logo

బల్దియా.. బచావో!

రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌ మహా నగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ)కు రూ.1100 కోట్లు కేటాయించినట్లు ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. అధికారిక సమాచారం మాత్రం బల్దియాకు చేరలేదు.

Updated : 28 Feb 2024 05:30 IST

నిధుల్లేక స్తంభించిన పనులు, పాలన
రూ.1100 కోట్ల కేటాయింపులపై ఆశలు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌ మహా నగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ)కు రూ.1100 కోట్లు కేటాయించినట్లు ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. అధికారిక సమాచారం మాత్రం బల్దియాకు చేరలేదు. ప్రస్తుతం ఖజానాలో చిల్లిగవ్వ లేకపోవడంతో గ్రేటర్‌లో అభివృద్ధి పనులన్నీ నిల్చిపోయాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు బల్దియాకు పెద్ద మొత్తంలో నిధులు వచ్చేది సందేహాస్పదంగానే ఉంది.

బల్దియా పదేళ్ల కిందట బ్యాంకులో రూ.5 వేల కోట్ల డిపాజిట్లతో ఉండేది. తరువాత సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్దఎత్తున నిధులు కేటాయించకపోవడం, మరోవైపు ఆస్తి పన్ను పెంపునకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆర్థికంగా కుదేలైంది. కొన్నేళ్లుగా బల్దియాకు ఏటా సమకూరే నిధులతో ఉద్యోగుల జీతాలు, మరి కొంతమొత్తం రోడ్లు ఇతరాల నిర్వహణే కష్టంగా సాగుతోంది. ఎస్‌ఆర్‌డీపీ కింద రోడ్లు, ఆకాశ మార్గాల నిర్మాణానికి దాదాపు రూ.4 వేల కోట్ల వరకు రుణాలు తీసుకున్నారు. ఆ రుణం ఖర్చయిపోయినా మొదటి దశ పనులే పూర్తికాలేదు. నాలాల విస్తరణ పరిస్థితి ఇలానే ఉంది. నిధులు లేకపోవడంతో గుత్తేదారులు ఎక్కడి పనులు అక్కడే నిలిపివేశారు. ఇటీవల రాష్ట్ర బడ్జెట్‌లో పురపాలక శాఖకు రూ.11,000 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1100 కోట్లు బల్దియాకు కేటాయించారని డిప్యూటీ మేయర్‌ శ్రీలత చెబుతున్నారు. దీనిపై పురపాలక శాఖ ఉన్నతాధికారిని అడిగితే.. ఇంకా ఆర్థిక శాఖ నుంచి వివరాలు అందలేదని స్పష్టంచేశారు. ఇటీవల కొద్దిసమయం బల్దియాపై ముఖ్యమంత్రి సమీక్ష చేసినా ఈ విషయంలో ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు. మరో రెండుమూడు రోజుల్లో సీఎం పూర్తి స్థాయిలో సమీక్షించబోతున్నారు. ఆ సమయంలో బడ్జెట్‌లో నిధుల కేటాయింపులపైనా, ఎస్‌ఆర్‌డీపీకి రుణం తీసుకోవడంపైనా స్పష్టత రావచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఎక్కడివక్కడే ఆగాయ్‌..

  • బల్దియా పరిధిలో గుత్తేదారులకు రూ.800 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో కొత్తగా పనులకు ముందుకు రావడంలేదు. దాదాపు రూ.500కోట్ల మేర రోడ్లు, నాలాల మరమ్మతు పనులకు గుత్తేదార్లు ముందుకు రాక రెండునెలలుగా ఎక్కడివక్కడే ఆగిపోయాయి.
  • నిర్మాణం నిలిచిపోయిన 30వేల రెండు పడకగదుల ఇళ్లను పూర్తి చేయాలన్నా, ఇప్పటికే పూర్తిచేసిన 20వేల ఇళ్ల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా కనీసం రూ.1000 కోట్లు అవసరం. గుత్తేదారులకు మరో రూ.1000 కోట్లు ఇవ్వాల్సిఉంది.
  • ఎస్‌ఆర్‌డీపీ కింద రోడ్ల విస్తరణ, ఆకాశమార్గాల నిర్మాణ పనులూ నిధుల్లేక నిలిచాయి. కనీసం రూ.2వేల కోట్లు, మరికొన్ని పనులకు మరో రూ.3వేల కోట్లు కావాలని అధికారులు తేల్చారు. ఈ మొత్తం రుణం తీసుకోవడానికి అనుమతిస్తేనే పనులు జరిగే అవకాశముంది.
  • కొత్త నాలాల నిర్మాణం, ఉన్నవాటిలో ఆక్రమణల తొలగింపు పనులు ఏడాదిన్నర కిందట మొదలుపెట్టారు. కొన్ని పూర్తి చేశారు. మిగిలినవి పూర్తి చేసి కొత్తగా పనులు చేపట్టాలంటే మరో రూ.1500 కోట్లు అవసరమని తేల్చారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని