logo

Hyderabad Metro: ఆస్తుల సేకరణే అతిపెద్ద సవాల్‌

మెట్రోరైలు విస్తరణ ప్రాజెక్ట్‌లో తొలుత పాతబస్తీ మెట్రోని, విమానాశ్రయం వరకు మెట్రోని చేపట్టాలనే ఆలోచనలో సర్కారు ఉంది. నిధులు కేటాయిస్తే పాతబస్తీ మార్గంలో ఆస్తుల సేకరణ చేపట్టనున్నారు.

Updated : 28 Feb 2024 09:17 IST

సర్కారు నిధులిస్తే పాతబస్తీ మెట్రో పనుల ప్రారంభానికి సిద్ధం

 

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోరైలు విస్తరణ ప్రాజెక్ట్‌లో తొలుత పాతబస్తీ మెట్రోని, విమానాశ్రయం వరకు మెట్రోని చేపట్టాలనే ఆలోచనలో సర్కారు ఉంది. నిధులు కేటాయిస్తే పాతబస్తీ మార్గంలో ఆస్తుల సేకరణ చేపట్టనున్నారు. సేకరించాల్సిన ఆస్తులు 1000కిపైగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటి స్కెచ్‌లను కూడా ఇదివరకే సిద్ధం చేశారు.

ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా 5.5 కి.మీ. మెట్రో మార్గంలో 5 స్టేషన్లు ఉన్నాయి. సాలార్‌జంగ్‌ మ్యూజియం, చార్మినార్‌, శాలిబండ, షంషీర్‌గంజ్‌, ఫలక్‌నుమా  ప్రాంతాల్లో అవి రాబోతున్నాయి. ప్రాజెక్ట్‌ నిర్మాణ వ్యయం రూ.2వేల కోట్లు అవుతుందని అంచనా. భూసేకరణకు నాలుగు వందల కోట్లయ్యే అవకాశముందని అంచనా.

80 అడుగులకు పరిమితం..

  • ఐదున్నర కి.మీ. మార్గంలో 21 మసీదులు, 12 ఆలయాలు, 12 అషుర్ఖానాలు, 33 దర్గాలు, 7 శ్మశాన వాటికలు, 6 చిల్లాలతో సహా 103 మతపరమైన నిర్మాణాలున్నాయి. వీటిని పరిరక్షించేందుకు రహదారి విస్తరణ 80 అడుగులకు పరిమితం చేశారు.  
  • మలుపులున్నచోట్ల వంద అడుగుల దాకా ఉంటుంది. మొదటి దశ అనుభవాల దృష్ట్యా స్టేషన్లవద్ద ట్రాఫిక్‌ చిక్కులు తలెత్తకుండా రోడ్డు 120 అడుగులకు విస్తరించాలని నిర్ణయించారు.

చిక్కుముడులు ఉన్నాయ్‌..

వాస్తవంగా మొదటి దశలోని ఈ మార్గాన్ని పీపీపీలో చేపట్టిన ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ పూర్తిచేయాలి. అలైన్‌మెంట్‌ వివాదాలతో ఆలస్యంతో వ్యయం పెరిగిందని సదరు సంస్థ ఎంజీబీఎస్‌ వరకే కారిడార్‌ 2 నిర్మించింది. ఈ అంశంపై కొత్త సర్కారు సదరు సంస్థతో చర్చించే అవకాశం ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి మెట్రోపై నిర్వహించిన తొలి సమీక్షలోనూ ఒప్పందం ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ సంస్థతోనే పనులు చేయిస్తారా? సర్కారు ఆలోచనలు ఏమిటీ అనేది స్పష్టత రావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని