల నిండా ప్రయాణికులు ఉంటున్నారు. సిబ్బంది అనౌన్స్‌మెంట్‌ చేస్తున్నా ఎవరూ దిగడం లేదు. సాయంకాలం వేళ నాగోల్‌ వెళ్లాల్సిన ప్రయాణికులు ముందుగా దుర్గంచెరువు, హైటెక్‌సిటీ స్టేషన్లలో రాయదుర్గం వెళ్లే మెట్రోలో ఎక్కి కూర్చుకుంటున్నారు. దీంతో రాయదుర్గంలో ఎక్కే ప్రయాణికులకు సీట్లు దొరకడం లేదు. దీనిపైనే మెట్రో అధికారులకు తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు. తాను 15 మెయిల్స్‌ రాశానని, ఎన్నోసార్లు ఫోన్‌లో ఫిర్యాదు చేసినా చర్యలు లేవని బ్రహ్మరిష్‌ అనే ప్రయాణికుడు వాపోయారు.


ఎక్కడం, దిగడం ఒకటే ప్లాట్‌ఫాంతో..

అధికారులు హెచ్చరిస్తున్నా ఎక్కువ మంది ముందు స్టేషన్లలో మెట్రో ఎక్కడానికి రాయదుర్గం స్టేషన్‌లోనే రివర్సల్‌ ఉండటమే కారణం. సాధారణంగా చివరి స్టేషన్లలో మెట్రో ఆగిన తర్వాత ప్రయాణికులను దింపేసి 200 మీటర్ల వరకు అలాగే ముందుకెళుతుంది. అక్కడ ఉన్న రివర్సల్‌లో ట్రాక్‌ మారి.. మరోవైపు ఉన్న ప్లాట్‌ఫాం మీదకు మెట్రో వస్తుంది. రాయదుర్గంలో స్టేషన్‌లోనే రివర్సల్‌ ఉంది. దీంతో మెట్రో ఎక్కడం, దిగడం ఒకటే ఫ్లాట్‌ఫాం మీద జరుగుతోంది. మెట్రో ఆగేదే ఆలస్యం ప్రయాణికులు ఎక్కేస్తుంటారు. లోపల అందరూ దిగారా? లేదా? అని పర్యవేక్షించడం సిబ్బందికి సవాల్‌ మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని