logo

అనాథలు, అభాగ్యులకు గుర్తింపు

చెత్తకుప్పల వద్ద వదిలేసిన శిశువులు.. తల్లిదండ్రులు లేని చిన్నారులు.. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో దొరికిన పిల్లలకు రెవెన్యూ శాఖ అధికారులు గుర్తింపు ఇస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో శిశువిహార్‌తో పాటు సంరక్షణ గృహాల్లో ఉంటున్నవారికి నిబంధనల ప్రకారం నామకరణం చేసి ఆధార్‌ కార్డులు, కుల ధ్రువపత్రాలు, దివ్యాంగులకు సదరం ధ్రువపత్రాలు అందజేస్తున్నారు.

Published : 28 Feb 2024 02:18 IST

ఆధార్‌ కార్డులు, కుల ధ్రువీకరణ, సదరం పత్రాలు

ధ్రువపత్రాలు అందిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ (పాత చిత్రం)

ఈనాడు, హైదరాబాద్‌: చెత్తకుప్పల వద్ద వదిలేసిన శిశువులు.. తల్లిదండ్రులు లేని చిన్నారులు.. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో దొరికిన పిల్లలకు రెవెన్యూ శాఖ అధికారులు గుర్తింపు ఇస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో శిశువిహార్‌తో పాటు సంరక్షణ గృహాల్లో ఉంటున్నవారికి నిబంధనల ప్రకారం నామకరణం చేసి ఆధార్‌ కార్డులు, కుల ధ్రువపత్రాలు, దివ్యాంగులకు సదరం ధ్రువపత్రాలు అందజేస్తున్నారు. ఈ మేరకు ఆరేడు నెలలు శ్రమించి 2,700 మందికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేతుల మీదుగా ఇటీవలే ధ్రువపత్రాలు అందజేశారు. మరో 800 మందికి అందజేసేందుకు అధికారులు వివరాలను సేకరిస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌లు వారికి జనన ధ్రువపత్రాలను రూపొందించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. భవిష్యత్తులోనూ ఈ కార్యక్రమం కొనసాగుతుందని, రెండు నెలలకోమారు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అనాథలు, అభాగ్యులకు ప్రామాణిక పత్రాలు అందజేయనున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

ఆర్థిక, ఇతర కారణాలతో..

హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లో కొందరు తల్లిదండ్రులు పేదరికం, ఆర్థిక ఇబ్బందులతో పిల్లలకు ఊహ తెలియనప్పుడే శిశువిహార్‌, కొన్ని స్వచ్ఛంద సేవాసంస్థల్లో వారిని వదిలేస్తున్నారు. మరికొందరు వైకల్యంతో జన్మించిన పిల్లలకు చికిత్స చేయించేందుకు స్తోమత లేక ఆసుపత్రుల్లోనే వదిలేసి వెళ్లిపోతున్నారు. తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలను వారి బంధువులు భారంగా భావించి అనాథ సంరక్షణ కేంద్రాలకు అప్పగిస్తున్నారు. పెళ్లికి ముందే గర్భందాల్చి పిల్లలు పుట్టాక వారిని వదిలించుకునేందుకు కొందరు రోడ్లపై వదిలేస్తున్నారు. ఇలాంటివారు అభాగ్యులుగా మారకుండా ప్రభుత్వం అక్కున చేర్చుకుంటోంది. జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది, పోలీసు అధికారులకు కనిపించిన చిన్నారులను స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారులు శిశు విహార్‌కు తరలించి సంరక్షిస్తున్నారు.

భవిష్యత్‌లో ఇబ్బందుల్లేకుండా..

చిన్నారులను బడిలో చేర్పించాలంటే వారి పేరు, తల్లిదండ్రుల పేర్లు, చిరునామా, కులధ్రువీకరణ పత్రం అవసరం. ఇవన్నీ రెవెన్యూ అధికారులు ఒక్కరే చేయలేరు. అందుకే జనన ధ్రువీకరణ పత్రాన్ని జీహెచ్‌ఎంసీ నుంచి.. పిల్లల పేర్లు, కుల ధ్రువీకరణను వారికి తెలిసినవారు, బంధువుల నుంచి.. వైకల్య ధ్రువీకరణను జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారుల నుంచి తీసుకుంటున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు జనన ధ్రువీకరణపత్రం ఇచ్చిన అనంతరం ఆధార్‌, కుల ధ్రువీకరణ, సదరం పత్రాలను రెవెన్యూ అధికారులు సిద్ధం చేస్తున్నారు. తల్లిదండ్రులు, బంధువులు లేని అనాథలకు సంరక్షకులుగా శిశువిహార్‌ను ఉంచి.. వారికి వెనుకబడిన తరగతుల కుల ధ్రువీకరణ పత్రం అందిస్తున్నారు. ప్రస్తుతం వీరంతా జిల్లాలో శిశు విహార్‌తో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంరక్షణ గృహాల్లో ఉంటున్నారు. చిన్నారుల సంరక్షణకు కృషి చేస్తున్న యునిసెఫ్‌ ప్రతినిధులూ ఈ ప్రక్రియలో రెవెన్యూ అధికారులకు సహకరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని