logo

కాంగ్రెస్‌ హామీలు అమలయ్యే వరకు వెంటాడుతాం

కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకిచ్చిన 420 హామీలు అమలయ్యే వరకు వెంటాడుతామని, వాటిని ప్రజల్లోకి తీసుకెళుతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీలను నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దన్నారు.

Updated : 28 Feb 2024 05:26 IST

అంబర్‌పేటలో మాట్లాడుతున్న కేటీఆర్‌. చిత్రంలో కాలేరు వెంకటేశ్‌, మహమూద్‌ అలీ, గండ్ర వెంకట  రమణారెడ్డి, అరెకపూడి గాంధీ, ఎడ్ల సుధాకర్‌రెడ్డి

అంబర్‌పేట, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకిచ్చిన 420 హామీలు అమలయ్యే వరకు వెంటాడుతామని, వాటిని ప్రజల్లోకి తీసుకెళుతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీలను నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దన్నారు. మంగళవారం ఛేనంబరు చౌరస్తాలోని ఫంక్షన్‌ హాలులో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అధ్యక్షతన జరిగిన భారాస ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డివి అడ్డగోలు మాటలు తప్ప చేతల్లో ఏమిలేదని ధ్వజమెత్తారు. సికింద్రాబాద్‌ ఎంపీ, కేంద్రమంత్రిగా పనిచేస్తున్న కిషన్‌రెడ్డి సీతాఫల్‌మండి రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్‌లు, గుడిమల్కాపూర్‌లో రెండు వాటర్‌ ట్యాంకుల ప్రారంభం మినహా చేసిందేమి లేదని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, అరికెపూడి గాంధీ, బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సాయికిరణ్‌యాదవ్‌, భారాస ఇన్‌ఛార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, కార్పొరేటర్లు విజయ్‌కుమార్‌గౌడ్‌, లావణ్య, పద్మ పాల్గొన్నారు.

హామీలు వంద రోజుల్లో అమలు చేయాలి

ఇబ్రహీంపట్నం: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను వంద రోజుల్లో అమలు చేయలేని పక్షంలో ప్రజల తరఫున భారాస నాయకులు, కార్యకర్తలు పోరాటం చేస్తామని కేటీఆర్‌ తెలిపారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని వేద కన్వెన్షన్‌లో భారాస జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అధ్యక్షతన భారాస నియోజకవర్గ సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక అనేక ఇబ్బందులు పడుతోందన్నారు. పాలమూరు రంగారెడ్డి పనులు 90శాతం పనులు భారాస ప్రభుత్వం పూర్తిచేసిందని మిగత పది శాతం పనులు పూర్తి చేయని పక్షంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మార్చి 17 తరువాత కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, శేరిలింగంపల్లి, చేవెళ్ల ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేష్‌, షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్‌, దండెం రాంరెడ్డి, వంగేటి లక్ష్మారెడ్డి, సత్తు వెంకటరమణారెడ్డి, ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, డీసీసీ జిల్లా అధ్యక్షుడు కొత్తకుర్మ సత్తయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని