logo

నిలిపిన చెత్త టిప్పర్‌ను ఢీకొని పెయింటర్‌ దుర్మరణం

శామీర్‌పేట- కీసర అవుటర్‌ రింగ్‌ సర్వీస్‌ రోడ్డుపై చెడిపోయిన చెత్త టిప్పర్‌ను ఎలాంటి హెచ్చరికలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా నిలిపి వేయటంతో చీకట్లో కనిపించక ఓ ద్విచక్రవాహనదారుడు వెనక నుంచి ఢీకొనటంతో దుర్మరణం పాలైన సంఘటన శామీర్‌పేట ఠాణా పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.

Published : 28 Feb 2024 02:15 IST

కృష్ణ

శామీర్‌పేట, న్యూస్‌టుడే: శామీర్‌పేట- కీసర అవుటర్‌ రింగ్‌ సర్వీస్‌ రోడ్డుపై చెడిపోయిన చెత్త టిప్పర్‌ను ఎలాంటి హెచ్చరికలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా నిలిపి వేయటంతో చీకట్లో కనిపించక ఓ ద్విచక్రవాహనదారుడు వెనక నుంచి ఢీకొనటంతో దుర్మరణం పాలైన సంఘటన శామీర్‌పేట ఠాణా పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. శామీర్‌పేట ఎస్‌ఐ చంద్రశేఖర్‌, బంధువులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని కాప్రా సర్కిల్‌ ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన తిప్పరమైన కృష్ణ (33) పెయింటర్‌, వెల్డర్‌గా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శామీర్‌పేట మండలం లాల్‌గడి మలక్‌పేటలో పనులు ముగించుకుని తన ద్విచక్రవాహనంపై శామీర్‌పేట- కీసర అవుటర్‌ సర్వీస్‌ రోడ్డు మీదుగా ఇంటికి బయలుదేరాడు. దారిలో ఉప్పరిపల్లి గ్రామం వద్ద సర్వీస్‌ రోడ్డుపై ఓ చెత్త టిప్పర్‌ చెడిపోవటంతో రోడ్డుపై ఎలాంటి హెచ్చరికలు ఏర్పాటు చేయకుండా నిలిపారు. చీకట్లో టిప్పర్‌ కనిపించక వెనుక నుంచి ఢీకొనటంతో హెల్మెట్‌ పెట్టుకున్నా ఊడిపోయి తల పగిలి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న కృష్ణ మృతి చెందటంతో అతడి భార్య, పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. శామీర్‌పేట ఎస్‌ఐ చంద్రశేఖర్‌ చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


అమ్మాయిలకు వల.. యువకుడి అరెస్టు

నారాయణగూడ, న్యూస్‌టుడే: నకిలీ సామాజిక మాధ్యమ ఖాతాలను తెరిచి, ఫ్రెండ్స్‌ రిక్వెస్ట్‌ పంపిస్తూ అమాయక యువతులను ట్రాప్‌ చేస్తున్న నిందితుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఓ బాలిక(17)కు ఆన్‌లైన్‌లో పరిచయమైన ఓ యువకుడు మొదట స్నేహపూర్వకంగా చాటింగ్‌ చేశాడు. ఆ తర్వాత డబ్బు ఇవ్వాలని, తన సెల్‌ఫోన్‌ రీఛార్జి చేయాలంటూ బెదిరించేవాడు. లేకపోతే మార్ఫింగ్‌ చేసిన చిత్రాలను వైరల్‌ చేస్తానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో బాలిక ఇన్‌స్టా ఖాతాలోని చిత్రాలను తస్కరించి మార్ఫింగ్‌ చేసి ఆమె బంధువులకు పంపాడు. దాంతో ఆ బాలిక కొంత డబ్బు పంపినా వేధించడం ఆపలేదు. బాధితురాలు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేసింది. నిందితుడు దిల్లీలో ఉంటున్న ప్రైవేటు ఉద్యోగి (29)గా గుర్తించి అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు.


బైక్‌లపై మోజుతో చోరీలు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: యమహా ఆర్‌ఎక్స్‌ 100 బైకుపై మోజుతో వాటిని చోరీ చేసిన యువకులు కటకటాలపాలయ్యారు. ఖైరతాబాద్‌ పోలీసుల వివరాల ప్రకారం.. ఓ న్యాయమూర్తి వద్ద డ్రైవర్‌గా పనిచేసే మల్లేశ్‌ ఆనంద్‌నగర్‌ కాలనీలో ఉంటున్నాడు. డ్రైవర్‌ సకాలంలో విధులకు వచ్చేలా న్యాయమూర్తి తన యమహా బైకు ఇచ్చారు. జనవరి 11న రాత్రి డ్రైవర్‌ తన ఇంటి ముందు బైక్‌ పార్కు చేయగా మరుసటి రోజు ఉదయం కనిపించలేదు. ఫిర్యాదుతో పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరకు ఎర్రమంజిల్‌లోని హిల్‌కాలనీకి చెందిన మైనర్‌(17) చోరీ చేసినట్లు, అతనికి ఓ యువకుడు(18) సహకరించినట్లు తేలింది. వారిచ్చిన సమాచారంతో మొత్తం 8 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వారంతా ఇంజినీరింగ్‌, ఇంటర్‌ చదువుతున్నారు.


తప్పించుకు తిరుగుతున్న నిందితుడి అరెస్ట్‌

ఈనాడు, హైదరాబాద్‌: తప్పుడు పత్రాలతో రవికుమార్‌ డిస్టిలరీస్‌ అనే సంస్థను మోసం చేసి రూ.29 కోట్లు కొట్టేసిన కేసులో 2013 నుంచి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు సాంబశివయ్యార్‌ స్వామినాథన్‌ను సీఐడీ పోలీసులు ఈనెల 18వ తేదీన అరెస్టు చేశారు. సీఐడీ అదనపు డీజీ షీకాగోయల్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రవికుమార్‌ డిస్టిలరీస్‌ సంస్థ షేర్ల వ్యాపారానికి సహాయం చేస్తానంటూ అనిల్‌ బేణి ప్రసాద్‌ అగర్వాల్‌ తదితరులు రూ.29 కోట్ల మోసానికి పాల్పడ్డారు. 2013లో నాచారం పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు కాగా సీఐడీకి బదిలీ అయింది. చెన్నై విజయనగర్‌ చిరునామాతో ఉన్న ఫస్ట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, ఒన్‌సోర్స్‌ ఐడియాస్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ సంస్థల డైరెక్టర్‌ సాంబశివయ్యర్‌ స్వామినాథన్‌ ప్రమేయం కూడా ఉన్నట్లు తేలింది. ఎల్బీ నగర్‌ న్యాయస్థానం అప్పట్లోనే ఆయనపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. అప్పటి నుంచీ పరారీలోనే ఉన్నాడు. స్వామినాథన్‌ చెన్నైలో ఉన్నట్లు గుర్తించిన సీఐడీ బృందం నిందితుడ్ని అరెస్టు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని