logo

ఇంటి తాళాలు పగులగొట్టి నగలు చోరీ

ఇంటి తాళాలు పగులగొట్టి దొంగలు 20 తులాల నగలు ఎత్తుకెళ్లారు. మరో నాలుగు ఇళ్లల్లో చోరీకి ·తెగపడ్డారు. తాళాలు పగులగొట్టి చోరీకి విఫలయత్నం చేశారు. ఈ సంఘటన కుషాయిగూడ ఠాణా పరిధిలో జరిగింది. డీఐ సాయిప్రకాష్‌ గౌడ్‌ కథనం ప్రకారం...

Published : 28 Feb 2024 02:11 IST

ఇంట్లో చిందర వందరగా దుస్తులు

కాప్రా, న్యూస్‌టుడే: ఇంటి తాళాలు పగులగొట్టి దొంగలు 20 తులాల నగలు ఎత్తుకెళ్లారు. మరో నాలుగు ఇళ్లల్లో చోరీకి ·తెగపడ్డారు. తాళాలు పగులగొట్టి చోరీకి విఫలయత్నం చేశారు. ఈ సంఘటన కుషాయిగూడ ఠాణా పరిధిలో జరిగింది. డీఐ సాయిప్రకాష్‌ గౌడ్‌ కథనం ప్రకారం... కాప్రా సర్కిల్‌ ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ నార్త్‌ కమలానగర్‌లోని రాఘవకృష్ణ అపార్టుమెంట్‌లోని మొదటి అంతస్తులో నివాసం ఉంటున్న బీవీ సుభ్రమణ్యం విశ్రాంత రైల్వే ఉద్యోగి. ఈ నెల 25న ఇంటికి తాళంవేసి ఆయన కుటుంబంతో కలిసి కాశీకి తీర్థయాత్రకు వెళ్లారు. మంగళవారం ఉదయం బహుళ అంతస్తుల్లోని పైపోర్షన్‌లో నివాసం ఉంటున్న వారు ఇంటి తలుపు తెరిచి ఉండటం గమనించి పక్కనే నివాసం ఉంటున్న ఇంటి యజమాని సోదరుడు హరినారాయణమూర్తికి సమాచారం ఇచ్చారు. ఆయన వెళ్లి చూడగా ఇంట్లో బీరువాలోని దుస్తులు చిందరవందరగా పడేసిఉన్నాయి. విషయాన్ని పర్యటనలో ఉన్న తన సోదరునికి చెప్పగా బీరువాలో 20 తులాలకుపైగా బంగారు నగలు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈమేరకు హరినారాయణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు చేయడంతో ఠాణాలో కేసు నమోదు చేశారు. గడ్డపారతో దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టారు. అందుకు ఉపయోగించిన గడ్డపారను ఇంటి వద్దే వదిలి వెళ్లారు.

మరో నాలుగు ఇళ్లల్లో విఫలయత్నం.. దొంగలు మరో నాలుగు తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున పక్కనే ఉన్న భవానీనగర్‌లోని మరో మూడు ఇళ్లు, ఓ ప్రైవేటు సెక్యూరిటీ కార్యాలయంలో తలుపుల తాళాలు పగులగొట్టి చోరీకి విశ్వప్రయత్నం చేశారు. పక్కా ప్రణాళికతో దొంగలు సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను ఎంచుకుని రెక్కీ నిర్వహించిమరీ చోరీకి తెగబడ్డట్లు అర్థమవుతోంది. రాచకొండ పోలీసుల నిబంధనలను పాటించక పోవడం, ఇంట్లో విలువైన నగలు ఉంచండం.. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకవడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మల్కాజిగిరి డీసీపీ పద్మజ, కుషాయిగూడ ఏసీపీ నరేష్‌రెడ్డి, క్లూస్‌టీం బృందం, సీసీఎస్‌ పోలీసులు సందర్శించి ఆధారాలు సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని