logo

మట్టి తవ్వద్దని గట్టిగా చెప్పే వారేరీ?

జిల్లాలో అడ్డూ అదుపులేని మట్టి తవ్వకాలతో గుట్టలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు మాయమైపోతున్నాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు తీవ్రంగా గండి పడుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు మొక్కుబడి చర్యలతో సరిపెడుతున్నారు.

Published : 28 Feb 2024 02:04 IST

అడ్డూ అదుపూ లేకుండా  తరలింపు

తాండూరులో ఆనవాళ్లు కోల్పోయిన గుట్ట

న్యూస్‌టుడే, తాండూరు, మోమిన్‌పేట, పరిగి: జిల్లాలో అడ్డూ అదుపులేని మట్టి తవ్వకాలతో గుట్టలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు మాయమైపోతున్నాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు తీవ్రంగా గండి పడుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు మొక్కుబడి చర్యలతో సరిపెడుతున్నారు. దీనికి సంబంధించి  ‘న్యూస్‌టుడే’ ‘పరిశీలనాత్మక’ కథనం.

దశాబ్దాలుగా నేలమట్టం చేస్తున్నారు

జిల్లాలో 566 పంచాయతీలుండగా తాండూరు, వికారాబాద్‌, మోమిన్‌పేట, యాలాల, నవాబ్‌పేట, పరిగి, పూడూరు తదితర ప్రాంతాల్లో విలువైన గుట్టలు, ఖాళీ ప్రదేశాలున్నాయి. వీటిపై దశాబ్దాలుగా అక్రమార్కుల కన్ను పడి నేలమట్టమవుతున్నాయి.

  • పట్టా, ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు జరిగితే రెవెన్యూ, గనుల శాఖ అధికారులు అడ్డుకోవాలి. అనుమతులు లేకుండా తవ్వకాలు జరిగినట్లు తేలితే వాహనాలు, యంత్రాలను జప్తు చేయాలి. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేయాలి. అయితే రెండు శాఖల అధికారులు ఇవేమీ పట్టించుకోవడంలేదు. దీంతో అక్రమార్కులు యథేచ్చగా తవ్వకాలు జరిపి రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు.
  • రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ మట్టిని లారీలు, ట్రాక్టర్లలో నింపగానే అవి నిర్ణీత ప్రదేశాలకు  చేరుకుంటున్నాయి.
  • మోమిన్‌ పేట మండలం ఎన్కతల, మోమిన్‌పేట, చంద్రాయన్‌పల్లి, గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో శని, ఆదివారాల్లో రాత్రివేళ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి.

మొక్కుబడి జరిమానాలు

పరిగి, దోమ, కుల్కచర్ల, చౌడాపూర్‌ మండలాల్లో అధికారులు అడపా దడపా పట్టుకుంటున్నా జరిమానాలు వేసి వదిలేయడంతో మళ్లీ అదే పనిగా చేపడుతున్నారు. ఎక్కువగా రాత్రి సమయంలో ఈ తతంగం నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు చెందాల్సిన రాయల్టీ అందకుండా పోతోంది.  

రోజుకు రూ.5 లక్షల విలువైన విక్రయాలు  

జిల్లా వ్యాప్తంగా అనధికారిక అంచనా ప్రకారం మట్టి తవ్వకాల దందా రూ.కోట్లల్లోనే ఉంటోంది. ప్రతి రోజు రూ.5లక్షలకు పైబడి విలువ చేసే మట్టి విక్రయాలు జరుగుతున్నాయి. ఈలెక్కన నెలకు రూ.1.50కోట్లుగా ఉంటుంది.

  • అదే వర్షా కాలం మినహా సంవత్సరంలోని 8 నెలలకు లెక్కిస్తే రూ.12 కోట్లుగా ఉంటుంది. అయితే ప్రభుత్వానికి మాత్రం ఆదాయం మాత్రం సమకూరడం లేదు.

ట్రాక్టర్‌కు రూ.3000 నుంచి రూ.6000

పరిధిని బట్టి ట్రాక్టరు మట్టిని రూ.3,000, లారీ మట్టిని రూ.6000 చొప్పున విక్రయిస్తున్నారు. నిబంధనల ప్రకారం గనులు, రెవెన్యూ శాఖ నుంచి అనుమతి పొంది తవ్వకాలు జరిపితే ప్రభుత్వానికి ఒక్కో క్యూబిక్‌ మీటర్‌ వద్ద అన్ని రకాల ఫీజులు కలిపి రూ.42.80 ఆదాయంగా సమకూరుతుంది. వాస్తవంలో ఇలాంటిదేమీ లేదు.  

రెవెన్యూ శాఖదే బాధ్యత: శామ్యూల్‌ జాకబ్‌, గనుల శాఖ సహాయ సంచాలకులు, తాండూరు

ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న మట్టి తవ్వకాలను అడ్డుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖదే. లేదంటే మాకు లేఖ రాస్తే తవ్వకాలను నిలువరిస్తాం. అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలు పట్టుబడితే జరిమాన విధిస్తాం. లీజుతోనే తవ్వకాలు చేపట్టాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని