logo

Hyderabad: అద్దాల భవనం.. పార్కింగ్‌ ఆధునికం

నగరం నడిబొడ్డున నిర్మాణం చేపట్టిన బహుళ అంతస్తుల పార్కింగ్‌ సముదాయం బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. ఐదేళ్లుగా పనులు కొనసాగుతుండగా 15 అంతస్తుల భవనం ఎట్టకేలకు పూర్తయ్యే దశకు చేరుకుంది.

Updated : 28 Feb 2024 08:55 IST

ఐదేళ్లుగా పనులు.. ముందుభాగం పూర్తి

ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మాణం

అందుబాటులోకి రానున్న జర్మన్‌ సాంకేతికత

నగరం నడిబొడ్డున నిర్మాణం చేపట్టిన బహుళ అంతస్తుల పార్కింగ్‌ సముదాయం బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. ఐదేళ్లుగా పనులు కొనసాగుతుండగా 15 అంతస్తుల భవనం ఎట్టకేలకు పూర్తయ్యే దశకు చేరుకుంది. ఎలివేషన్‌ వరకు పూర్తయినా.. లోపల ఆటోమేటిక్‌ పార్కింగ్‌ వ్యవస్థను బిగించాల్సిఉంది. పూర్తి చేసేందుకు సమయం పట్టేలాఉంది.

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో పార్కింగ్‌ సమస్యలను తీర్చేందుకు ప్రయోగాత్మకంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో నాంపల్లి ప్రధాన రహదారి పక్కనే మెట్రో భూమిలో ఈ ప్రాజెక్టు చేపట్టారు. ప్రభుత్వం స్థలం కేటాయించగా.. ప్రైవేటు సంస్థ అత్యాధునిక బహుళ అంతస్తుల పార్కింగ్‌ వ్యవస్థను ఏర్పాటుచేసి నిర్వహిస్తామని ముందుకొచ్చింది. 2018లో భూమిపూజ చేశారు. ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

ప్రీకాస్టింగ్‌తో..

పనులు ప్రారంభించిన కొద్దినెలల్లోనే కరోనా ప్రభావంతో రెండేళ్లు నిలిచిపోయాయి. తర్వాత ప్రాజెక్టు దక్కించుకున్న సంస్థ నిధుల సమస్యతో పనులు నెమ్మదిగా సాగి ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. ప్రీకాస్టింగ్‌ విధానంలో చేపడుతున్న భవనం ఇప్పుడో కొలిక్కి వచ్చింది. లోపల పనులు పూర్తిచేయాల్సి ఉంది. 

పూర్తి ఆటోమేటిక్‌ వ్యవస్థ

పూర్తయిన 15 అంతస్తుల భవనంలో పైన 10 అంతస్తుల్లో పార్కింగ్‌ సదుపాయాలుంటాయి. 250 కార్లు, 100 వరకు ద్విచక్ర వాహనాలను ఇక్కడ నిలపవచ్చు. జర్మన్‌ సాంకేతికతతో పూర్తిగా ఆటోమెటిక్‌గా నడిచే మొట్టమొదటి బహుళ అంతస్తు పార్కింగ్‌ సముదాయం ఇది. మొదటి 5 అంతస్తులను వాణిజ్య కార్యకలాపాలకు సదరు సంస్థ లీజుకు ఇస్తుంది. వచ్చే ఆదాయంతో ప్రాజెక్ట్‌ వ్యయాన్ని రాబట్టుకుంది. గంటలను బట్టి పార్కింగ్‌ రుసుములు ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌ విజయవంతమైతే పీపీపీ విధానంలో నగరంలో మరో 40 చోట్ల ఏర్పాటుచేయాలనేది ఆలోచన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని