logo

మూసీకి బృహత్తర ప్రణాళిక

‘మూసీ నీళ్లు తాగే వాళ్లం.. అందులో ఈత కొట్టే వాళ్లం..’ అప్పటి తరాన్ని ఎవర్ని కదిపినా ఈ మాటలు వింటుంటాం. నిజమే.. ఒకప్పుడు మూసీలో స్వచ్ఛమైన నీళ్లు పారేవి. అలాంటి చారిత్రక మూసీకి మంచిరోజులు తెచ్చేందుకు ప్రభుత్వం చకచకా అడుగులేస్తోంది.

Updated : 28 Feb 2024 05:22 IST

57.5 కి.మీ. పొడవునా ఆహ్లాదకర వాతావరణం
జంట జలాశయాల గరిష్ఠ వరద ఆధారంగా హద్దుల గుర్తింపు

సర్వే చేస్తున్న అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: ‘మూసీ నీళ్లు తాగే వాళ్లం.. అందులో ఈత కొట్టే వాళ్లం..’ అప్పటి తరాన్ని ఎవర్ని కదిపినా ఈ మాటలు వింటుంటాం. నిజమే.. ఒకప్పుడు మూసీలో స్వచ్ఛమైన నీళ్లు పారేవి. అలాంటి చారిత్రక మూసీకి మంచిరోజులు తెచ్చేందుకు ప్రభుత్వం చకచకా అడుగులేస్తోంది. బృహత్తర ప్రణాళికకు సన్నద్ధమవుతోంది. ఇందుకు కన్సల్టెంట్‌ నియామకానికి గ్లోబల్‌ స్థాయిలో టెండర్లు పిలవనుంది. 40 సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. డిప్యూటీ కలెక్టర్లు, సర్వేయర్లు, జీహెచ్‌ఎంసీ విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, హెచ్‌ఎండీఏ అధికారులు, పోలీసులు 9 బృందాలుగా సర్వే చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ కలిపి గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 7 టీఎంసీలు. ఈ జలాశయాల వరద లక్ష-లక్షన్నర క్యూసెక్కులుగా అంచనా వేస్తున్నారు. తద్వారా నదికి ఇరువైపులా ఎంతమేర వరద వస్తుందనే కోణంలో ఇరువైపులా హద్దులను నిర్ణయిస్తున్నారు. సర్వే అనంతరం నదీ గర్భం, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ల్లో ఎన్ని నిర్మాణాలున్నాయి.. ఎక్కడ మాల్స్‌, టవర్స్‌ నిర్మించాలి.. ఎమ్యూజ్‌మెంట్ పార్కుల అంశాలపై స్పష్టత రానుందని ఓ అధికారి తెలిపారు.

నాలుగు భాగాలుగా విభజించి..

  • నార్సింగి మొదలుకొని ప్రతాప్‌సింగారం వరకు 57.5 కి.మీ. మూసీ పరీవాహకాన్ని సెమీ అర్బన్‌, కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతం, ప్రధానమైన పాత నగరం, కొత్తగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విడదీసి సర్వే చేస్తున్నారు.
  • మూసీ ప్రక్షాళనలో మురుగు నీటి శుద్ధి చాలా కీలకం. ఇందుకు కొత్తగా 30 ఎస్టీపీలను జలమండలి నిర్మిస్తోంది. ఇందులో శుద్ధి అయిన నీటిని మూసీలోకి వదులుతారు. ఎంత శుద్ధి చేసినా మధ్యలో మళ్లీ మురుగు కలిసే అవకాశముంది. అలా కలవకుండా మూసీ చుట్టూ సివర్‌ ట్రంక్‌ మెయిన్‌ నిర్మించాలనేది మాస్టర్‌ప్లాన్‌లో భాగం.
  • మూసీని ప్రధానంగా రివర్‌ బండ్‌ లైన్‌, గరిష్ఠ బౌండరీ లైన్‌, వల్నరబుల్‌ ప్రాంతాలుగా విడదీసి ప్రత్యేక మాస్టర్‌ ప్లాన్‌తో అభివృద్ధి చేయాలని మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ భావిస్తోంది. ప్రక్రియను ఏడాదిలోపు పూర్తి చేయనున్నారు. నిధుల కోసం జైకా, ఇతర సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని