logo

పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయానికి చేవెళ్ల పునాది కావాలి

కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజాపాలనకు ఆకర్షితురాలినై కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు వికారాబాద్‌ జడ్పీ ఛైరపర్సన్‌ పట్నం సునీతారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేద ప్రజల ఆశాజ్యోతి అని కొనియాడారు.

Published : 28 Feb 2024 02:01 IST

చేవెళ్ల సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి, చిత్రంలో జడ్పీ అధ్యక్షురాలు సునీత, తాండూరు ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌, హాజరైన ప్రజలు

చేవెళ్ల, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజాపాలనకు ఆకర్షితురాలినై కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు వికారాబాద్‌ జడ్పీ ఛైరపర్సన్‌ పట్నం సునీతారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేద ప్రజల ఆశాజ్యోతి అని కొనియాడారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా చేవెళ్లలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో ఆమె సీఎంతో కలిసి పాల్గొని మాట్లాడారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్‌ పార్టీ గెలుపునకు నాంది పలకాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేవెళ్ల పార్లమెంట్‌ ఇంఛార్జి బాధ్యతలు తీసుకున్నందున.. భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. మనస్పర్థలు పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని శ్రేణులను కోరారు.

ఉత్సాహం నింపిన ప్రసంగం.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగం ఆద్యంతం కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. తనదైన శైలిలో ప్రతిపక్షాలపై విమర్శలు చేయడంతో కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఉమ్మడి రంగారెడ్డిజిల్లా సమస్యలపై ప్రస్తావించగా చప్పట్లు కొడుతూ ఈలలు వేశారు.

  • కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని రంగారెడ్డి జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి అన్నారు. రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పథకాలతో మహిళల ముఖాల్లో కాంతి నెలకొందన్నారు. రూ.60వేలకు తులం ఉన్న బంగారం సగం ధరకు ఇస్తే ఎంత సంతోషం ఉంటుందో..రూ.500లకే సిలిండర్‌ ఇవ్వనుండటంతో అంతే ఆనందం మహిళల్లో కనబడుతోందన్నారు.  

జనజాతర సభ  సైడ్‌లైట్స్‌:

  • రాష్ట్ర నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడంతో సభ నిర్వహించిన ఫరా కళాశాల మైదానం కిక్కిరిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచే జనం తరలివచ్చారు. కళాకారులు తమ ఆటపాటలతో అలరించారు. జై కాంగ్రెస్‌ నినాదాలతో సభ పరిసరాలు మార్మోగాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రులు హాజరవడంతో  పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
  • సభలో ఊమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని తాండూరు, పరిగి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, పార్టీ చేవెళ్ల ఇన్‌ఛార్జి పామెన భీంభరత్‌, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డిలకు సభలో మాట్లాడే అవకాశం దక్కింది.
  • ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో సభకు వస్తారని హెలిప్యాడ్‌ సిద్ధం చేసినప్పటికీ రోడ్డు మార్గంలో సాయంత్రం 6 గంటలకు చేవెళ్ల సభకు వచ్చారు. ఆయనకు వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని