logo

వేచిన తరుణం.. వచ్చేసింది

రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌ (అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తులను పరిష్కరించటానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మార్చి 31లోగా లే అవుట్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది.

Published : 28 Feb 2024 01:59 IST

ఎల్‌ఆర్‌ఎస్‌కు సర్కారు పచ్చజెండా

వికారాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయం

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్‌, పరిగి: రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌ (అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తులను పరిష్కరించటానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మార్చి 31లోగా లే అవుట్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలోని నాలుగు పురపాలికల్లో ఉన్న దరఖాస్తుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

20 వేలకు పైగా దరఖాస్తులు: జిల్లాలో 2020లో గత ప్రభుత్వ అధికారులు ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తులు స్వీకరించారు. ఇలా మొత్తం 20 వేలకు పైగా వచ్చాయి. తరువాత వాటికి పరిష్కార మార్గం చూపలేదు. అప్పటి నుంచి దరఖాస్తు దారులు వేచి చూస్తున్నారు. వికారాబాద్‌ జిల్లా హైదరాబాద్‌ నగరానికి సమీపంలో ఉండటంతో జిల్లాలో భూ క్రయ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడి స్థలాల ధరలు విపరీతంగా పెరిగాయి. వికారాబాద్‌, నవాబ్‌పేట, మోమిన్‌పేట, పూడూరు మండలాల్లో జోరుగా వెంచర్లు వెలియడంతో కొనుగోలుదారులు వాటిలో ప్లాట్లు తీసుకున్నారు. చాలా వెంచర్లకు అనుమతి లేకపోవడంతో పురపాలికలు అధికారులు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను తీసుకు వచ్చింది. తాజాగా ఈ పథకం కింద మార్చి 31 లోగా లేఅవుట్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది.

ఒక్కో ప్లాట్‌కు రూ.1000 డిపాజిట్‌: జిల్లాలో నాలుగు పురపాలికలుంటే..ఎల్‌ఆర్‌ఎస్‌ కింద వికారాబాద్‌ 3972, పరిగి 4174, తాండూరులో 4000 కొడంగల్‌ 3000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు సమయంలో ఒక్కో ప్లాట్‌కు రూ.1000 చొప్పున డిపాజిట్‌ చెల్లించారు. వాటిని పరిష్కరించటానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  ఈ నేపథ్యంలో పురపాలికలకు ఆదాయం బాగానే సమకూరే అవకాశం ఉంది.

  • వంద గజాల లోపు స్థలం రెగ్యులరైజ్‌ చేసుకుంటే పురపాలికకు ప్రాంతాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.25 వేల వరకు ఆదాయం సమకూరుతుంది. ప్లాట్లు వేసిన ప్రాంతాల్లో మరింత ఆదాయం వచ్చే వీలుందని అధికారులు భావిస్తున్నారు.

అవసరం మేరకు సిబ్బంది లేరు  

ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తులను పరిశీలించేందుకు పురపాలికల్లో అవసరం మేరకు సిబ్బంది లేరు. క్షేత్ర స్థాయిలో దరఖాస్తులను పరిశీలించేందుకు బిల్డింగ్‌ ఇన్‌స్పెకర్లు, చైన్‌మెన్లు అవసరం. జిల్లాలో 4 పురపాలికల్లో బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు, చైన్‌మెన్లు లేరు. టీపీఏఎస్‌ వారానికి ఒక సారి మాత్రమే వికారాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన పరిగి, కొడంగల్‌లో భవన నిర్మాణ అనుమతుల విభాగానికి పోస్టులు మంజూరు చేయలేదు. తాండూరులో నలుగురు అధికారులకు ఒక్కరే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పనులు వేగంగా సాగాలంటే కొత్త సిబ్బందిని నియమించాలని పలువురు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని