logo

తెలుగును ఆంగ్లంలోకి మారుస్తూ.. ఖజానాకు కన్నం

అన్నదాతల తెలుగు పేర్లను ఆంగ్లంలోకి మార్చేందుకు వచ్చిన అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ఒకటి రెండు కాదు.. ఏకంగా రూ.కోటి కొట్టేశాడు. ప్రభుత్వ ఉద్యోగిగా తన పరిజ్ఞానాన్ని ఉపయోగించి మూడేళ్ల పాటు ఖజానాకు కన్నం వేశాడు.

Published : 28 Feb 2024 04:17 IST

వ్యవసాయ శాఖలో ఏఈవో శ్రీశైలం మాయాజాలం

ఈనాడు, హైదరాబాద్‌: అన్నదాతల తెలుగు పేర్లను ఆంగ్లంలోకి మార్చేందుకు వచ్చిన అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ఒకటి రెండు కాదు.. ఏకంగా రూ.కోటి కొట్టేశాడు. ప్రభుత్వ ఉద్యోగిగా తన పరిజ్ఞానాన్ని ఉపయోగించి మూడేళ్ల పాటు ఖజానాకు కన్నం వేశాడు. రైతు బీమా, రైతు బంధు పథకాల నిధులు రూ.2 కోట్లు స్వాహా చేసిన కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రాథమికంగా గుర్తించలేని విధంగా వ్యవసాయ విస్తరణాధికారి శ్రీశైలం ఈ కుంభకోణానికి తెరలేపినట్లు సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూ పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతోంది.

పేర్ల నమోదులో మోసం..

రైతు బీమా పథకంలో భాగంగా క్షేత్రస్థాయిలో అర్హుల వివరాల నమోదుకు సీసీఎల్‌ఏలో నమోదైన రైతుల వివరాలు తెలుగులో వ్యవసాయ విస్తరణాధికారుల(ఏఈవో)కు చేరుతాయి. ఈ జాబితా ఆధారంగా ఏఈవో తన పరిధిలో మరణించిన రైతుల వివరాలు.. ఆధార్‌తో తనిఖీ చేసి.. ధ్రువపత్రాలు, నామినీ వివరాలు యాప్‌లో ఆంగ్లంలో నమోదు చేయాలి. ఇక్కడే శ్రీశైలం అక్రమానికి తెర లేపాడు. తెలుగు పేర్లను ఆంగ్లంలో నమోదు చేసే సమయంలో అసలు అన్నదాతలకు బదులు నకిలీ రైతుల పేర్లు.. నామినీ బ్యాంకు ఖాతాల స్థానంలో తన స్నేహితుడైన క్యాబ్‌ డ్రైవర్‌ ఓదెల వీరస్వామి ఖాతా నంబరు ఉంచేవాడు. ప్రభుత్వ పథకం కావడంతో ఎల్‌ఐసీ సంస్థ పూర్తిస్థాయిలో తనిఖీ చేయకుండా 20 సార్లు పరిహారం మంజూరు చేసింది. ఇదే సమయంలో ఒకే ఖాతాలో నాలుగు సార్లు పరిహారం పడడం.. తనిఖీ చేస్తే బ్యాంకు ఖాతాదారు ఒక్కరే కావడంతో ఎల్‌ఐసీ సంస్థకు అనుమానం వచ్చి, వ్యవసాయ శాఖకు లేఖ రాయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

భార్య మీద కేసు..

ఈ కేసులో శ్రీశైలం సతీమణి మహేశ్వరిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు.. ఆమె పేరిట ఉన్న బ్యాంకు ఖాతాలు ఉపయోగించడం.. ఆమె పేరు మీద అక్రమాస్తులు కొనుగోలు చేయడంతో కేసు రిజిస్టర్‌ చేసినట్లు తెలిసింది. కొందుర్గు మండలంలో దాదాపు 2 వేల మంది దాకా రైతు బంధుకు దరఖాస్తు చేసుకోలేదు. వీరిలో కొందరు దరఖాస్తు చేయాలని.. ధ్రువీకరణ పత్రాలు, ఇతర వివరాలు ఇవ్వగా.. వాటిలో కొన్నింటిని తన దగ్గరే ఉంచుకుని మోసం చేశాడు. భూ యజమాని సహా ఇతర వివరాలు సక్రమంగానే ఉన్నా.. బ్యాంకు ఖాతా మాత్రమే తన స్నేహితుడిది నమోదు చేసి రూ.కోటి కొట్టేశాడు. ఈ కేసులో పోలీసులు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని